Share News

సాగునీటి సంఘాల ఎన్నికలకు నగారా

ABN , Publish Date - Oct 22 , 2024 | 12:39 AM

జిల్లాలో కేసీ కాలువ, తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ), హంద్రీనీవా, గాజులదిన్నె ప్రాజెక్టు పరిధిలోకి ఆయకట్టు రైతుల సాగునీటి సంఘాల సమరానికి సమయం ఆసన్నమైంది.

సాగునీటి సంఘాల ఎన్నికలకు నగారా

జిల్లాలో 123 సంఘాలకు ఎన్నికలు

ఆ తరువాత డిస్ట్రిబ్యూటరీ, ప్రాజెక్టు కమిటీల ఎంపిక

కర్నూలు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కేసీ కాలువ, తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ), హంద్రీనీవా, గాజులదిన్నె ప్రాజెక్టు పరిధిలోకి ఆయకట్టు రైతుల సాగునీటి సంఘాల సమరానికి సమయం ఆసన్నమైంది. జిల్లాలో 123 సంఘాలకు ఎన్నికలు నిర్వహణ, ఎన్నికల అధికారులను నియమిస్తూ కలెక్టరు పి.రంజిత్‌బాషా సోమవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఏఏ సంఘం పరిధిలో ఏఏ గ్రామాలు వస్తాయి.. ఎంత ఆయకట్టు ఉంది వంటి అంశాలు గెజిట్‌లో స్పష్టంగా వివరించారు. గత టీడీపీ ప్రభుత్వం 2015-26లో సాగు నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించింది. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసి నామినేటెడ్‌ పద్ధతిలో ఆ పార్టీ కార్యకర్తలకే పదవులు పంచుకున్నారు. మళ్లీ టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో తొమ్మిదేళ్ల తరువాత పల్లెసీమల్లో సాగునీటి సంఘాల ఎన్నికలకు నగారా మోగింది. ఈ నెల 9న తేదీన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 40 రోజుల ఎన్నికల ప్రక్రియకు మంత్రి వర్గం ఆమోదం తెలిపి షెడ్యూల్‌ కూడా జారీ చేసింది. షెడ్యూల్‌ ప్రకారం అయితే 16 నుంచి ప్రక్రియ మొదలు కావాలి. అయితే సాంకేతిక కారణాలు, రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులు ఉమ్మడిగా ఆయకట్టు నిర్ధారణలో వంటి కారణాలు ప్రభుత్వం వాయిదా వేసింది. ఎట్టకేలకు వారం రోజులు ఆలస్యంగా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ కావడంతో ఆయకట్టు రైతులు ఎన్నికల సన్నద్ధం కావాల్సి వచ్చింది. నవంబరు 29న ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని అధికారులు తెలిపారు.

123 నీటి సంఘాలకు ఎన్నికలు

జిల్లాలో కేసీ కెనాల్‌ పరిధిలో 2, తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ) పరిధిలో 58, హెచ్చెల్సీ ఆలూరు బ్రాంచి కెనాల్‌ పరిధిలో 6, హంద్రీనీవా కెనాల్‌ పరిధిలో 3, గాజులదిన్నె ప్రాజెక్టు కింద 12, మైనర్‌ ఇగిరేషన్‌ చెరువుల కింద 41, రాంపురం చానల్‌ కెనాల్‌ కింద ఒకటి కలిపి 123 సాగునీటి సంఘాలు (డబ్ల్యూయూఏ) ఉన్నాయి. ఎంఐ పరిధిలోలో సంఘంలో సుమారుగా 30-50 మంది రైతులు, మేజర్‌ ఇరిగేషన్‌ సంఘాల పరిధిలో 100-120 మంది వరకు ఆయకట్టు రైతులు సభ్యులుగా ఉంటారని అంచనా వేస్తున్నారు. ఆయా సంఘాల పరిధిలో 1,212 మంది ప్రాదేశిక నియోజకవర్గం (టీసీ) సభ్యులను ఎన్నుకోవాలి. ప్రతి సంఘం పరిధిలో ఆరుగురు టీసీ సభ్యులను ఎన్నుకుంటే.. ఆ సభ్యుల్లో ఇద్దరిని అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎంపిక చేస్తారు. సాగునీటి సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షులను డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నుకుంటుంది. డిస్ట్రిబ్యూటరీ అధ్యక్షుడు సమావేశమై ప్రాజెక్టు కమిటీని ఎంచుకుంటారు. జిల్లాలో 123 సాగునీటి సంఘాలు, 10 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 2 ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతాయి.

ప్రత్యేక అధీకృత అధికారుల నియామకం

గెజిట్‌ నోటిఫికేషన్‌తో పాటు ఎన్నికలు జరిగే సాగునీటి సంఘాలకు డీఈఈ, ఏఈఈ స్థాయి ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ అఽధికారి పర్యవేక్షణలో ఈ ఎన్నికలు జరగుతాయి. ఆయా సాగునీటి కాలువ పరిధిలోని ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులు (తహసీల్దార్లు) సమన్వయంతో ఆయకట్టు రైతులు, ఓటర్ల జాబితాను తయారు చేయాల్సి ఉంది. ఇందుకోసం జిల్లా నుంచి ప్రత్యేక అధీకృత రెవెన్యూ అధికారులను నియమించారు. డీఈఈ, ఏఈఈలు, తహసీల్దార్లు నివేదించిన ఓటర్ల జాబితాను కలెక్టరు లేదా ఆర్డీఓలు అధికారికంగా ప్రకటిస్తారు. ఓటర్ల జాబితా తయారీ కోసం ఇరిగేషన్‌ ఇంజనీర్లు తహసీల్దార్లకు సంపూర్ణ సహకారం అందించాలని కలెక్టరు పి.రంజిత్‌బాషా జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 12:39 AM