హైకోర్టుకు రామ్‌కో సిమెంట్ భూముల వ్యవహారం
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:04 AM
కొలిమిగుండ్ల మండలం కల్వటాల సమీపంలోని రామ్‌కో సిమెంట్ పరిశ్రమకు కేటాయించిన అసైన్డ్ భూముల వ్యవహారం హైకోర్టుకు చేరింది.
కొలిమిగుండ్ల, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : కొలిమిగుండ్ల మండలం కల్వటాల సమీపంలోని రామ్‌కో సిమెంట్ పరిశ్రమకు కేటాయించిన అసైన్డ్ భూముల వ్యవహారం హైకోర్టుకు చేరింది. దీంతో ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. పేదలకు పంపిణీ చేసిన 1926 ఎకరాల అసైన్డ్ భూమిని నిబంధనలకు విరుద్ధంగా గత వైసీపీ ప్రభుత్వం రామ్‌కో సిమెంట్ పరిశ్రమకు కేటాయించిందంటూ కొలిమిగుండ్ల మండలానికి చెందిన చెన్నప్ప అనే వ్యక్తి ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణిస్తూ కౌంటర్ దాఖలు చేయా లని పరిశ్రమ వర్గాలకు, జిల్లా అధికా రులకు ఆదేశాలు జారీ చేసింది. కౌంట రు దాఖలుకు కోర్టు మూడు వారాలు గడువు ఇచ్చినట్లు పిటీషనర్ తెలిపారు. వాస్తవానికి 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రామ్‌కో సిమెంట్ పరిశ్రమకు వర్చువల్‌గా భూమి పూజ చేసి ప్రారంభించా రు. నిర్మాణం పూర్తయిన తరువాత 2022లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రామ్‌కో పరిశ్రమను ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కల్వటాల గ్రామ రెవెన్యూ పరిధిలో పేదలకు పంపిణీ చేసిన 1926 ఎకరాల అసైన్డ్ భూములను పరిశ్రమకు బదలాయించింది. ఈ బదలాయింపు చట్టబద్ధంగా జరగలేదంటూ ఇప్పుడు కోర్టులో పిటీషన్ దాఖాలు కావడం గమనార్హం.