సామూహిక మరుగుదొడ్డిని తొలగించి ఇంటి నిర్మాణం
ABN , Publish Date - Jun 21 , 2024 | 11:54 PM
అవుకు మండలం శివవరం గ్రామం ఎస్సీ కాలనీలోని సామూహిక మరుగుదొడ్డిని కూల్చివేసి వైసీపీ నాయకులు ఏకంగా ఇంటిని నిర్మించుకున్నారు.
శివవరంలో వైసీపీ నాయకుల దుశ్చర్య
నిరసనకు దిగిన మహిళలు
అవుకు, జూన్ 21: అవుకు మండలం శివవరం గ్రామం ఎస్సీ కాలనీలోని సామూహిక మరుగుదొడ్డిని కూల్చివేసి వైసీపీ నాయకులు ఏకంగా ఇంటిని నిర్మించుకున్నారు. దీంతో శుక్రవారం గ్రామానికి చెందిన మహిళలు కనకమ్మ, మరియమ్మ, రాణి, భారతి, భాగ్యలత, రత్నమ్మ తదితరులు నిర్మాణం జరుగుతున్న ఇంటి ముందే నిరసనకు దిగారు. మరుగుదొడ్డిని తొలగించి ఆ స్థానంలో ప్రభుత్వ కార్యాలయాన్ని నిర్మిస్తామని వైసీపీ నాయకులు నమ్మబలుకుతూ వచ్చారు. రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు తీసుకవచ్చి 2023 మార్చి 10వ తేదీన అవుకు తహససీల్దార్‌తో గ్రామానికి చెందిన గుత్తి లళితమ్మ పేరు మీద పొజిషన్ సర్టిఫికేట్ తీసుకున్నారు. పంచాయతీ కార్యాదర్శితో ఎలాంటి అప్రూవల్ తీసుకోకుండా ఇంటి నిర్మాణం చేపట్టారు. దాదాపు 90శాతం ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశారు. వైసీపీ అధికారంలో ఉండటంతో బాధిత మహిళలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించలేదు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి టీడీపీ అధికారంలోకి రావటంతో గ్రామ పెద్దల సహకారంతో మహిళలు తరలివచ్చి నీళ్ల చెంబులు చేత పట్టుకొని నిరసనకు దిగారు. బహిర్భూమికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు మహిళలు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి పట్టనట్లు వ్యవహరించటం వైసీపీ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. అయితే అప్పటికే గుత్తి లళితమ్మ కోర్టుకు వెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ తీసుక వచ్చింది. బాధిత మహిళలు పంచాయతీ సెక్రటరీ మునీరాకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయటంతో ఇంటి నిర్మాణం జరుపుతున్న గుత్తి లళితమ్మకు ఈ నెల 11వ తేదీన నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇరువర్గాల మహిళలు వాదోపవాదాలకు దిగటంతో ఎస్‌ఐ కిరణ్‌బాబు శివవరం చేరుకొని ఇంటి నిర్మాణాన్ని నిలిపివేయాలని గుత్తి లళితమ్మను హెచ్చరించారు. ఇరువర్గాల వారిని స్టేషన్‌కు తరలించి బైండోవర్ కేసులు నమోదు చేసి తహసీల్దార్ ముందు హాజరు పరచి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.