Share News

నేడు ఏపీఆర్‌ఆర్‌పీ పనులపై సమీక్ష

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:42 PM

జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ రూరల్‌ రోడ్స్‌ ప్రాజెక్టు(ఏపీఆర్‌ఆర్‌పీ) కింద చేపట్టిన పనులపై ప్రభుత్వం బుధవారం విజయవాడలో సమీక్షా సమావేశం నిర్వహించనుంది.

నేడు ఏపీఆర్‌ఆర్‌పీ పనులపై సమీక్ష

ఆరు ప్యాకేజీల్లో 42 పనులు పూర్తి, పురోగతిలో 23

కర్నూలు, న్యూసిటీ, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ రూరల్‌ రోడ్స్‌ ప్రాజెక్టు(ఏపీఆర్‌ఆర్‌పీ) కింద చేపట్టిన పనులపై ప్రభుత్వం బుధవారం విజయవాడలో సమీక్షా సమావేశం నిర్వహించనుంది. ఇప్పటి వరకు పనులు ఎంత వరకు పూర్తి అయ్యాయో వాటిపై ఆరా తీయనుంది. 2019 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ పనులకు టెండర్లు పిలిచారు. అంతలోనే ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. అప్పట్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో టెండర్ల దశలో ఆగిపోయిన ఈ పనులను ప్రారంభించింది. ఈ క్రమంలోనే జిల్లాలో 41,42,43,44ఏ,44బి,44సి ప్యాకేజీల కింద రూ.189.11 కోట్లతో 85 పనులను(86.10 కి.మీ. రోడ్లు, బ్రిడ్జీలు) చేపట్టారు. ఇందులో ఇప్పటి వరకు 42 పనులు పూర్తి అయ్యాయి. 23 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మిగితా పనుల ఊసే లేదు. చేపట్టిన పనులకు సంబంధించి మొత్తం రూ.82 కోట్లు వెచ్చించగా గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.49 కోట్లు మాత్రమే చెల్లించింది.

హాజరుకానున్న పీఆర్‌ అధికారులు

జిల్లాలో ఐదేళ్ల కాలంలో ఏపీఆర్‌ఆర్‌పీ కింద చేపట్టిన పనులపై విజయవాడలో జరిగే పీడీ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లా నుంచి పీఆర్‌ ఎస్‌ఈ, ఈఈ, డీఈఈలు హాజరుకానున్నారు. ఈ సమీక్షలో ప్రధానంగా ఈ పనులకు సంబంధించి పెండింగ్‌ బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌, నిధి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు జరుగుతున్న జాప్యం, అప్రూవ్‌ అయిన పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే గడిచిన ఆరు నెలలుగా ఎలాంటి పురోగతి చూపించని పనులు, నెలవారీ ప్రగతి నివేదికల గురించి సమీక్షా సమావేశంలో చర్చించనున్నారు. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి ఎన్ని పనులు పూర్తి చేస్తారు? ల్యాప్స్‌ అయిన ఈఓఏటీలపై వివరాలను సంబంధిత ఇంజనీర్ల నుంచి కోరనున్నారు. ఇరిగేషన్‌, ఫారెస్టు డిపార్టుమెంటు నుంచి క్లియరెన్సు రావాల్సిన విషయాలపై సమీక్షించనున్నారు.

Updated Date - Oct 22 , 2024 | 11:42 PM