Share News

రుణమో రామచంద్రా..!

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:01 AM

‘సీసీఆర్‌ కార్డులు తీసుకున్న కౌలు రైతులకు ఆశించిన స్థాయిలో రుణాలు అందటం లేదు. కౌలు రైతుల పట్ల బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించి, లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వాలి.

రుణమో రామచంద్రా..!

కౌలు రైతుకు అందని రుణాలు

నంద్యాల, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘సీసీఆర్‌ కార్డులు తీసుకున్న కౌలు రైతులకు ఆశించిన స్థాయిలో రుణాలు అందటం లేదు. కౌలు రైతుల పట్ల బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించి, లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వాలి. వ్యవసాయాభివృద్ధికి సహకరించాలి.’ ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బ్యాంకర్లను కోరారు. సాక్ష్యాత్తు సంబంధిత శాఖ మంత్రి కౌలు రుణాలపై ఇలా మాట్లాడారంటే రుణాలను దక్కించుకోవటంలో కౌలు రైతుల పరిస్థితి ఏమిటో అర్థం అవుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కౌలు రైతులకు రూ.130 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటి వరకు రూ.25 కోట్లు అందించారు. మొత్తానికి ప్రభుత్వం మారినా కౌలు రైతుల పరిస్థితి ఏమాత్రం మారలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వం చెబుతున్నా..

ఐదేళ్ల వైసీపీ పాలనలో కౌలు రైతు పూర్తిగా నిర్లక్ష్యా నికి గురయ్యాడు. 2014--19 మధ్య ఉన్న కౌలు రైతు కార్డు విధానంలో మార్పులు తీసుకొచ్చి అన్నింటినీ సీసీఆర్‌సీ(క్రాప్‌ కల్టివేటర్స్‌ రైట్‌ కార్డ్‌)తో ముడిపెట్టింది. గత వైసీపీ ప్రభుత్వ తీరుతో కౌలు చేయడమంటేనే గుదిబండ అనే అభిప్రాయానికి అన్నదాతలు వచ్చారు. రుణాలు మొదలుకుని నష్టపరిహారం వరకు అడుగడుగునా కౌలు రైతు ఐదేళ్ల పాటు నానా ఇబ్బందులు పడ్డాడు. కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో ఇకపై తమ ఇక్కట్లకు తెరపడ్డట్లేనని కౌలు రైతాంగం భావించింది. అందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం సీసీఆర్‌సీ కార్డుల విషయంలో పెద్ద ఎత్తున లక్ష్యాలను విధించి వ్యవసాయ సిబ్బందిని పరిగెత్తించింది. కౌలు రైతులకు రుణాలు అందించే విషయంలో బ్యాంకర్లు ఉదారంగా వ్యవహరించాలని కోరింది. కానీ గత ప్రభుత్వంలో బ్యాంకర్ల తీరు ఎలా ఉందో ఇప్పుడు కూడా దాదాపుగా అదే రీతిన ఉన్నది. దీంతో కౌలు రైతులకు రుణాల విషయంలో అన్యాయం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వార్షిక పద్దు ఆధారంగా ఖరీఫ్‌ రుణ లక్ష్యం దాదాపు పూర్తయింది. ఇందులో కౌలు రైతుల వాటా తీస్తే నానాటికీ తీసికట్టు నాగంబొట్టు అన్న చందాన ఉంది. గతంతో పోలిస్తే కౌలు రైతులకు అదనంగా ఒనగూరిన ప్రయోజనం గుండుసున్నా. కౌలు రైతులను ఆదుకోవాలనే ప్రభుత్వ లక్ష్యాలను దెబ్బతీసే విధంగా బ్యాంకర్లు నిబంధనల ఉచ్చు వేసి మొండిచెయ్యి చూపిస్తున్నారు. దీనికి తోడు సీసీఆర్‌ కార్డులు జారీ చేసి వ్యవసాయ శాఖ మిన్నకుండడం కూడా కౌలు రైతులకు రుణాల విషయంలో ఇప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంలో కౌలు రైతుల రుణ వాటాలో ప్రభుత్వం నిర్దేశించిన మొత్తాలను ఇప్పుడు జారీ చేసిన మొత్తాలను పోలిస్తే రుణాల విషయంలో బ్యాంకుల నిర్లక్ష్యం బయటపడుతోంది. కూటమి ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నామని కానీ ఇప్పటికీ రుణాల విషయంలో తమకు నిరాశే ఎదురవుతుందని కౌలు రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

శ్రద్ధ చూపని బ్యాంకర్లు..

కౌలు రైతులందరికీ సీసీఆర్‌ కార్డులు అందించాలని కూటమి ప్రభుత్వం అధికారులకు చెప్పింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వేల సీసీఆర్‌ కార్డుల ఇవ్వాలని లక్ష్యా న్ని నిర్దేశించుకుంది. ఇక వార్షిక పద్దు విషయంలో కూడా స్పష్టతతో వ్యవహరించాలని నిర్ణయించుకుంది. వ్యవసాయ రుణాల్లో కౌలు రైతాంగం వాటా ఐదు శాతం వరకు ఉండాలని, ఇందుకు బ్యాంకర్లు కూడా మానవతా దృక్పఽథంతో సహకరించాలని ఖరీఫ్‌ ఆరంభంలోనే తెలిపింది. కానీ ఖరీఫ్‌ ముగింపుకొచ్చినా కౌలు రైతులకు రుణాలు అందలేదు.

లక్ష్యం ఘనం.. చేతలు శూన్యం

ఉమ్మడి జిల్లాలో రైతులకు కౌలు రుణాల రూపంలో రూ.130 కోట్లు అందించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇప్పటి వరకు కౌలు రైతులకు కేవలం రూ.25 కోట్ల రుణ లక్ష్యాలు మాత్రమే పూర్తయ్యాయి. గతంతో పోలిస్తే కూటమి ప్రభుత్వంలో సీసీఆర్‌ కార్డుల జారీలో కూడా పెద్దగా మార్పు కనిపిస్తున్నట్లు లేదు. సీసీఆర్‌ కార్డులు తీసుకునేదే బ్యాంకుల నుంచి రుణాలు వస్తాయనే ఆశతో. కానీ సీసీఆర్‌ కార్డులు తీసుకున్న వారికి రుణాలు అందడం లేదు.

సహకారం కరువు..

వార్షిక పద్దు ప్రకటించేటప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కౌలు రైతులకు రుణాలు అందించే విషయంలో సహకరిస్తామని బ్యాంకర్లు చెబుతారు. కానీ ఆచరణలో కొచ్చేసరికి సవాలక్ష నిబంధనలతో మొండిచెయ్యి చూపిస్తుండటంతో కౌలు రైతులకు రుణాలు దక్కడం లేదు. ఆ అరకొర రుణాలు కూడా పూర్తిగా వ్యక్తిగత రుణాలు కాకుండా రైతుమిత్ర గ్రూపులు, జాయింట్‌ ఫార్మర్స్‌ గ్రూప్స్‌కి ఇస్తున్నారు. నెలకొకసారి కౌలు రైతులకు అందించే రుణాల విషయంలో సమీక్ష జరిపి బ్యాంకులకు కూడా కౌలు రైతులకు అందించే రుణాల విషయంలో లక్ష్యాలు నిర్దేశిస్తేనే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది.

Updated Date - Oct 23 , 2024 | 12:01 AM