Share News

కేసుల విచారణలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్‌

ABN , Publish Date - Sep 20 , 2024 | 11:48 PM

ఎస్సీ, ఎస్టీ అత్యాచారం కేసుల విచారణలో నిర్లక్ష్యం ఉండకూడదని, పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ పి. రంజిత్‌ బాషా పోలీస్‌ అధికారులను ఆదేశించారు.

కేసుల విచారణలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

కర్నూలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 20: ఎస్సీ, ఎస్టీ అత్యాచారం కేసుల విచారణలో నిర్లక్ష్యం ఉండకూడదని, పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ పి. రంజిత్‌ బాషా పోలీస్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల విచారణ వేగవంతం కావడానికి పోలీసు, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయం ఉండాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించి పోలీసు, రెవెన్యూ శాఖలు ప్రత్యేకంగా రిజిస్టర్లు నిర్వహించి పరస్పరం కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో నిబద్ధతతో పని చేస్తోందన్నారు. కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి మాట్లాడుతూ గూడూరు మండలంలోని బాలికల వసతి గృహంలో మరుగుదొడ్లు సరిగా లేవని కలెక్టర్‌ దృష్టికి తీసుకు వచ్చారు. వసతి గృహాల్లో సీట్ల సంఖ్య పెంచేం దుకు తగిన చర్యలు తీసుకోవాలని, బోగస్‌ క్యాస్ట్‌ సర్టిఫికెట్లు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్పీ జి.బిందు మాధవ్‌ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న అండర్‌ ఇన్వెస్టిగేషన్‌ కేసులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సివిల్‌ రైట్స్‌డే కార్యక్రమాన్ని మరింత సక్రమంగా నిర్వహించి మంచి ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జాయింట్‌ కలెక్టర్‌ బి. నవ్య మాట్లాడుతూ సుమోటో క్యాస్ట్‌ సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌కు సంబంధించి తప్పుగా జారీ అయ్యాయని, వచ్చిన ఫిర్యాదుల మేరకు రీవెరిఫికేషన్‌ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, డీఆర్వో చిరంజీవి, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్‌ రవీంద్రబాబు, కర్నూలు ఆర్డీవో శేషిరెడ్డి, పత్తికొండ ఆర్డీవో రామలక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రంగలక్ష్మీదేవి, కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ ఎస్డీపీవోలు, జిల్లా స్థాయి అధికారులు, డీవీఎంసీ సభ్యులు చిటికెల శామ్యూల్‌, రాజశేఖర్‌, శాంతికుమార్‌, నవీన్‌, రాజు, ఊట్ల రమేష్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2024 | 11:48 PM