Share News

గోడు వినండి..!

ABN , Publish Date - Nov 21 , 2024 | 12:10 AM

తుంగభద్ర బోర్డు పనుల్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు ప్రస్తుతం బోర్డు ఉద్యోగుల పాలిట శాపంగా మారాయి.

గోడు వినండి..!

తుంగభద్ర బోర్డు అకౌంట్‌ ఫ్రీజ్‌

ఉద్యోగులకు జీతాలు లేనట్టే

ఆందోళనలో టీబీపీ సిబ్బంది

ఉద్యోగులకు శాపంగా వైసీపీ నిర్వాకం

కర్నూలు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర బోర్డు పనుల్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు ప్రస్తుతం బోర్డు ఉద్యోగుల పాలిట శాపంగా మారాయి. మూడు నెలలుగా జీతాలు అందక ఆర్థిక అవస్థలు పడుతున్నారు. బోర్డు అకౌంట్‌ ఫ్రీజ్‌ తొలగించి.. నవంబరు ఆఖరులో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఖర్చు చేయకపోతే వెనక్కి వెళ్తాయని, అదే జరిగితే వచ్చే ఏడాది మే వరకు జీతాలు కూడా వచ్చే అవకాశం ఉండదని బోర్డు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తుంగభద్ర బోర్డు పనుల్లో అవినీతి అక్రమాలు జరిగి ఉంటే.. సంబంధిత కాంట్రాక్టర్లపై సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) విచారణ చేయించాలి. అవసరమైతే చట్టరమైన చర్యలు తీసుకోవాలే కానీ ఇలా ఖాతాలను సీజ్‌ చేసి నిధులు లేకుండా చేయడం ఏమిటని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో తుంగభద్ర కాలువ ఆధునికీకరణ పేరిట దాదాపు రూ.919 కోట్లకు టెండర్లు పిలిచారు. తొలి దశలో రూ.519.80 కోట్లతో ఎల్లెల్సీ ఆర్‌సీసీ లైనింగ్‌ పనులు చేస్తే.. సుమారు రూ.350 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. రెండవ దశలో మరో రూ.400 కోట్లకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్‌ కూడా చేసుకున్నారు. ఈ పనుల్లో వైసీపీ హయాంలో బోర్డులో పని చేసిన ఇంజనీరింగ్‌ ఉన్నతాధికారులు, ఏపీ ప్రభుత్వం ఓ ఈఎన్‌సీతో పాటు బళ్లారిలో స్థిరపడిన ప్రకాశం జిల్లాకు చెందిన బడా కాంట్రాక్టర్‌ ఒకరు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ కాంట్రాక్టరు గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశాడు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక తుంగభద్ర బోర్డు పనుల్లో అక్రమాలు జరిగాయని, వాటిని నిగ్గు తేల్చాలని అనంతపురం జిల్లాకు చెందిన రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ప్రభుత్వానికి లేఖ రాశారు. బోర్డు పనుల్లో అక్రమాలపై విచారణ చేసి నిగ్గు తేల్చే వరకు తుంగభద్ర బోర్డుకు కేటాయించిన నిధులు వినియోగించకూడదని, ఎలాంటి లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌ఓసీ) ఇవ్వవద్దని ఏపీ ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రెటరీ టీబీపీ బోర్డు కార్యదర్శి, కర్ణాటక ప్రభుత్వం ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం.. ఆ వెంటనే బోర్డు ఖాతాను ఫ్రీజ్‌ చేసిన సంగతి తెలిసిందే.

తుంగభద్ర బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌లో కేటాయించిన నిధులు ఈ నెల 30వ తేదీలోగా వినియోగించుకోవాలని 11వ తేదీన సర్క్యులర్‌ మెమో నంబరు.ఎఫ్‌ఐఎన్‌02-15069/ 11/2924-ఇ-ఎస్‌ఈసీ-డీటీఏలో స్సష్టంగా పేర్కొన్నారు. సీఎఫ్‌ఎంఎస్‌ బడ్జెట్‌ ఆర్డర్‌ నంబరు.4400014207, 55500014351లో కేటాయింపులు చేసిన నిధులు 2024-25కు సంబంధించి 2వ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రకారం ఆగస్టు 1 నుంచి నవంబరు 30వ తేది వరకే ఉంటుంది. అంటే ఆయా హెడ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ కింద అందుబాటులో ఉన్న బడ్జెట్‌ను ఈ నెల 30వ తేదీలోగా వినియోగించుకోవాలి. లేని పక్షంలో బడ్జెట్‌ వెనక్కి వెళ్తుందని అంటున్నారు. బోర్డు అకౌంట్‌ను ఫ్రీజ్‌ చేయడంతో ఆ నిధులు ఎలా వినియోగించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాసి బోర్డు అకౌంట్‌ ఫ్రీజ్‌ తొలగించాలని, బోర్డు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని తుంగభద్ర బోర్డు వర్క్‌ చార్జ్‌డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి టీకే గోపాల్‌కృష్ణ విన్నవిస్తున్నారు. మరో పక్క బళ్లారిలో స్థిరపడిన ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ కాంట్రాక్టర్‌ సహా మరో మరికొందరితో పెండింగ్‌ బిల్లులు చెల్లింపు, అగ్రిమెంట్‌ చేసిన రూ.400 కోట్లు టెండర్లు రద్దు చేయకుండా కొనసాగించేలా అనంతపురం జిల్లాకు చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపినట్లు సమాచారం.

Updated Date - Nov 21 , 2024 | 12:10 AM