Share News

ఈ ప్రభుత్వం కూడా ఇంతేనా?

ABN , Publish Date - Sep 20 , 2024 | 11:56 PM

ప్రభుత్వం మారితే తలరాతలు మారుతాయనుకున్న రైతులకు అడియాశలే మిగిలాయి.

ఈ ప్రభుత్వం కూడా ఇంతేనా?
77 చెరువులకు కృష్ణా జలాలు ఎత్తిపోసే హంద్రీనీవా ప్రధాన కాలువ

చివరికి 19 చెరువులకే కుదింపు

ఇప్పటికే రూ.221 కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చు

నిర్వహణ సిబ్బంది లేక నెరవేరని లక్ష్యం

52 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని ఇవ్వాలని ప్రతిపాదన

టీడీపీ కూటమి ప్రభుత్వంలోనూ అదే నిర్లక్ష్యం

డోన్‌, పత్తికొండ ఎమ్మెల్యేలు దృష్టి సారించపోతే కరువు రైతులకు కన్నీళ్లే

ప్రభుత్వం మారితే తలరాతలు మారుతాయనుకున్న రైతులకు అడియాశలే మిగిలాయి. హంద్రీనీవా కాలువ నుంచి 77 చెరువులకు కృష్ణా జలాలు ఎత్తిపోయడంపై ఆనాటి వైసీపీ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యమే నేటి టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా ప్రదర్శిస్తున్నది. వైఎస్‌ జగన్‌ చేసిన తప్పిదాలను చంద్రబాబు సవరిస్తారని అనుకున్న జనం ఈ ప్రభుత్వం కూడా ఇంతేనా? అని ఆవేదన చెందుతున్నారు. నిత్యం కరువుతో తల్లడిల్లే డోన్‌, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లో కరువు రైతులకు క‘న్నీటి’ కష్టాలు తప్పడం లేదు. కళ్ల ముందే కృష్ణా జలాలు జిల్లా సరిహద్దులు తరలిపోతున్నాయి. ఆ నీటిని ఎత్తిపోసేందుకు రూ.221 కోట్లకు పైగా ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ఎత్తిపోతల పథకం సిద్ధంగా ఉంది. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధి. 52 మంది ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని నియమిస్తే.. కృష్ణా జలాలు ఎత్తిపోసి 68 చెరువులు నింపుతామని ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపితే గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కొత్తగా వచ్చిన టీడీపీ ప్రభుత్వం మేమేం తక్కువ అన్నట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదలనకు పలు కొర్రీలు పెట్టి వెనక్కి నెట్టేసింది. నిర్వహణ సిబ్బంది నియమించకపోవడంతో 19 చెరువులను మాత్రమే నింపుతున్నారు. వాటిలో 13 చెరువులు డోన్‌ నియోజకవర్గంలో ఉన్నాయి.

కర్నూలు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైన పత్తికొండ, ఆలూరు, డోన్‌ నియోజకవర్గాల్లో ఏటేటా కరువు దరువేస్తున్నది. కరువు.. వలసలు కవలల్లా వెంటాడుతున్నాయి. ఈ నియోజకవర్గాల గుండా హంద్రీ నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రధాన కాలువ ప్రవహిస్తున్నది. కృష్ణా జలాలు జిల్లా సరిహద్దులు దాటిపోతున్నా.. జిల్లాలోని మెట్ట పొలాలకు మళ్లించలేని పరిస్థితి ఉంది. రాయలకాలంలో తవ్విన చెరువులు వర్షాభావం వల్ల ఒట్టిపోతున్నాయి. సాగునీరు దేవుడెరుగు.. మూగ జీవాలకు తాగునీరు అందని దైన్యపరిస్థితి ఉంది. హందీ-నీవా కాలువ కుడి, ఎడమ వైపుల ఉన్న ఆయా గ్రామాల 105 చెరువులకు కృష్ణా జలాలు ఎత్తిపోసి పల్లెసీమ రైతుల కన్నీళ్లు తుడవాలనే సంకల్పంతో రాష్ట్ర విభజన తరువాత ఆనాటి టీడీపీ ప్రభుత్వం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సీఎంచంద్రబాబు ఒత్తితెచ్చి రూ.224.31 కోట్లు మంజూరు చేయించారు. ఫేజ్‌-1 కింద 1.238 టీఎంసీలు ఎత్తిపోసి 68 చెరువులు నింపే పనులకు 2018 మార్చి 20న జీవో నంబరు 169 జారీ చేశారు. కోయా కంపెనీ ఈ పనులను దక్కించుకుంది. గత టీడీపీ ప్రభుత్వంలోనే 35 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మొదట్లో నిర్లక్ష్యం చేసినా.. గత ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చొరవతో ఎట్టకేలకు 90-95 శాతం పనులు పూర్తి చేశారు. ఎన్నికల ముందు హడావుడిగా నాటి సీఎం జగన్‌ చేత ప్రారంభించారు. 68 చెరువుల నుంచి 77 చెరువులకు పెంచారు. రివైజ్డ్‌ ఎస్టిమేషన్‌ (ఆర్‌ఏ) రూ.267.23 కోట్లకు అంచనాలు పెంచారు. అయితే.. ఈ ప్రాజెక్టు నిర్వహణ కోసం అవసరమైన ఓట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నియమకాన్ని మాత్రం నాటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడే అదే శాపంగా మారింది.

నీరు ఎత్తిపోస్తున్న చెరువులు ఇవే..

