నడకతోనే ఆరోగ్యం: డీఎంహెచ్‌వో
ABN , Publish Date - Nov 25 , 2024 | 12:13 AM
ప్రతి ఒక్కరూ నడకను జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డీఎంహెచ్‌వో డా.ఎల్.భాస్కర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
కర్నూలు హాస్పిటల్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ నడకను జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డీఎంహెచ్‌వో డా.ఎల్.భాస్కర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 7 గంటలకు ధన్వంతరీ జయంతి వారోత్సవాల సందర్భంగా ఆరోగ్య భారతి కర్నూలు శాఖ నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద నడకతో ఆరోగ్యం కార్యక్రమం కింద మార్నింగ్ వాక్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ నడక పాతబస్టాండు అంబేడ్కర్ విగ్రహం నుంచి రాజ్‌విహార్ వివేకానంద సర్కిల్ వరకు తిరిగి పాతబస్టాండు వరకు కొనసాగింది. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ప్రతి మనిషికి శారీరక శ్రమ ఎంతో అవసరమన్నారు. ఆరోగ్య భారతి జిల్లా అధ్యక్షుడు డా.పి.మోక్షేశ్వరుడు, వీఆర్ హాస్పిటల్ క్యాన్సర్ శస్త్ర చికిత్స నిపుణుడు డా.సి.వాసురెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజూ 30 నిమిషాలు, వారంలో ఐదు రోజులు వ్యాయామంగానీ, నడక గానీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య భారతి రాష్ట్ర కార్యదర్శి రామశర్మ, ఉపాధ్యక్షులు డా.ద్వారం ప్రభాకర్ రెడ్డి, దంత వైద్యులు డా.పవన్ కుమార్ మౌలి, ఆయుర్వేద వైద్యులు మురళిధర్ పాల్గొన్నారు.