Share News

స్వర్ణ రథంపై మల్లన్న

ABN , Publish Date - Aug 30 , 2024 | 12:13 AM

శ్రీశైలం మహాక్షేత్రంలో గురువారం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది.

స్వర్ణ రథంపై మల్లన్న
స్వర్ణ రథంపై ఊరేగుతున్న స్వామి అమ్మవార్లు

శ్రీశైలం, ఆగస్టు 29: శ్రీశైలం మహాక్షేత్రంలో గురువారం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది. వేకువజామున మల్లికార్జున స్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలను అర్చకులు నిర్వహించారు. అనంతరం ఉదయం 7:30 గంటలకు స్వర్ణరథాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామీజీ, స్వర్ణరథం దాత, నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు స్వర్ణరథానికి కొబ్బరికాయలు, గుమ్మడికాయలు సమర్పించారు. స్వామి, అమ్మవార్లు ఆశీనులైన స్వర్ణరథం ఆలయ మాడవీధుల్లో అశేష భక్తజనం నడుమ వైభవంగా జరిగింది. స్వర్ణరథం ఎదుట కోలాటం, చెక్కభజన, జానపద కళాకారులు భక్తలను ఆకట్టుకుంది. స్వర్ణరథోత్సవం భద్రతా ఏర్పాట్లను స్థానిక సీఐ ప్రసాదరావు, దేవస్థానం చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ అయ్యన్న పర్యవేక్షించారు.

Updated Date - Aug 30 , 2024 | 12:13 AM