డోన్‌ నియోజకవర్గం : డోన్‌ మండలం ఎల్లారెడ్డి చెరువు, మల్లెంపల్లె చెరువు, వెంకటాపురం ఎంఐ చెరువు, ఉడుములపాడు చెరువు, యాపదిన్నె చెరువు, ఓబులాపురం నడిమి కంటు, జమ్మికుంట, కల్పన కుంట, చనుగొండ్ల చెరువు, నల్లచెరువు, ప్యాపిలి మండలం సర్దార్‌కుంట, ఎనుగుమర్రి ఎంఐ చెరువు.

పత్తికొండ నియోజకవర్గం: కృష్ణగిరి మండలం గుంటి రంగనాథస్వామి చెక్‌డ్యాం, కటారుకొండ చెరువు, అలంకొండ చెరువు, తుగ్గలి మండలం బొందిమడుగుల చెరువు, ముక్కెల్ల చెరువు, రాంపల్లి చెరువు, అయ్యవారికుంట.

ఎమ్మెల్యేలు చొరవ చూపకపోతే కన్నీళ్లే!

హంద్రీ నీవా కాలువలో నీళ్లున్నా చెరువులు నింపుకోలేని దైన్యం. నాడు వైసీపీ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యమే.. నేడు కూటమి ప్రభుత్వం చూపుతోంది. నిధులు ఇవ్వకపోతే నిర్వహణ సాధ్యమా..? చెరువులు నింపగలరా..? పాలకులకు ఆ మాత్రం చిత్తశుద్ధి లేదా..? అని కరువు రైతులు ప్రశ్నిస్తున్నారు. డోన్‌, పత్తికొండ ఎమ్మెల్యేలు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, కేఈ శ్యాంబాబు ప్రత్యేక చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు. సీఎం చంద్రబాబు, జలవనరులు శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుపై ఒత్తిడి తెచ్చి నిర్వహణ సిబ్బంది నియామకం, నిధులు మంజూరు చేయించాలి. లేదంటే ఆ ప్రాజెక్టు కూడా మరో గురురాఘవేంద్ర ప్రాజెక్టులా మారే ప్రమాదం ఉంది.

కొర్రీలు పెట్టి వెనక్కి పంపేశారు

ఒప్పందం మేరకు కాంట్రాక్ట్‌ సంస్థ హంద్రీనీవా కాలువ నుంచి 77 చెరువులకు నీటిని పోత్తిపోసే ప్రధాన పంప్‌హౌస్‌, డెలివరీ ఛాంబర్‌, 200 కిలోమీటర్ల పైప్‌లైన్‌, 159 క్యూసెక్కులు ఎత్తిపోతల సామర్థ్యంతో మూడు 3800 హెచ్‌పీ విద్యుత్‌ పంపులు (ఒక్కొక్కటి 53 క్యూసెక్కులు) ఏర్పాటు మాత్రమే చేయాలి. చెరువులకు నీరు మళ్లించే బాధ్యత ఇరిగేషన్‌ అధికారులదే. పంప్‌హౌస్‌, డెలివరీ ఛాంబర్‌, పైపులైన్‌ నిర్వహణ కోసం రెండు సిఫ్టులలో పని చేయడానికి 84 మంది ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నియమించాలని, ఇందుకు నెలకు రూ.15 లక్షలు చొప్పున ఏడాది రూ.1.80 కోట్లు నిధులు మంజూరు చేయాలని కోరుతూ పనులు పర్యవేక్షిస్తున్న జలవనరుల శాక ఎఫ్‌ఆర్‌ఎల్‌ డివిజన్‌ ఇంజనీర్లు ప్రాజెక్ట్స్‌ సీఈ కబీర్‌బాషా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పంప్‌హౌస్‌, డెలివరీ ఛాంబర్‌ నిర్వహణకు మూడు షిఫ్టులకు 18 మంది, గ్రావిటీ మెయిన్‌ పైప్‌లైన్‌, డెలివరీ సిస్టమ్‌, డిస్టిబ్యూటరీ సిస్టమ్‌ నిర్వహణకు ఒక్క ిషిఫ్టుకు లస్కర్లు 27, సూపర్‌వైజర్లు ఐదుగురు చొప్పున రెండు షిఫ్టులకు 64 మంది కలిపి మొత్తం 82 మంది సిబ్బంది అవసరమైన, ఔట్‌ సోర్సింగ్‌ జీవో మేరకు ఒక్కొక్కరికి రూ.15-18 వేలు ప్రకారం నెలనెలా వేతనం చెల్లించాలని ప్రతిపాదించారు. ఆ ఫైలును జలవనరుల శాఖ రాష్ట్ర అధికారులు కొర్రీలు పెట్టి వెనక్కి నెట్టేశారు.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం

హంద్రీనీవా కాలువ నుంచి 77 చెరువులకు కృష్ణా జలాలు ఎత్తిపోయాలంటే 200 కిలోమీటర్ల పైపులైన్‌ ఉంది. 8 కిలోమీటర్లకు రెండు షిఫ్టుల్లో ఇద్దరు ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది అవసరం ఉంది. పంప్‌హౌస్‌, డెలివరీ ఛాంబర్‌, సిస్టమ్‌, డిస్ర్టిబ్యూటరీలను నిర్వహించాలి. దాదాపు 82 మంది సిబ్బంది అవసరం ఉంటుంది. నెలకు రూ.15 లక్షలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రస్తుతం 19 చెరువులను మాత్రమే నింపుతున్నాం.

- రామకృష్ణ, డీఈఈ, ఎఫ్‌ఆర్‌ఎల్‌ సబ్‌ డివిజన్‌, కర్నూలు

Updated Date - Sep 20 , 2024 | 11:56 PM