నేడు ప్రాజెక్ట్ కమిటీ ఎన్నిక
ABN , Publish Date - Dec 20 , 2024 | 11:59 PM
తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ), గాజులదిన్నె ప్రాజెక్టు పీసీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక శనివారం జరగనుంది.
టీబీపీ ఎల్లెల్సీ, గాజులదిన్నె ప్రాజెక్టులకు ఎన్నికలు
కర్నూలు, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ), గాజులదిన్నె ప్రాజెక్టు పీసీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక శనివారం జరగనుంది. ఈ మేరకు కర్నూలు నగరం ఐదు రోడ్ల కూడలిలోని జల మండలి కార్యాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లెల్సీ ప్రాజెక్ట్ కమిటీ ఆథరైజ్డ్ అధికారి, జలవనరుల శాఖ కర్నూలు సర్కిల్ ఎస్‌ఈ బి.బాలచంద్రారెడ్డి, గాజులదిన్నె ప్రాజెక్ట్ కమిటీ (పీసీ) ఆథరైజ్డ్ అధికారి, ఆదోని సబ్ కలెక్టర్ ఎం.మౌర్యభరద్వజ్ ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరగనుంది. .
జీడీపీ పీసీ చైర్మన్ ఏకగ్రీవమే..!
గాజులదిన్నె ప్రాజెక్ట్ (జీడీపీ) కమిటీ పరిధిలో ఎమ్మిగనూరు నియోజకవవర్గానికి హెచ్.కైరవాడి, ఒంటెడుదిన్నె, తిప్పనూరు, ఎ.లింగందిన్నె, కున్నూరు, కోడుమూరు నియోజకవర్గంలో కోడుమూరు, ముడుమలగుర్తి, గోరంట్ల, పత్తికొండ నియోజకవర్గానికి చెందిన పోతుగల్లు, మొన్నెంకుంట, ఎర్రగుడి, తొగరచేడు సాగునీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులు పీసీ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోవాల్సి ఉంది. అయితే.. కోడుమూరు సాగు నీటి సంఘం అధ్యక్షుడు కేఈ మల్లికార్జునగౌడ్ పేరు దాదాపుగా ఖరారు చేశారు. జీడీపీ పీసీ చైర్మన్‌గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు.