మట్టి మాఫియా
ABN , Publish Date - Nov 18 , 2024 | 12:12 AM
నంద్యాలలో మట్టి దొంగలు రెచ్చిపోతున్నారు. నందమూరి నగర్ టిడ్కో ఇళ్ల వెనుక కుందూ నది ఒడ్డున భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపి మట్టి కొల్లగొడు తున్నారు.
కుందూ నది పక్కనే భారీ యంత్రంతో పనులు
చీకటి పడగానే ట్రాక్టర్లతో తరలింపు
ఏడడుగుల మేర గుంతలు
నంద్యాల, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): నంద్యాలలో మట్టి దొంగలు రెచ్చిపోతున్నారు. నందమూరి నగర్ టిడ్కో ఇళ్ల వెనుక కుందూ నది ఒడ్డున భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపి మట్టి కొల్లగొడు తున్నారు. చీకటి పడగానే ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా మట్టిని తరలించుకపోయి సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతులు ఉన్నాయా? లేదా? అనే సంగతి పక్కనపెడితే, ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇచ్చిన భూముల్లో అక్రమార్కులు మట్టి తవ్వడం విస్మ యం కలిగిస్తోంది. వీరి తీరు వల్ల పేదలు భవిష్యత్తులో ఇబ్బం దులు ఎదుర్కోవాల్సి రావటమే కాకుండా, ప్రభుత్వ ఖజా నాకు నష్టం వాటిల్లుతోంది. ఈ స్థాయిలో మట్టి తవ్వకాలు జరుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
నందమూరి నగర్ టిడ్కో ఇళ్ల వెనుక కుందూ నది వెంట దాదాపు ఆరువేల మంది పేదలకు పట్టాలు ఉన్నట్లు సమాచారం. పట్టాలు తీసుకున్నారేగాని పేదరికం వల్ల ఇళ్ళు కట్టుకోలేదు. ఈ ప్రాంతమంతా పూర్తిగా పిచ్చి మొక్కలు మొలవటంతో ఇక్కడ ఇండ్ల స్థలాలు ఉన్నాయని గుర్తు పట్టేలా పరిస్థితి లేదు. పైగా నందమూరి నగర్‌కు వెళ్లే దారికి కాస్త పెడగా ఉండటంతో ఈ ప్రాంతం ఊరికి చివర్లో ఉన్నట్లనిపిస్తుంది. ఇదే అదనుగా కొంతమంది ఇక్కడ మట్టిని తవ్వి కళ్లు గప్పి తరలించుకపోతున్నారు. పది దాటగానే ఈ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారుతోంది. అపుడు ట్రాక్టర్లు, టిప్పర్లతో మట్టి తరలిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 200 ట్రాక్టర్ల మట్టిని తరలించినట్లు తెలుస్తోంది. పేదల స్థలాలను గుర్తించే సరిహద్దు రాళ్లను తొలగించి భారీ యంత్రాలతో తవ్వుతున్నారు. ప్రాంతంలో ఇప్పటికే ఏడడుగుల మేర భారీ గోతులు ఏర్పడ్డాయి. ఇక్కడ ఎంత తవ్వినా అడిగేవారు లేరు కాబట్టి వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వుకుని కోట్ల రూపాయలు జేబులో వేసుకోవచ్చన్నది అక్రమార్కులు పన్నాగం. దీనిని బట్టి మట్టి మాఫియా నంద్యాలలో ఎలా రెచ్చిపోతోందో అర్థమవుతోంది. ఈ తవ్వకాలను ఆపకపోతే పట్టాలు అందుకున్న వేల మంది పేదలు అన్యాయమైపోతారు. ఆఖరుకి తమ భూములు ఎక్కడ ఉన్నాయో గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వ యంత్రాంగం సర్వే చేసి అసలు అక్కడ ఎవరి భూమి ఎక్కడ ఉన్నదీ నిగ్గుదేల్చడం కష్టమైపోతుంది. ప్రజా సంఘాల నాయకులు లేదా ఇతరులు ఎవరైనా పేదల భూములు చూపెట్టమని కోర్టుకు ఎక్కితే చివరకు చిక్కుల్లో పడేది అధికార యంత్రాంగమే అనే విమర్శలు వస్తున్నాయి.
