Share News

శ్రీగిరిపై కార్తీక కాంతులు

ABN , Publish Date - Nov 18 , 2024 | 12:05 AM

శ్రీశైలం మహక్షేత్రంలో కార్తీకమాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తీకమాసం పురస్కరించుకుని ఆదివారం క్షేత్రానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

శ్రీగిరిపై కార్తీక కాంతులు
దర్శనానికి కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు

నేడు లక్ష దీపోత్సవం, పుష్కరిణికి దశవిధ హారతులు

శ్రీశైలం, నవంబరు 17 (ఆంధ్రజోతి): శ్రీశైలం మహక్షేత్రంలో కార్తీకమాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తీకమాసం పురస్కరించుకుని ఆదివారం క్షేత్రానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో క్షేత్ర పురవీధులన్నీ భక్తులతో రద్దీగా దర్శనమిచ్చాయి. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిఅమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో స్వామివారి అలంకరణ దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. ఉదయం నుంచే భక్తులు ఆలయ ఉత్తర మాఢవీధి ప్రాంగణం వద్ద, దేవాలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద విశేష పూజలు నిర్వహించుకుని దీపారాధనలు చేశారు. దేవస్థానం అధికారులు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, బిస్కెట్లు, అల్పాహారం అందజేశారు. దర్శనానంతరం భక్తులకు అన్నదాన భవనంలో అన్నప్రసాద వితరణ అందజేస్తున్నారు. సాయంత్రం ఆలయ ధ్వజస్తభం వద్ద శాస్త్రోక్తంగా ఆకాశ దీపం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆకాశదీప ప్రజ్వలనకు ముందుగా అర్చకులు సంకల్పాన్ని పఠించారు. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతి పూజ నిర్వహించి, దీపప్రజ్వలన, దీపారాధనలు నిర్రవహించారు. కార్తీక మాసోత్సవాల సందర్బంగా దేవస్థానంలో అఖండ శివ భజనల కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆయా సదుపాయాలను కల్పించేందుకు దేవస్థానం కార్యాలయం సిబ్బందికి ప్రత్యేక విధులను కేటాయించారు.

నేడు లక్ష దీపోత్సవం, పుష్కరిణికి దశవిధ హారతులు

కార్తీక ముడవ సోమవారం పురస్కరించుకొని సాయంత్రం ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనుంది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషంగా పూజాధికాలు జరిపి అనంతరం పుష్కరిణికి దశవిధ హరతులు సమర్పించనున్నారు. లక్ష దీపోత్సవం కార్యక్రమం సందర్బంగా పుష్కరిణి ప్రాంగణమంతా దీపాలను ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - Nov 18 , 2024 | 12:05 AM