Share News

కేఎంసీలో ర్యాగింగ్‌ రక్కసి

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:17 AM

కోటి ఆశలతో కర్నూలు వైద్య కళాశాలలో చేరిన వారికి ర్యాగింగ్‌ పేరిట భయంకర అనుభవం ఎదురవుతోంది. కొత్తగా కాలేజీలో చేరిన విద్యార్థులతో స్నేహాన్ని బలపరుచుకునే విధానాన్ని విస్మరించి, తోటి విద్యార్థి మానసికంగా కృంగిపోయేలా హింసకు ప్రేరేపిస్తున్నారు కొందరు సీనియర్లు. ఈ హింసకు ‘ర్యాగింగ్‌’ అనే పేరు పెట్టి మరీ తోటి విద్యార్థుల జీవితాలను చిదిమేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు.

కేఎంసీలో ర్యాగింగ్‌ రక్కసి

కర్నూలు మెడికల్‌ కాలేజీలో కనిపించని పోస్టర్లు

ఆందోళనలో జూనియర్‌ విద్యార్థులు

చర్చనీయాంశంగా మారిన తాజా ఘటనలు

కోటి ఆశలతో కర్నూలు వైద్య కళాశాలలో చేరిన వారికి ర్యాగింగ్‌ పేరిట భయంకర అనుభవం ఎదురవుతోంది. కొత్తగా కాలేజీలో చేరిన విద్యార్థులతో స్నేహాన్ని బలపరుచుకునే విధానాన్ని విస్మరించి, తోటి విద్యార్థి మానసికంగా కృంగిపోయేలా హింసకు ప్రేరేపిస్తున్నారు కొందరు సీనియర్లు. ఈ హింసకు ‘ర్యాగింగ్‌’ అనే పేరు పెట్టి మరీ తోటి విద్యార్థుల జీవితాలను చిదిమేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. ఇది విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి, చదువులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇలాంటి విష సంస్కృతికి అడ్డుకట్ట పడాలి. ర్యాగింగ్‌ కారణంగా విద్యార్థుల్లో ఆందోళన, భయం, నిరాశ పెరుగుతున్నాయి. దీంతో వారి మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. లక్ష్యంపై దృష్టి సారించలేక, చదువులపై ఏకాగ్రత కోల్పోయి పరీక్షల్లో వెనుకంజ వేస్తున్నారు. పటిష్టమైన నియంత్రణ చర్యలపై కళాశాలలు సరైన మొగ్గుచూపక పోవడంతో ర్యాగింగ్‌ రక్కసి విరుచుకుపడుతోంది. తాజాగా కర్నూలు మెడకల్‌ కళాశాలలో జరుగుతున్న ర్యాగింగ్‌ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

కర్నూలు హాస్పిటల్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మెడికల్‌ కాలేజీలో గత ఏడాది మాదిరిగానే ర్యాగింగ్‌ రక్కసి మళ్లీ జడలు విప్పింది. కాలేజీ ఆవరణలోనే జూనియర్‌ విద్యార్థులను సీనియర్‌ విద్యార్థులు వేధిస్తూ ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారు. ఈనెల 14వ తేదీన ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. తరగతులు ముగిసిన తర్వాత సీనియర్లు, జూనియర్లను వేధించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ర్యాగింగ్‌పై అవగాహన, అరికట్టాల్సిన కర్నూలు మెడికల్‌ కాలేజీ అధికారులు మీనమేషాలు వేస్తున్నారు. ఫ్రెషర్స్‌ చేరి 9 రోజులవుతున్న కాలేజీ ఆవరణంలో కానీ, హాస్టల్స్‌లో గానీ ఎక్కడా యాంటీ ర్యాగింగ్‌ పోస్టర్స్‌ వాటి శిక్షలు ఎక్కడా కనిపించడం లేదు. నిబంధనల ప్రకారం ర్యాగింగ్‌ పోస్టర్స్‌, ఫ్లెక్సీలు సీనియర్లలో భయాన్ని కొత్త విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపడానికి ఎంతో దోహదపడుతాయి. కాలేజీలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్‌ సీట్లు అడ్మిషన్ల సమయంలోనే యాంటి ర్యాగింగ్‌ పోస్టర్లను అతికించాలి. నెల రోజులవుతున్నా పోస్టర్లు అడ్రస్‌ ఎక్కడా కనిపించడం లేదు. దీంతో కాలేజీ ఆవరణంలో ర్యాగింగ్‌ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

తెరుచుకోని ర్యాగింగ్‌ ఫిర్యాదుల బాక్స్‌

కర్నూలు మెడికల్‌ కాలేజీ, హాస్టల్‌లో కొత్త విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ర్యాగింగ్‌ ఫిర్యాదుల బాక్సులు ఇంత వరకు ఓపెన్‌ కాలేదు. కాలేజీ ఆవరణలోని అడ్మినిస్ర్టేషన్‌ బ్లాక్‌, మెన్స్‌ హాస్టల్‌, ఉమెన్స్‌ హాస్టల్‌లో ఒక్కొక్కటి చొప్పున ఫిర్యాదుల బాక్స్‌లను ఏర్పాటు చేశారు. కొత్త విద్యార్థులు వచ్చి 9 రోజులు అవుతున్నా ఇంత వరకు బాక్సులను తెరవకపోవడం విమర్శలకు తావిస్తోంది.

