హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్టు
ABN , Publish Date - Dec 20 , 2024 | 12:41 AM
రెండు రోజుల క్రితం గాజులదిన్నె ప్రాజెక్టు ఎల్లెల్సీ దగ్గర వడ్డె అరవిందస్వామిపై జరిగిన హత్యాయత్నం కేసులో అతని ప్రియురాలితో పాటు మరో నలుగురిని గురువారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు.
గోనెగండ్ల, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): రెండు రోజుల క్రితం గాజులదిన్నె ప్రాజెక్టు ఎల్లెల్సీ దగ్గర వడ్డె అరవిందస్వామిపై జరిగిన హత్యాయత్నం కేసులో అతని ప్రియురాలితో పాటు మరో నలుగురిని గురువారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. దాడికి పాల్పడిన వారంతా ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్, బీ ఫార్మసీ చదువుకునే విద్యార్థులు కావడం గమనార్హం. నిందితుడు ఈడిగ భరత్ ఎమ్మిగనూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ సీఈసీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. నిందితురాలు కూడా అదే కళాశాలలో బీటెక్ చదువుతోంది. ఎరుకలి రామాంజనేయులు, వడ్ల కుమారస్వామి ఇద్దరు బీ ఫార్మసి చదువుతున్నారు. గంధాల ప్రశాంత్ మాత్రం 10వ తరగతి చదువుతూ నాపరాతి బండల పని చేస్తున్నాడు. గురువారం సాయంత్రం అగ్రహారం దగ్గర ఉన్న మల్లెల వంక వాగులో నిందితురాలైన యువతితో పాటు భరత్, వడ్ల కుమారస్వామి, ప్రశాంత్‌కుమార్, ఎరుకలి రామాంజనేయులు దాక్కున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి వారిని అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి ఐదు సెల్‌ఫోన్లు, వేట కొడవళ్లు, పల్సర్ మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందుతులు ఐదుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ గంగాధర్ తెలిపారు. గతంలో కూడా భరత్ గ్యాంగ్ అరవిందస్వామిని హత్య చేసేందుకు వేటకొడవళ్లు, పిడిబాకులతో ఇంటి పరిసరాల్లో తిరిగారు. అయితే అరవిందస్వామి వీరి దొరకకుండా తప్పించుకున్నాడని వివరించారు.