కాయితాల మీదే ఇంటింటికి బియ్యం
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:01 AM
ఆలూరు పట్టణం కోయా నగరంలో పౌర సరఫరా దుకాణం-31 వద్ద ఆదివారం ప్రభుత్వం ఇస్తున్న రాయితీ బియ్యం కోసం కార్డుదారులు క్యూ కట్టారు.
ఆపరేటర్లకు జీతాలు చెల్లిస్తున్న రెవెన్యూ అధికారులు
ఆలూరులో ఏడాదిగా సాగుతున్న భాగోతం
బియ్యం అక్రమ రవాణా చేస్తున్న పలువురు ఎండీయూ వాహనాల ఆపరేటర్లు
కిలో రూ.10కు కొనుగోలు చేస్తున్న వైనం
ఆలూరు/కర్నూలు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఆలూరు పట్టణం కోయా నగరంలో పౌర సరఫరా దుకాణం-31 వద్ద ఆదివారం ప్రభుత్వం ఇస్తున్న రాయితీ బియ్యం కోసం కార్డుదారులు క్యూ కట్టారు. ఇంటింటికి వెళ్లి పేదలకు బియ్యం పంపిణీ చేసేందుకు ఎండీయూ వాహనాలు ఉన్నాయి కదా..? ఆ వాహనాల ఆపరేటర్లకు నెలకు రూ.26,500 జీతాలు ఇస్తున్నారు. అయినా ప్రజా పంపిణీ దుకాణాలకు బియ్యం కోసం కార్డుదారులు ఎందుకు వస్తున్నారు..? విచారిస్తే విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. ఏడాది కాలంగా ఎండీయూ వాహనాలు రోడ్డెక్కలేదు. అయినా.. నెలనెలా ఇంటింటికి వెళ్లి బియ్యం పంపిణీ చేస్తున్నట్లు రికార్డుల్లో నమోదు చేసి ఆపరేటర్లకు రెవిన్యూ అఽధికారులు జీతాలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఆలూరులో ఒక్కటే కాదు.. జిల్లాలో చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి.
జిల్లాలో ఏపీ ప్రభుత్వ ప్రజా పంపిణీ (సివిల్ సప్లయ్) విభాగం పర్యవేక్షణలో 1,233 నిత్యావసర సరుకుల పంపిణీ దుకాణాలు ఉన్నాయి. 6.72 లక్షల రేషన్ కార్డుదారులకు ప్రతి నెల 9-10 వేల మెట్రిక్ టన్నుల రాయితీ బియ్యం సరఫరా చేస్తున్నారు. ఒక్కొక్కరికి 5 కిలోలు చొప్పున కుటుంబంలో ఎంత మంది ఉంటే అందరికి ఇస్తున్నారు. పౌర సరఫరాల విభాగం నిత్యావసర సరుకుల దుకాణాలు ద్వారా బియ్యం, పప్పు, వంటనూనె.. వంటి రాయితీ సరుకులు ఇచ్చేవారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఇంటింటికి సరఫరా చేయాలనే లక్ష్యంగా ఎండీయూ వాహనాలను తీసుకొచ్చారు. జిల్లాలో 409 ఎండీయూ వాహనాలు ఉన్నాయి. ఇంటింటికి వెళ్లి బియ్యం పంపిణీ చేస్తున్న వాహనాల ఆపరేటర్లు, హెల్పర్ ఇద్దరికి నెలకు రూ.26,500 చెల్లిస్తున్నది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా పేదలకు ఇంటికే నిత్యావసర సరకులు అందుతాయనే లక్ష్యంగా ఈ వాహనాలు కొనసాగిస్తున్నారు. మెజార్టీ వాహన ఆపరేటర్లు వైసీపీ మద్దతుదారులు అని సమాచారం. డిసెంబరు కోటా రాయితీ బియ్యం పంపిణీ ఆదివారం మొదలైంది. ఎండీయూ వాహనాలు ఇంటింటికి వెళ్లి బియ్యం పంపిణీ చేస్తున్నారా..? ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఆసక్తి విషయాలు వెలుగు చూస్తున్నాయి. పలు మండలాల్లో వాహనాలు రోడ్డెక్కకపోయినా రికార్డుల్లో మాత్రం బియ్యం పంపిణీ చేస్తున్నట్లు చూపించి ఆపరేటర్లకు జీతాలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు నగరంలో వాహన ఆపరేటర్లు కొందరు బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు వెలుగు చూస్తుంది.
