Share News

చాలా బాధగా ఉంది..

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:44 PM

‘చాలా బాధగా ఉంది. ఇన్నేళ్లపాటు నన్ను, మా కుటుంబాన్ని ఇంతగా ఆదరించిన మిమ్మల్ని విడిచి దూరంగా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది...’

చాలా బాధగా ఉంది..

ఒక లక్ష్యంతో పార్టీలోకి వచ్చాను

కోడుమూరుకు దూరంగా ఉండలేకున్నా..

గుండ్రేవుల, వేదవతి సాధించే వరకు నిద్రపోను

సభలో కంటతడి పెట్టిన కోట్ల

కోడుమూరు, ఏప్రిల్‌ 18: ‘చాలా బాధగా ఉంది. ఇన్నేళ్లపాటు నన్ను, మా కుటుంబాన్ని ఇంతగా ఆదరించిన మిమ్మల్ని విడిచి దూరంగా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది...’ అంటూ మాజీ కేంద్రమంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌ రెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. కోడుమూరు నియోజకవర్గ ప్రజలు తన కుటుంబాన్ని ఎంతగానో ఆదరించారని, వారందరినీ వదిలి డోన్‌లో పోటీ చేస్తున్నానన్నారు. కోడుమూరులో గురువారం కోట్ల కుటుంబం అభిమానులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీని వీడి ఒక లక్ష్యంతో టీడీపీలోకి వచ్చానని అన్నారు. ఆర్డీఎస్‌, ఎల్లెల్సీ గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులను సాధించేంత వరకు తాను నిద్రపోనన్నారు. ‘కర్నూలు పార్లమెంటు నుంచి తాను పోటీ చేయలేదని 14 లక్షల మంది ఓటర్లు బాధపడుతున్నారు. కానీ డోన్‌ నియోజకవర్గంలోని రెండు లక్షల మంది ఓటర్లు సంతోషిస్తున్నారు. డోన్‌ ప్రజలు కూడా తన ఆత్మీయులే. పార్టీ ఆదేశాలను పాటించక తప్పడం లేదు..’ చెప్పారు. అయితే కర్నూలు జిల్లా ప్రజలు తనకు దేవుళ్లలాంటి వాళ్లని, వారిని వదిలి వెళ్లిపోవడాన్ని తట్టుకోలేపోతున్నానని కంటతడి పెట్టారు. ముఖ్యంగా కోడుమూరు నియోజకవర్గ ప్రజలను వదిలిపెట్టి వెళ్లాలంటే తట్టుకోలే పోతున్నానని గద్గ స్వరంతో అన్నారు. కాసేపు ఆయన తన నోటి వెంట మాటలు రాలేకపోయాయి.

కాసేపు నిశబ్ధ వాతావరణం

కోట్ల కుటుంబంపై తన అభిమానుల చూపిస్తున్న అభిమానం వర్ణిస్తూ కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి కంటతడి పెట్టారు. దీంతో అక్కడ నిశబ్ధ వాతావరణం చేటు చేసుకుంది. కోట్ల కంటతడిని చూడలేక అక్కడ ఉన్న కోట్ల అభిమానులు కూడా కన్నీరు పెట్టారు. నిశబ్ధ వాతావరణం నుంచి తేరుకున్న అనంతరం కోట్ల మాట్లాడుతూ పార్టీలో వర్గ విభేదాలు లేకుండా అందరూ కలిసి కట్టుగాపోతే తప్పకుండా టీడీపీ గెలుస్తుందని అన్నారు. టీడీపీ గెలవాలి కాబట్టి అభిమానులంతా కలిసి కట్టుగా పని చేసి కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరిని గెలిపించాలని కార్యకర్తలను కోరారు. తప్పకుండగా టీడీపీ అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక రైతు బిడ్డగా రైతులకు ఇచ్చిన హామీలను తప్పకుండగా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.

కోట్లకు క్షమాపణ కోరిన నాగరాజు!

కోడుమూరు నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశానికి కర్నూలు ఎంపీ అభ్యర్థి నాగరాజు సమావేశానికి రెండు గంటలు ఆలస్యంగా వచ్చారు. కర్నూల్లో నామినేషన్‌ వేయడం వల్ల సభకు ఆలస్యంగా వచ్చినందుకు తనను క్షమించాలని నాగరాజు కోట్లను కోరారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ కులమత బేధాలు లేకుండా అభిమానులతో ఉన్నానని అన్నారు. తనలాగే అందరిని కలుపుకొని వెళ్లాలని, లేకపోతే రాజకీయంలో భవిష్యత్తు ఉండదన్నారు. కార్యకర్తల సమావేశం ముగిసిన అనంతరం వచ్చిన బొగ్గుల దస్తగిరి నామినేషన్‌ వేయడం వల్ల తన రాక ఆలస్యమైందని కోట్లకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచు భాగ్యరత్న, మాజీ సర్పంచు కేఈ రాంబాబు, సీబీ లత, కోడుమూరు, గూడూరు, సి.బెళగల్‌ టీడీపీ నాయకులు కోట్ల కవితమ్మ, సుధాకర్‌రెడ్డి, గోవిందుగౌడ్‌, అమడగుంట్ల క్రిష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, తిరుమల్‌నాయుడు, సత్రం రామకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 11:44 PM