Share News

ముద్దగా అన్నం

ABN , Publish Date - Dec 03 , 2024 | 12:55 AM

ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు నాసిరకం బియ్యాన్ని సరఫరా చేస్తుండటంతో విద్యార్థులు తినేందుకు ఇష్టపడటం లేదని వార్డెన్లు వాపోతున్నారు.

ముద్దగా అన్నం
ఈ అన్నాన్నే విద్యార్థులకు వడ్డిస్తున్నారు

సంక్షేమ హాస్టళ్లకు నాసిరకమైన బియ్యం సరఫరా

తినలేక పడేస్తున్న విద్యార్థులు

ఆలూరు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు నాసిరకం బియ్యాన్ని సరఫరా చేస్తుండటంతో విద్యార్థులు తినేందుకు ఇష్టపడటం లేదని వార్డెన్లు వాపోతున్నారు.

గతంలో ఫోర్టిఫైడ్‌ బియ్యం

ఆలూరు సివిల్‌ స్టాక్‌ పాయింట్‌ పరిధిలో 13 సంక్షేమ హాస్టళ్లు ఉండగా 202 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి నెలా 450 క్వింటాళ్ల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. గతంలో సంక్షేమ హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఫోర్టిఫైడ్‌ బియాన్ని సరఫరా చేసేవారు. అయితే దాదాపు సంవత్సరం నుంచి నాసిరకం బియ్యం వస్తున్నట్లు వార్డెన్లు అంటున్నారు. ఆలూరు పరిధిలోని సివిల్‌ సప్లయి గోదాం నుంచే నాసిరకం బియ్యం సరఫరా అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

తినలేక పడేస్తున్న విద్యార్థులు

ఈ బియ్యంతో అన్నం వండితే ముద్దగా మారుతుండటంతో విద్యార్థులు కడుపునిండా తినలేక పోతున్నారు. అన్నాన్ని పడేస్తున్నారు. ఇటీవలే ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి గిరిజన బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన సమయంలో బియ్యం నాసిరకంగా ఉందని, వంట మనుషులు ఫిర్యాదు చేశారు. అన్నం ముద్దగా వస్తే పిల్లలు అతినడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.

ఈ విషయాన్ని సివిల్‌ సప్లయి జిల్లా మేనేజర్‌ నాగసుధను వివరణ కోరగా విచారించి నాణ్యమైన బియ్యం సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు. ఆలూరు సివిల్‌ స్టాక్‌ పాయింట్‌ ఇన్‌చార్జి బసవన్న గౌడ్‌కు ఫోన్‌చేసి అరా తీసి, ఎందుకు ఇలాంటి బియ్యాన్ని సరఫరా చేస్తున్నారని ప్రశ్నించారు. స్పందించిన ఇన్‌చార్జి ప్రభుత్వం నుంచి వస్తున్న బియ్యాన్నే సరఫరా చేస్తున్నామని తెలిపారు. ముద్దగా మారిన అన్నం ఫోటోలు పంపాలని ఆమె ఆదేశించారు..

Updated Date - Dec 03 , 2024 | 12:55 AM