Share News

కర్నూలులో హైకోర్టు బెంచ్‌..!

ABN , Publish Date - Nov 21 , 2024 | 12:13 AM

శ్రీ బాగ్‌ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఈనాటిది కాదు. స్వాతంత్ర్యానికి పూర్వమే 1937 నుంచి సీమ ప్రజల హృదయాల్లో ఉంది.

కర్నూలులో హైకోర్టు బెంచ్‌..!

‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు స్పష్టమైన హామీ

న్యాయ రాజధాని, హైకోర్టు పేరిట గత ఐదేళ్లలో మోసం

టీడీపీ కూటమి ప్రభుత్వం రాకతో కదులుతున్న బెంచ్‌ ఫైల్‌

శ్రీ బాగ్‌ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఈనాటిది కాదు. స్వాతంత్ర్యానికి పూర్వమే 1937 నుంచి సీమ ప్రజల హృదయాల్లో ఉంది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాలుగా స్వప్నంగానే మిగిలిపోయింది. కర్నూలులో ‘హైకోర్టు బెంచ్‌’ ఏర్పాటు చేస్తాం అంటూ 2019 ఎన్నికల్లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. అధికారం చేపట్టిన వైసీపీ న్యాయ రాజధాని, హైకోర్టు.. అంటూ ఐదేళ్లు మభ్యపెట్టింది. ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో ఎత్తులు వేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం.. అధికారంలోకి రాగానే ప్రక్రియ మొదలు పెడతామని ‘ప్రజాగళం’ సభలో అప్పటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే కసరత్తు మొదలు పెట్టారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు కోసం తక్షణ చర్యలు మొదలు పెట్టాలని కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు టీడీపీ కూట మి ప్రభుత్వం లేఖ రాసింది. అంతేకాకుండా బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు తీర్మానం చేశారు.

కర్నూలు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ (సీడెడ్‌ జిల్లాలు), ఆంధ్ర ప్రాంతం మద్రాసు రాష్ట్రంలో ఉండేవి. తమిళులు ఆధిపత్యం కారణంగా 1913లో ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి బీజం పడింది. అయితే ఈ విషయంలో కోస్తాంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య వివిధ అంశాలపై విభేదాలు తలెత్తాయి. అపోహాలు, విభేదాలు తొలగించేందుకు ఇరుప్రాంతాలకు చెందిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, హాలహర్వి సీతారామిరెడ్డి, కడప కోటిరెడ్డి, కొండా వెంకటప్పయ్య, టీఎన్‌ రామకృష్ణారెడ్డి, మహబూబ్‌ అలీబేగ్‌, దేశిరాజు హనుమంతరావు, కల్లూరు సుబ్బారావు, వరదాచారి, పప్పూరి రామాచారి, సుబ్బరామిరెడ్డి, దేశపాండ్య సుబ్బారావు, మల్లిపూడి పల్లం రాజులతో ఏర్పడిన సంఘం 1937 నవంబరు 16న మద్రాస్‌లోని కాశీనాథుని నాగేశ్వరరావు స్వగృహం ‘శ్రీబాగ్‌’ భవనంలో సమావేశమైంది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యాక 1. రాజధాని లేదా హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు, 2. కృష్ణా, తుంగభద్ర జలాలలో రాయలసీమ, నెల్లూరుకు ప్రథమ ప్రాధాన్యత, 3. రాయలసీమలో విశ్వవిద్యాలయం, 4. శాసనసభ స్థానాల్లో ఇరుప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి.. అనే అంశాలపై ఏకాభిప్రాయంతో ఒప్పందం చేసుకున్నారు. శ్రీబాగ్‌ భవనంలో ఒప్పందం జరగడంతో ‘శ్రీబాగ్‌ ఒడంబడిక’గా పిలుస్తూ వచ్చారు. 1952 అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు తరువాత రాయలసీమ ప్రాంతం కర్నూలులో రాజధాని, కోస్తాంధ్ర ప్రాంతం గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేశారు. 1956 నవంబరు 1న ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణను కలిపి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. రాజధాని, హైకోర్టు హైదరాబాద్‌కు తరలిపోయాయి. శ్రీబాగ్‌ ఒప్పందం నీరుగారిపోయింది. 2014లో రాష్ట్ర విభజన తరువాత శ్రీబాగ్‌ ఒడంబడిక అమలు డిమాండ్‌ తెరపైకి వచ్చింది. అమరావతి రాజధానిగా చేయడంతో కర్నూలులో హైకోర్టు పెట్టాలనే న్యాయవాదులు, విద్యార్థులు ఉద్యమాలకు సై అన్నారు.

ఐదేళ్లు మభ్యపెట్టిన వైసీపీ..