రోడ్డెక్కకపోయినా ఆపరేటర్లకు జీతాలు
ఆలూరు మండలంలో ఏపీ సివిల్ సప్లయ్ దుకాణాలు 33, రేషన్ కార్డుదారులకు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసేందుకు 10 ఎండీయూ వాహనాలు ఉన్నాయి. వాహన ఆపరేటర్, అసిస్టెంట్ ఇద్దరికి రూ.26,500 చెల్లిస్తున్నారు. కోయా నగరం సివిల్ సప్లయ్ షాప్-31 వద్ద రాయితీ బియ్యం కోసం కార్డుదారులు బారులు తీరారు. విచారిస్తే. ఏడాదిగా ఎండీయూ వాహనదారులు బియ్యం పంపిణీ చేయడం లేదని కార్డుదారులు తెలిపారు. ఏ ఒక్క వాహనం కూడా రోడ్డెక్కలేదని తెలుస్తోంది. అయితే.. రెవిన్యూ రికార్డుల్లో మాత్రం నెలనెల ఎండీయూ వాహన ఆపరేటర్లు బియ్యం పంపిణీ చేస్తున్నట్లు చూపించి ఒక్కో వాహనానికి రూ. 26.500 చెల్లిస్తున్నారు. పది వాహనాలకు నెలకు రూ.2.65 లక్షలు చొప్పున ఏడాది కాలంలో రూ.31.80 లక్షలు చెల్లించినట్లు తెలుస్తున్నది. ఆ వాహనాలు ఎక్కడున్నాయో ఆరా తీయగా ఉపాధ్యాయ నగర్‌లోని ఆపరేటర్ ఇంటి ముందు మూడు వాహనాలు ఆపేశారు. వాటికి మాజీ సీఎం జగన్ ఫొటో స్టిక్కర్ కూడా తొలగించలేదు. దుమ్ము దూళితో నిండిపోయాయి. అంటే.. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ వాహనాలు రోడ్డెక్కలేదని తెలుస్తున్నది. అయినా.. బియ్యం పంపిణీ చేసినట్లు రికార్డుల్లో చూపించి నెలనెలా రెవిన్యూ అధికారులు జీతాలు ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటి..? ఈ భాగోతంలో అధికారులకు కూడా వాటా ఉందన్న ఆరోపణులు లేకపోలేదు. హొళగుంద, మంత్రాలయం, ఎమ్మిగనూరు, పెద్దకడబూరు మండలాల్లో కూడా ముప్పాతిక శాతం ఎండీయూ వాహనాలు రోడ్డెక్కడం లేదని తెలుస్తున్నది. జిల్లాలో చాలా మండలాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. రెవిన్యూ అధికారుల వివరణ కోరిన తరువాత హడావుడిగా ఒకటి రెండు వాహనాలు రోడ్డెక్కడం కొసమెరుపు.
కర్నూలు నగరం ఓల్డ్‌టౌన్, కొత్తపేట, లేబర్ కాలనీ, బుధవారపేట.. తదితర కాలనీలో ఎండీయూ వాహనాలు ఇంటింటికి వెళ్లి బియ్యం పంపిణీ చేస్తున్నారా..? అని పరిశీలిస్తే.. ఇక్కడ బియ్యం అక్రమ కొనుగోలు భాగోతం వెలుగు చూసింది. కార్డుదారులు వేలి ముద్రలు (తంబ్) వేయించుకుంటారు. బియ్యం కావాలా..? డబ్బులు కావాలా..? అని అడుగుతారు. కార్డుదారులు డబ్బులు కావాలంటే కిలో రూ.10 ప్రకారం లెక్కకట్టి ఇస్తున్నాడు. ఐదుగురు సభ్యులు ఉన్న కార్డుదారుడు బియ్యం వద్దంటే 25 కిలోలకు రూ.250 ఇస్తున్నారు. ఎండీయూ వాహనాలు బియ్యం అక్రమ రవాణాకు అడ్డాగా మారాయి. కార్డుదారుడితో కిలో రూ.10కు కొనుగోలు చేసిన బియ్యాన్ని కిలో రూ.14-16కు మాఫియాకు విక్రయిస్తున్నట్లు సమాచారం. సగం కార్డుదారులు ఎండీయూ వాహనాల ఆపరేటర్లకే బియ్యం ఇచ్చేసి డబ్బులు తీసుకుంటున్నారని తెలుస్తున్నది. ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని సమాచారం. పేదలకు ఆకలి తీర్చి ‘ఆహార భద్రత’ కల్పించాలనే సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కిలో రూ.40.50 ఖర్చు చేస్తున్నది. కార్డుదారుల నుంచి కేవలం రూ.10కు ప్రకారం సేకరించి రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు.
విచారించి చర్యలు తీసుకుంటాం
ఆలూరు మండలంలో 10 ఎండీయూ వాహనాలు ఉన్నాయి. ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి 15వ తేది వరకు ఇంటింటికి వెళ్లి కార్డుదారులకు ఎండీయూ వాహనాల ఆపరేటర్లు బియ్యం పంపిణీ చేయాలి. ఒక్కో వాహనానికి రూ.26,500 ప్రభుత్వం ఇస్తుంది. ఏడాదిగా ఈ వాహనాలు రోడ్డెక్కలేదనే విషయం నా దృష్టికి రాలేదు. విచారించి శాఖపరమైన చర్యలు తీసుకుంటాం.
- గోవిందుసింగ్, తహసీల్దార్, ఆలూరు
తక్షణ చర్యలు తీసుకుంటాం
తహసీల్దార్లు ఇచ్చే రిపోర్టు ఆధారంగానే ఎండీయూ వాహనాల ఆపరేటర్లకు జీతాలు ఇస్తున్నాం. బియ్యం పంపిణీ చేయకుండానే జీతాలు తీసుకుంటున్న దానిపై విచారణ చేయిస్తాను. నిజమని తేలితే చర్యలు తప్పవు. ఎండీయూ వాహనాల ఆపరేటర్లు కొందరు వాహనాల వద్దే బియ్యానికి బదులుగా కిలోకు రూ.10 లెక్క కట్టి డబ్బులు ఇవ్వడం నేరం అవుతుంది. ఆకస్మిక తనిఖీలు చేస్తాం. మా తనిఖీల్లో తెలితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.
- రఘువీర్, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజరు, కర్నూలు