రాఘవేంద్రా... గోడు వినవా..!
ABN , Publish Date - Nov 15 , 2024 | 12:03 AM
పశ్చిమ ప్రాంతంలో కరువు, వలసలు నివారణే లక్ష్యంగా నిర్మించిన ప్రాజెక్టుల్లో గురురాఘవేంద్ర ఒకటి. బడ్జెట్‌లో రూ.69.04 కోట్లు ఇస్తే శాశ్వత మరమ్మతులు చేస్తారని రైతులు సంతోషించారు.
జీడీపీకి రూ.11.79 కోట్లు కేటాయింపు.. బకాయిలే రూ.35 కోట్లు..
వేదవతి, ఆర్డీఎస్ ప్రాజెక్టుల భూసేకరణ ఇక లేనట్లే
ఎన్నికల ప్రచారంగా మాత్రమే గుండ్రేవుల ప్రాజెక్టు
హంద్రీనీవా పందికోన జలాశయం కుడి, ఎడమ కాలువలు పూర్తయ్యేనా?
పశ్చిమ ప్రాంతంలో కరువు, వలసలు నివారణే లక్ష్యంగా నిర్మించిన ప్రాజెక్టుల్లో గురురాఘవేంద్ర ఒకటి. బడ్జెట్‌లో రూ.69.04 కోట్లు ఇస్తే శాశ్వత మరమ్మతులు చేస్తారని రైతులు సంతోషించారు. అందులో రూ.63 కోట్లు విద్యుత్ బిల్లులకే కేటాయించారు. దీంతో మరమ్మతులు, నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థ్యం పెంపు పనుల బకాయిలు రూ.35 కోట్లు ఉంటే ఇచ్చింది రూ.11.79 కోట్లు మాత్రమే. వేదవతి, ఆర్డీఎస్ కుడి కాలువ భూ సేకరణ ఊసే లేదు. హంద్రీనీవా పందికోన జలాశయం కుడి, ఎడమ కాలువ అసంపూర్తి పనులకు ఒక్కపైసా కూడా ఇవ్వలేదు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నారు. జిల్లా ప్రాజెక్టులకు కరువు తీరా నిధులు వస్తాయనుకుంటే అరకొర నిధులతో సరిపుచ్చారు. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
కర్నూలు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాల పునర్విభజన తరువాత కర్నూలు జిల్లాలో గాజులదిన్నె ప్రాజెక్టు, హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన పత్తికొండ (పందికోన) జలాశయం, ఎల్లెల్సీ కాలువలు ఉన్నా యి. గాజులదిన్నె జలాశయంలో 4.5 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన ఆర్డీఎస్ కుడి కాలువ, వేదవతి ప్రాజెక్టులు వైసీపీ ప్రభుత్వ హాయాంలో నిర్లక్ష్యానికి గురై అటకెక్కాయి. గుండ్రేవుల జలాశ యం అంతర్రాష్ట్ర సమస్య అంటూ పెండింగ్ ఫైళ్లు కిందకు తోసేశారు. మళ్లీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఏకంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా బాధ్య తలు చేపట్టారు. కరువు తీరా నిధులు వస్తాయని, సాగునీటి ప్రాజెక్టులు పట్టాలెక్కి మెట్ట చేలకు తుంగ భద్ర జలాలు అందుతాయని రైతులు ఆశించారు. అయితే చివరకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పూర్తిస్థాయి తొలి బడ్జెట్‌లో అరకొర నిధులతో సరిపుచ్చారు. అందులోనూ ముప్పాతిక శాతం నిధులు కరెంటు బిల్లులు, బాకాయిలకే సరిపోవ డంతో ఉన్న ప్రాజెక్టుల మరమ్మతులు, భూ సేకరణ, పనులు పునఃప్రారంభం ప్రశ్నార్థకంగా మారింది.
కర్నూలు జిల్లా మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో రైతులు జలజీవనాడి గురురాఘవేంద్ర ఎత్తిపోతల ప్రాజెక్టులు. తుంగభద్ర నది నుంచి 3.786 టీఎంసీల నీటిని ఎత్తిపోసి ఎల్లెల్సీ చివరి ఆయకట్టు 45,790 ఎకరాలకు సాగునీరు అందించాలని 2003లో ఆనాటి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ మోహన్‌రెడ్డి పట్టుబట్టడంతో అదే ఏడాది ఆగస్టు 22న రూ.177 కోట్లు నిధులు చేస్తూ అప్పటి సీఎం చంద్రబాబు జీవో ఎంఎస్ నం.132 జారీ చేశారు. కోసిగి, వుంత్రాలయం, నందవరం, ఎమ్మిగనూరు, పెద్దకడుబూరు, కోడుమూరు, సి.బెళగల్, గూడూరు, కల్లూరు మండలాలలో ఎల్లెల్సీ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
గురురాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా మూగలదొడ్డి, పులచింత, చిలకలడోణ, సోగనూరు, కృష్ణదొడ్డి, రేమట, మునగాల, కంబదహాల్, చింతమానుపల్లె ఎత్తిపోతల పథకాలు, 2005 మార్చి 23న ప్యాకేజీ-97 కింది రూ.65.21 కోట్లతో మాధవరం, బసలదొడ్డి, దుద్ది ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. గురురాఘవేంద్ర ప్రాజెక్టు లిఫ్టుల నిర్వహణ కోసం గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు ఓ అండ్ ఎం గ్రాంట్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రూ.15 కోట్లు కావాలని ఇంజనీర్లు ప్రతిపాదన. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు.. మూగలదొడ్డి, మాధవరం స్టేజ్-1, స్టేజ్-2, బసలదొడ్డి స్టేజ్-1, చిలకలడోణ స్టేజ్-1, స్టేజ్-2, సోగనూరు స్టేజ్-1, పులచింత స్టేజ్-1, స్టేజ్-2 ఎత్తిపోతల పథకాలు పంప్‌హౌస్‌లో దొంగలు పడి హెచ్‌టీ, ఎల్‌టీ ప్యానల్ బోర్డులు, స్టార్టర్లు, ప్యానల్ బోర్డులు ధ్వంసం చేసి విలువైన కాపర్ వైర్, కాయిన్స్, పవర్ ఆయిల్ దోచుకెళ్లారు. మరమ్మతులకు రూ.5.50 కోట్లు తక్షణమే ఇవ్వాలని ప్రతిపాదించారు. తాజాగా బడ్జెట్‌లో రూ.69 కోట్లు ఇచ్చారు. కష్టాలు తీరాయని ఆశిస్తే.. అందులో రూ.63 కోట్లు గత వైసీపీ ప్రభుత్వం పెట్టిపోయిన విద్యుత్ బకాయిలకు కేటాయించారు. మరో రూ.6 కోట్లు హెడ్ ఆఫ్ అకౌంట్ 351 మేజర్ పనులకే ఇచ్చారు. అంటే గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు మిగిలింది రూ.6 లక్షలే. మరమ్మతులు ఎలా చేయాలని ఇంజనీర్లు తలలు పట్టుకుంటున్నారు.