శ్రీబాగ్‌ ఒడంబడిక అమలు చేయాలి.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు డిమాండ్‌తో 2018 నవంబరు 16న రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో సీమ ప్రజా సంఘాల సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు, విద్యార్థులతోపాటు ప్రజా సంఘాలు వివిధ రూపాల్లో పోరాటాలకు సై అన్నాయి. ఆ సమయంలో కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని ఆనాటి సీఎం చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లోనూ ఇదే హామీ ఇచ్చారు. అయితే అప్పట్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్‌ సీఎం బాధ్యతలు చేపట్టాక మూడు రాజధానులు పేరిట మాయ చేశారు. కర్నూలు న్యాయ రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేస్తామంటూ సీమ ప్రజలను ఐదేళ్లు మభ్యపెట్టారు. జిల్లాకు చెందిన నాటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి జగన్నాథగట్టుపై చుట్టూ 25 కిలోమీటర్లు అందంగా కనిపించే హైకోర్టు భవనం నిర్మిస్తామని ఎస్టీబీసీ కాలేజీ వేదికగా జరిగిన సీమ గర్జన సభలో గర్జించారే తప్పా ఆచరణలో పెట్టలేదు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగళం సభలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామనే హామీకి టీడీపీ కట్టుబడి ఉంది. తమ కూటమి ప్రభుత్వం రాగానే బెంచ్‌ ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు అదే హామీని ప్రజల్లోకి తీసుకెళ్లారు.

బెంచ్‌ ఏర్పాటుకు అడుగులు.. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు లేఖ

ప్రజాగళం సందర్భంగా ‘కర్నూలులో హైకోర్టు బెంచ్‌’ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. న్యాయ సమీక్షలో కర్నూలులో బెంచ్‌ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలి కోరుతూ లీగల్‌ అండ్‌ లెజిస్లేటివ్‌ అఫైర్స్‌ అండ్‌ జస్టిస్‌, లా డిపార్ట్‌మెంట్‌ ప్రభుత్వ కార్యదర్శి వి.సుమీ అక్టోబరు 28న హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు లేఖ రాశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు ఆవశ్యకతను స్పష్టంగా ఆ లేఖలో వివరించారు. ఇది ప్రజల డిమాండ్‌.. ప్రజాగళంలో స్పష్టమైన హామీ ఇచ్చారు. 1952లో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాత రాజధాని హైదరాబాద్‌కు రాజధాని వెళ్లింది. 2014లో రాష్ట్ర పునర్వ్యస్థీకరణ తర్వాత రాజధాని, హైకోర్టు అమరావతికి మార్చారు. దేశంలో పలు రాష్ట్రాల్లో హైకోర్టులు బెంచ్‌లు ఏర్పాటు చేశారు. బెంచ్‌ ఏర్పాటు కోసం ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వం కలిసి అంగీకరించాల్సి ఉంది. రాయలీ సమ ప్రాంతం 2022లో జిల్లాల పునర్వ్యస్థీకరణ తరువాత 8 జిల్లాలుగా ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో 25 శాతం 1.59 కోట్లు, వైశాల్యంలో 43 శాతం రాయలసీమ జిల్లాలే ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి అమరావతిలోని హైకోర్టుకు వెళ్లడం సామాన్యులకు కష్టంగా ఉంది. కర్నూలు నుంచి విజయవాడకు రైలు రవాణా సౌకర్యం కూడా లేదు. రాయలసీమ ప్రాంతానికి కర్నూలు కేంద్రం కావడంతో అక్కడ హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు అవసరం ఉందని ఆ లేఖలో ప్రభుత్వం పేర్కొంది. అదే క్రమంలో బెంచ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రివర్గ సమావేశంలో కూడా తీర్మానం చేశారు.

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేసి తీరుతాం

శ్రీబాగ్‌ ఒడంబడిక అమలులో సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో ఉన్నారు. హైకోర్టు బెంచ్‌తో పాటు కృష్ణా జలాలు వినియోగంలోనూ టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. వైసీపీ ప్రభుత్వం లాగా మాటలతో మాయ చేయడం చంద్రబాబుకు రాదు. బెంచ్‌పై ఇప్పటికే హైకోర్టుకు లేఖ రాశాం.. మంత్రివర్గం సమావేశంలో తీర్మానం కూడా చేశాం. లోకాయుక్త, ఏపీ మావన హక్కుల కమిషన్‌లు కర్నూలులోనే ఉంటాయని మంత్రివర్గంలో సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. - టీజీ భరత్‌, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి

హైకోర్టు బెంచ్‌ పట్ల హర్షం

సీఎం ఫ్లెక్సీకి న్యాయవాదుల క్షీరాభిషేకం

కర్నూలు లీగల్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్‌లో ఆమోదించడం పట్ల కర్నూలు న్యాయవా దులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో, యువగళం సందర్భంగా నారా లోకేశ్‌ ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్‌కు రాష్ట్ర క్యాబినెట్‌ బుధ వారం అంగీకరించింది. దీంతో న్యాయవాదులు సీఎం చంద్రబాబు ఫ్లెక్సీకి క్షీరాభి షేకం చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు సాధన జేఏసీ కన్వీనర్‌ వై. జయరాజు మాట్లాడుతూ హైకోర్టు బెంచ్‌ను సాధ్యమైనంత తొందరలో ఏర్పాటు చేయాలని కోరారు. కర్నూలులో ఉన్న మానవ హక్కుల కమిషన్‌, లోకాయుక్త, వక్ఫ్‌ ట్రిబ్యునల్స్‌ను కర్నూలులోనే కొనసాగిం చాలని డిమాండ్‌ చేశారు. కర్నూలు బార్‌ అసోసియేషణ్‌ అధ్యక్షుడు కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి బీఎస్‌ రవికాంత్‌ ప్రసాద్‌, బీజేపీ లీగల్‌ సెల్‌ నాయకుడు మోహన్‌ ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం ప్రకటించారు.

Updated Date - Nov 21 , 2024 | 12:13 AM