పర్యవేక్షణ ఏదీ..?

తొమ్మిది రోజుల క్రితం కొత్త విద్యార్థులకు ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. 240 మంది వైద్యవిద్యార్థులు కొత్తగా చేరారు. ఇందులో రాజ్‌విహార్‌ మెన్స్‌ హాస్టల్‌లో 98 మంది, ఉమెన్స్‌ హాస్టల్‌లో 95 మంది జాయిన్‌ అయ్యారు. కాలేజీకి నలుగురు వైస్‌ ప్రిన్సిపాళ్లు, మెన్‌, ఉమెన్స్‌ హాస్టళ్లలో చీఫ్‌ వార్డెన్‌, డిప్యూటీ వార్డెన్‌, అసిస్టెంట్‌ వార్డెన్లు పని చేస్తున్నారు. ప్రతి రోజు కాలేజీ తరగతులు ప్రారంభం, ముగిసే సమయంలో అధికారులు మానిటరింగ్‌ చేయాలి. అయితే ఏదీ ఎక్కడా జరగడం లేదు. సీనియర్‌ ఫ్రొఫెసర్లు తరగతులకు వెళ్లి యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన, చట్టప్రకారం శిక్షల గురించి వివరించాలి. ఇది కూడా జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ర్యాగింగ్‌ ఘటనలు జరుగుతున్నాయి. మెన్స్‌ హాస్టల్‌లో కూడా కొందరు సీనియర్లు తమకు భోజనం తీసుకురావాలని, ప్లేట్లు శుభ్రం చేయాలని హుకుం జారీ చేస్తున్నట్లు తెలిసింది. హాస్టల్‌లో ప్రతి రోజు రాత్రి సీనియర్లు వీడియోగేమ్స్‌ ఆడించి స్కోర్‌ను తెలపాలని జూనియర్లను వేధిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కాలేజీ, హాస్టల్‌ అధికారులు ఏ మాత్రం స్పందించడం లేదు. కొత్తగా చేరిన రోజుల్లో ఓ డాక్టర్‌ హాస్టల్‌లో ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలి. కానీ అది కనిపించడం లేదు. హాస్టల్‌ వార్డెన్‌, డిప్యూటీ, అసిస్టెంట్‌ వార్డెన్లు ర్యాగింగ్‌ వేధింపులు జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ర్యాగింగ్‌తో విచారణ కమిటీ

కర్నూలు మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ ఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాలపై ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.చిట్టినరసమ్మ ఆరుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రిన్సిపాల్‌ చాంబర్‌లో ఆమె మాట్లాడుతూ కమిటీలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.సాయిసుధీర్‌, కన్వీనర్‌గా ఉంటారు. సభ్యులుగా వైస్‌ ప్రిన్సిపాల్‌ పి. హరిచరణ్‌, సైక్రియాట్రి ప్రొఫెసర్‌ మెన్స్‌ హాస్టల్‌ వార్డెన్‌ ఎన్‌.నాగేశ్వరరావు, మాధవీశ్యామల, సర్జరీ ప్రొఫెసర్‌, ఉమెన్స్‌ హాస్టల్‌ వార్డెన్‌ అఫ్తామాలజి ప్రొఫెసర్‌ యుగంధర్‌ రెడ్డి, మెడిసిన్‌ హెచ్‌వోడీ ఇక్బాల్‌ హుసేన్‌ కొనసాగుతారు. విచారణ రెండు రోజుల్లో జరిపి నివేదికను ప్రిన్సిపాల్‌కు అందజేయాల్సి ఉంటుంది. ఈ నెల 21న రాత్రి వైస్‌ ప్రిన్సిపాల్‌ విజయానందబాబు, వార్డెన్‌ నాగేశ్వరరావుతో కలిసి మెన్స్‌ హాస్టల్‌లో తనిఖీలు చేసినట్లు ప్రిన్సిపాల్‌ వెల్లడించారు. కొటేషన్‌ ప్రాతిపదికన ఫ్యాకల్టీ డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేసి హాస్టల్స్‌లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు రోస్టర్‌గా ఉన్న డాక్టర్‌ పర్యవేక్షిస్తారన్నారు. ర్యాగింగ్‌ ఘటనపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ప్రిన్సిపాల్‌ తెలిపారు

Updated Date - Oct 23 , 2024 | 12:17 AM