బకాయి రూ.35 కోట్లు.. ఇచ్చింది రూ.11.79 కోట్లు
గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థ్యం 4.500 టీఎంసీలు. కుడి, ఎడమ కాలువల ద్వారా గోనేగండ్ల, కోడుమూరు, కృష్ణగిరి, దేవనకొండ మండలాల పరిధిలోని 21 గ్రామాలకు 25,454 ఎకరాలు రబీ ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. జిల్లాల విభజన తర్వాత కర్నూలులో ఇదే అతిపెద్ద జలాశయంగా మిగిలింది. ఇక్కడి నుంచే డోన్, కృష్ణగిరి, బండగట్టు తాగునీటి పథకాలు ద్వారా డోన్ పట్టణం సహా వివిధ పల్లెలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఎమ్మిగనూరు పట్టణానికి కూడా నీటి సరఫరా కోసం పైపులైన్ పనులు చేపట్టారు. కర్నూలు నగరానికి దాహం తీర్చే జీవనాడిగా మారింది. సాగు, తాగునీటి అవసరాలు దృష్ట్యా గత వైసీపీ ప్రభుత్వం నీటి సామర్థ్యం 5.5 టీఎంసీల(అదనంగా ఒక టీఎంసీ)కు పెంచుతూ రూ.57 కోట్లతో పనులు చేపట్టారు. మరో రూ.12 కోట్లతో ఆరు కొత్త క్రస్ట్‌గేట్లు ఏర్పాటు పనులు చేపట్టారు. 75 శాతం పనులు పూర్తి అయ్యాయని ఇంజనీర్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు దాదాపు రూ.35 కోట్లు బకాయి పెడితే ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తి బకాయిలు చెల్లిస్తుందని ఆశిస్తే.. బడ్జెట్‌లో కేవలం రూ.11.79 కోట్లు కేటాయించారు. అందులోనే నిర్వహణ కూడా చేపట్టాలి. జీడీపీ అసంపూర్తి పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
భూ సేకరణకు నిధులేవి..?
ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు, 196 గ్రామాలకు తాగునీరు అందించాలని 2019 జవనరిలో రూ.1,942.38 కోట్లతో వేదవతి ప్రాజెక్టు, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లోనే 40 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంగా 2019 జనవరిలో జీవో ఆర్టీ నం.76 జారీ చేసి రూ.1,985.42 కోట్లతో ఆర్డీఎస్ కుడి కాలువ పనులు గత టీడీపీ ప్రభుత్వం చేపట్టింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) హెడ్ ఆఫ్ అకౌంట్ కిందే ఈ పనులు చేపడుతున్నారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం రావడంతో కరువు రైతుల్లో ఆశలు చిగురించాయి. అయితే బడ్జెట్‌లో నిధులు ఎండమావులుగా మారాయి. ఎల్లెల్సీ, వేదవతి, ఆర్డీఎస్ మూడు ప్రాజెక్టులకు ఇచ్చింది కేవలం రూ.13 కోట్లే. అందులో ఆర్డీఎస్ బకాయిలు దాదాపు రూ.10 కోట్లు ఉన్నాయని ఇంజనీర్లు అంటున్నారు. వేదవతి ప్రాజెక్టు పనులు మొదలు పెట్టాలంటే భూ సేకరణకు తక్షణం రూ.56 కోట్లు కావాలి. ఆర్డీఎస్‌కు కూడా దాదాపు రూ.55 కోట్లు కావాలి. అంటే వచ్చే 2025-26 బడ్జెట్‌పైనే ఆశలు పెట్టుకోవాలి. హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పత్తికొండ (పందికోన) రిజర్వాయర్, కుడి, ఎడమ కాలువల అసంపూర్తి పనులకు రూ.200 కోట్లు కావాలని ఇంజనీర్లు ప్రతిపాదించారు. బడ్జెట్‌లో ఆ ఊసే లేదు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు స్పందించి సీఎం చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడులపై ఒత్తిడి తీసుకొచ్చి అడిషనల్ గ్రాంట్ రూపంలో నిధులు రాబట్టాలని జిల్లా రైతాంగం కోరుతోంది.