కర్నూలులో ‘కృష్ణా బోరు’్డ పెట్టాలి..!
ABN , Publish Date - Nov 25 , 2024 | 12:15 AM
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలు పంపిణీకి కేంద్రం శ్రీశైలం ప్రాజెక్టు. నీటి వివాదాలు తలెత్తినప్పుడు సామరస్యంగా పరిష్కరించాలంటే అందుబాటులోనే కృష్ణా బోర్డు ఉండాలి.
ఐఏబీలో ఎంపీ, ఎమ్మెల్యేలు తీర్మానం చేస్తారా?
రబీ సాగు నీటిపై స్పష్టత కావాలి
నేడు సాగునీటి సలహా మండలి సమావేశం
కర్నూలు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలు పంపిణీకి కేంద్రం శ్రీశైలం ప్రాజెక్టు. నీటి వివాదాలు తలెత్తినప్పుడు సామరస్యంగా పరిష్కరించాలంటే అందుబాటులోనే కృష్ణా బోర్డు ఉండాలి. అది కర్నూలులో ఏర్పాటు చేస్తేనే ప్రయోజనకరంగా ఉంటుందని రాయలసీమ సాగునీటి నిపుణులు దశాబ్ద కాలంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇందుకు విరుద్ధంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కృష్ణా జలాలు పంపిణీ, నీటి వివాదాల పరిష్కరం కోసం కర్నూలులోనే కృష్ణా నదీయాజమాన్య బోర్డు (కృష్ణా బోర్డు) పెట్టాలని సీమ రైతులు కోరుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటే నేడు జరగనున్న రబీ సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో ఏకాభిప్రాయంతో తీర్మానం చేయాలి. డిసెంబరు 3న జరిగే కేఆర్‌ఎంబీ సమావేశం అజెండాలో పెట్టి ఆమోదించేలా సీఎం చంద్రబాబును ఒప్పించాలి. తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ), గాజులదిన్నె ప్రాజెక్టు, హంద్రీనీవా కాలువ, కేసీ కాలువ కింద రబీ సాగునీటిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను 2014లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విభజించారు. రెండు రాష్ట్రాల మధ్య ప్రవహిస్తున్న కృష్ణా, గోదావరి నదుల నీటి పంపకాలు, వివాదాల పరిష్కరం కోసం ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 పార్ట్ 9 సెక్షన్-86 ప్రకారం కృష్ణా నదీయాజమాన్య బోర్డు (కృష్ణా బోర్డు), గోదావరి నదీయాజమాన్య బోర్డు (గోదావరి బోర్డు) ఏర్పాటు చేశారు. గోదావరి బోర్డు తెలంగాణలో, కృష్ణా బోర్డు ఏపీ కేంద్రంగా నిర్వహించాలని విభజన చట్టంలో పొందుపరిచారు. ఈ రెండు బోర్డులు కేంద్ర జలవనరుల శాఖ పరిధిలో పని చేసే స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు. రాష్ట్ర విభజన తరువాత పదేళ్లు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగించారు. కర్నూలులో కృష్ణా బోర్డు పెట్టాలని రాష్ట్ర విభజన నాటి నుంచి రాయలసీమ సాగునీటి నిపుణులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కర్నూలు, విజయవాడ కాకుండా కృష్ణా నదికి ఏమాత్రం సంబంధమే లేని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని 2021లో అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాటి సీఎం జగన్ నిర్ణయంపై రాయలసీమ రైతు, ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో కర్నూలులో ఏర్పాటు చేయడమే సముచితమని మెజార్టీ సాగునీటి నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరుగుతుంది. రెండు రాష్ట్రాలు విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నాయి. నీటి వినియోగంలో తరుచుగా వివాదాలు తలెత్తున్నాయి.
కృష్ణా నదీయాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పర్యవేక్షణలో ప్రధాన ప్రాజెక్టులు జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ఉన్నాయి. శ్రీశైలం డ్యాం ఎగువన నికర జలాలు, వరద జలాల ఆధారంగా ఏపీలో గాలేరు-నగరి, తెలుగుగంగ, హంద్రీనీవా, వెలిగొండ, తెలంగాణ కల్వకుర్తి, నెట్టంపాడు, పాలమూరు రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ వంటి కీలక ప్రాజెక్టులు కర్నూలుకు అత్యంత సమీపంలో ఉన్నాయి.
తుంగభద్ర జలాలు, సుంకేసుల బ్యారేజీ, కేసీ కెనాల్, ఆర్డీఎస్ వంటి ప్రాజెక్టులకు నీటి పంపిణీ, తుంగభద్ర బోర్డు నీటి కేటాయింపులు పర్యవేక్షించాల్సి ఉంటుంది.
రబీ సాగునీటిపై స్పష్టత ఇవ్వాలి
తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) కింద ఖరీఫ్‌లో 43,519 ఎకరాలు ఆయకట్టు ఉంది. 35 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామని జూన్‌లో జరిగిన ఐఏబీలో తీర్మానించారు. 2024-25 నీటి సంవత్సరంలో ఎల్లెల్సీ వాటాగా 24 టీఎంసీలకు గానూ 21 టీఎంసీలు కేటాయించారు. ఇప్పటికే 9.20 టీఎంసీలు వాడుకోగా.. 11.80 టీఎంసీలు మిగులు ఉన్నాయి. రబీలో 1.07,615 ఎకరాల ఆయకట్టు ఉండగా 45 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. గాజులదిన్నె జలాశయంలో 2.80 టీఎంసీలు నిల్వ ఉంటే.. 0.65 టీఎంసీలు నీటి ఆవిరిపోనూ 2.10 టీఎంసీలు అందుబాటులో ఉంటుంది. వేసవి తాగునీటి అవసరాలు ఈ జలాశయంపై ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కింద రబీ ఆయకట్టు 24,372 ఎకరాలు ఉంది. సాగునీరు ఇస్తారా.. లేదా..? అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. గురురాఘవేంద్ర ప్రాజెక్టు, హంద్రీనీవా కాలువ, మైనర్ ఇరిగేషన్, ఏపీఎస్‌ఐడీసీ పథకాల ద్వారా సాగునీరు ఇచ్చే అవకాశాలు లేవని అజెండాలో ఉంచారు. జీడీపీ ఆయకట్టుకు సాగునీటిపై స్పష్టత ఇవ్వాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.
డిసెంబరు 3న కేఆర్‌ఎంబీ భేటీ
డిసెంబరు 3న కేఆర్‌ఎంబీ సమావేశం ఉంది. ఇప్పటికే అజెండా అంశాలను రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించారు. జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కర్నూలులో కృష్ణా బోర్డు ఏర్పాటు చేయాలని నేడు జరిగే ఐఏబీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయాలి. అక్కడితో సరిపుచ్చకుండా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలి. కేఆర్‌ఎంబీ సమావేశంలో ఈ అంశం కూడా అజెండాలో చేర్చి ఆమోదించేలా రాజకీయంగా తీవ్ర ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.