నదీ ప్రవాహాన్ని మార్చేలా..
ప్రస్తుతం అక్రమార్కులు మట్టిని తవ్వే ప్రాంతం కుందూ నదికి పది అడుగుల దూరలో ఉన్నది. కుందూనదికి సంబంధించి నందిపల్లె నుంచి వచ్చే ఒక పాయ, సంతజూటూరు నుంచి వచ్చే మరో పాయ ఈ ప్రాంతంలోనే కలుస్తాయి. అక్రమార్కులు చేసిన పనికి భవిష్యత్తులో కుందూ నదికి ప్రవాహం ఎక్కువ వచ్చి సరిహద్దుగా ఉన్న కాస్త మట్టి కట్ట తెగితే నీరంతా ఈ గుంతల్లో నిండిపోతుంది. ఇది ఇలాగే కొనసాగితే కుందూ ప్రవాహం మారి టిడ్కో ఇళ్ల వైపు చొచ్చుకుని వచ్చే ప్రమాదం ఉందని, దీనివల్ల ప్రజలు నష్టపోతారనే అభిప్రాయం వ్యక్తమ వుతోంది. ధన దాహంతో వేల మంది ఇబ్బందుల్లో పడేలా అక్రమ దందాలు చేస్తున్నా వాటిని అడ్డుకట్ట వేయటంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం కనిపిస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో నంద్యాలలో చెరువులు, కుంటలు, పంట భూములు.. అదీ ఇదీ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడ వైసీపీ అనుయాయులు విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు చేపట్టేవారు. దీనిపైన ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమైనా, అధికారులు చర్యలు తీసుకున్నా ఆగలేదు. ఇలాంటి పనుల వల్లే ప్రజలు వైసీపీని లేవలేని చావుదెబ్బ తీశారు. ప్రభుత్వం మారింది. ఇక నుంచి ఇలాంటి ఉండవని అందరూ భావించారు. మారింది ప్రభుత్వమే కాని, అక్రమార్కుల తీరు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో ఆ పార్టీ అనుచరులు చెలరేగిపోతే, ప్రస్తుత అధికార పార్టీ నాయకులు చెలరేగిపోతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నందమూరి నగర్‌లో జరుగుతున్న మట్టి తవ్వకాల్లో టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలోని కొంత మంది ఈ ప్రాంతంలో రాత్రిపూట గస్తీ కాస్తూ పోలీసులు ఎవరైనా వస్తున్నారా? ఇతర అధికారులు ఎవరైనా నిఘా పెట్టారా? అని గమనిస్తూ మట్టి రవాణాకు అడ్డంకులు లేకుండా చూసుకుంటున్నారు. ఇలా తరలిస్తూ నంద్యాల శివారులోని ఇటుక బట్టీలకు, వెంచర్లకు ట్రాక్టరు మట్టిని రూ.1500, టిప్పరు మట్టిని రూ.8000 పైగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం. గత ప్రభుత్వాలు చేసిన తప్పులు ప్రస్తుతం చేయకూడదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టంగానే చెబుతున్నారు. జిల్లా పై స్థాయి నాయకులు కూడా ఇదే మాట చెబుతున్నారు. కానీ కింది స్థాయి టీడీపీ నాయకులు ఈ మాట లను ఏమాత్రం పట్టించుకోవటం లేదు. అధికారం తమదే కాబట్టి తమను ఎవరూ అడగరని, ఒకవేళ తమ అక్రమాలను అధికారులు అడ్డుకున్నా ఆపై అధికారులతో పని చేసుకోవచ్చనే ధీమాతో మట్టి అక్రమార్కులు రెచ్చిపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.