ఐదు తరగతులకు ఒకే గది
ABN , Publish Date - Nov 13 , 2024 | 11:44 PM
పట్టణంలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కాలనీ మున్సిపల్ ప్రాథ మిక పాఠశాల కొనసాగుతోంది.
ఇబ్బందిపడుతున్న విద్యార్థులు
ప్రాథమిక పాఠశాల దుస్థితి
ఆదోని, నవంబరు 13 (ఆంధ్ర జ్యోతి): పట్టణంలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కాలనీ మున్సిపల్ ప్రాథ మిక పాఠశాల కొనసాగుతోంది. ఐదు తరగతులను ఒకే గదిలో నిర్వహిస్తున్నా రు. స్థానికంగా పాఠశాల అవసరం ఉండటంతో పట్టణంలోని కేవీబీఅర్ నగర్‌లో ప్రభుత్వ భవనం నిర్మించి అందులోకి మార్చారు.
ఒకే గదిలో ఐదు తరగతులు..
ఈ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 94 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి నలుగురు ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. అయితే అన్ని తరగతులు ఒకే గదిలో ఉండటంతో గందరగోళంగా మారింది.
ఎండలోనే బోధన
పాఠశాలలో తగరగతి గదుల కొరత ఉండటంతో ఐదో తరగతి విద్యార్థులకు సంపుపై చిన్న టెంటు వేసి బోధిస్తున్నారు. ఐదో తరగతిలో 28మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే వంట గదిలో నాలుగో తరగతి విద్యార్థులు చదువుతున్నారు. ఇక మూడో తరగతిలో 23 మంది విద్యార్థులుండగా వారిని క్లాస్ రూములో కూర్చోబెట్టారు. ఒకటి, రెండో తరగతి విద్యార్థులను వరండాలో కూర్చోబెట్టారు. విద్యాధికారులు స్పందించి నూతన తరగతి గదులు నిర్మించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.
అదనపు గదుల కోసం ప్రతిపాదనలు పంపాం
పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. గతంలో అద్దె భవనంలో ఉన్న పాఠశాల ఇక్కడకు మార్చాం. నిదులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం. - శ్రీనివాసులు, ఎంఈవో, ఆదోని