మెరుగైన విద్య అందించండి: కలెక్టర్
ABN , Publish Date - Dec 04 , 2024 | 12:26 AM
జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో ఇంటర్ విద్యార్ధులకు మెరుగైన, నాణ్యమైన విద్య అందించి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ రాజకుమారి ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.
నంద్యాల కల్చరల్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో ఇంటర్ విద్యార్ధులకు మెరుగైన, నాణ్యమైన విద్య అందించి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ రాజకుమారి ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో విద్యార్ధుల పాస్ పర్సెంటేజీపై ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ దాదాపు 140 జూనియర్ కళాశాలలో చదివే 5,861 మంది విద్యార్ధులు ఈ ఏడాది త్రైమాసిక పరీక్షలో కేవలం 2,252 మంది విద్యార్ధులకే పాస్ పర్సెంటేజ్ మార్కులు రావడం బాధాకరమన్నారు. విద్యార్ధులకు మెరుగైన, నాణ్యమైన విద్యాబోధన అందించి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. డీవీఈఓ సునీత, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
భవన నిర్మాణ పనులు పూర్తి చేస్తాం
నంద్యాల రూరల్: నంద్యాల మండలం మిట్నాల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మోడల్‌స్కూల్ భవన నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మిట్నాల గ్రామంలోని ఏపీ మోడల్‌స్కూల్‌ను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో ఆమె ముచ్చటించారు. విద్యాబోధన, భోజనంలో మెనూ, ఇతర వసతులు మొదలైనవాటి గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించడానికి ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.