Share News

కుడా చైర్మన్‌గా సోమిశెట్టి

ABN , Publish Date - Nov 10 , 2024 | 12:40 AM

రాష్ట్రవ్యాప్తంగా శనివారం ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్‌ పదవుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాకు ప్రాధాన్యం లభించింది.

కుడా చైర్మన్‌గా సోమిశెట్టి
సోమిశెట్టి వెంకటేశ్వర్లు

వాల్మీకి/బోయ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా బొజ్జమ్మ

కురుబ కార్పొరేషన్‌కు దేవేంద్రప్ప

ముస్తాక్‌ అహ్మద్‌కు స్టేట్‌ మైనార్టీస్‌ ఫైనాన్స్‌

బీజేపీ కోటాలో న్యాయవాది సావిత్రికి రజక కార్పొరేషన్‌

కర్నూలు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా శనివారం ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్‌ పదవుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాకు ప్రాధాన్యం లభించింది. నలుగురికి కీలక పదవులు దక్కడంతో టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లును కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) చైర్మన్‌ పదవి రెండో పర్యాయం వరించింది. కర్నూలు జిల్లాలో ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కప్పట్రాళ్ల బొజ్జమ్మకు ఏపీ వాల్మీకి/బోయ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌, బీజేపీ కోటాలో ఆదోనికి చెందిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సావిత్రికి రజక కార్పొరేషన్‌ కేటాయించారు. ఆదోని నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్‌ నాయకుడు, ఆదోని మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ పెద్దహరివాణం దేవేంద్రప్పకు కురుబ/కురుమ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ దక్కగా నంద్యాల జిల్లా నుంచి నంద్యాల పట్టణానికి చెందిన టీడీపీ మైనార్టీ సీనియర్‌ నాయకుడు ముస్తాక్‌ అహ్మద్‌కు ఏపీ స్టేట్‌ మైనార్టీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి కేటాయించారు. ఇదిలా ఉండగా గత ఎన్నికల్లో పొత్తు, సామాజిక సమీకరణాల్లో భాగంగా సీట్లు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డిలకు మళ్లీ నిరాశే మిగిలింది. అయితే అసెంబ్లీ సమావేశాలు తరువాత నామినేటెడ్‌ పదవులకు సంబంధించి మూడో జాబితా ప్రకటించే అవకాశం ఉంది. సీట్లు త్యాగం చేసిన నేతలు, పార్టీ గెలుపు కోసం కష్టపడిన నాయకులకు అవకాశం ఉంటుందని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసినట్లు సమాచారం.

విధేయతకు మళ్లీ అవకాశం

టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి, అధినేత చంద్రబాబుకు విధేయుడుగా కొనసాగుతున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లును రెండవసారి కుడా చైర్మన్‌ పీఠం కేటాయించారు. 1982లో హైదరాబాద్‌ నిజాం గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో.. ప్రభంజనంలా తరలివచ్చిన జనం మధ్య ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. ఆ వేదికపైనే పలువురు నాయకులకు టీడీపీ సభ్యత్వం ఇచ్చారు. కర్నూలు జిల్లా నుంచి పార్టీ ఆవిర్భావం రోజున సభ్యత్వం తీసుకున్న వారిలో దివంగత మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి, శేగు వెంకటరమణ, ఉచ్చప్ప, వెంకటస్వామితో పాటు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, బీవీ రెడ్డిలు ఎన్టీఆర్‌ సమక్షంలో టీడీపీ చేరారు. ఆయన చేతులు మీదుగా సభ్యత్వం తీసుకున్నారు. ఆనాటి నుంచి టీడీపీలోనే కొనసాగుతూ నాడు టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌, నేడు అధినేత చంద్రబాబులకు అత్యంత సన్నిహితుడుగా ఉంటూ వస్తున్నారు. 25 ఏళ్లపాటు ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2017లో కుడా తొలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. టీడీపీ కూటమి అధికారంలోకి రావడం, అధినేత చంద్రబాబు మరోసారి అవకాశం ఇవ్వడంతో ఆ పదవి రెండవ పర్యాయం కూడా వరించింది. ఈ పీఠం కోసం టీడీపీ సీనియర్‌ నాయకులు పలువురు పోటీ పడినా అధినేత చంద్రబాబు సోమిశెట్టి వైపే మొగ్గుచూపారు.

ఉమ్మడి జిల్లాలో నామినేటెడ్‌ పదవులు దక్కించుకున్న వాల్మీకి/బోయ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కప్పట్రాళ్ల బొజ్జమ్మ, కురుబ/కురుమ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పెద్దహరివాణం దేవేంద్రప్ప, ఏపీ స్టేట్‌ మైనార్టీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ముస్తాక్‌ అహ్మద్‌లకు సామాజికవర్గం కలసి వచ్చింది. వాల్మీకి సామాజికవర్గానికి చెందిన కప్పట్రాళ్ల బొజ్జమ్మ పత్తికొండ సమితి దివంగత మాజీ అధ్యక్షుడు కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు కుమార్తే. ఆయన మరణాంతరం తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. ఆస్పరి జడ్పీటీసీగా పని చేశారు. గత ఎన్నికల్లో వాల్మీకి కోటాలో ఆలూరు వైసీపీ టికెట్‌ ఆశించి నాటి సీఎం జగన్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అయితే.. జగన్‌ మొండి చేయి చూపడంతో ఆమే భర్త దేవనకొండ మాజీ ఎంపీపీ రామచంద్ర నాయుడుతో కలసి మళ్లీ టీడీపీలో చేరారు. గుర్తించిన సీఎం చంద్రబాబు వాల్మీకి-బోయ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చారు. కురబ సామాజికవర్గానికి చెందిన దేవేంద్రప్ప మొదటి నుంచి టీడీపీలో కొనసాగుతున్నారు. పెద్దహరివాణం సర్పంచిగా, ఆదోని మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా పని చేశారు. గత ఎన్నికల ముందు ఆదోని టీడీపీ టికెట్‌ ఆశించారు. ఆదోని డివిజన్‌ ప్రాంతంలో కురబలు అధికంగా ఉన్నారు. దీంతో ఆయనకు కురబ-కురవ కార్పొరేషన్‌ పదవి దక్కింది. బీజేపీ కోటాలో ఆదోనికి చెందిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది సావిత్రిని రజక వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఎంపిక చేశారు. చదువుకునే రోజుల్లో ఏబీవీపీ విద్యార్థి సంఘంలో పనిచేశారు. ఆ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌లో చురుకైన కార్యకర్తగా పనిచేశారు. ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. కాగా సావిత్రి భర్త నాగరాజు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ.. ఎస్టీయూ రాష్ట్ర నాయకుడిగా ఉన్నారు. నంద్యాల పట్టణంలో ముస్లీం మైనార్టీలు అధికంగా ఉన్నారు. ఆ సామాజికవర్గానికి చెందిన ముస్తాక్‌ అహ్మద్‌కు ఏపీ స్టేట్‌ మైనార్టీస్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ ఇచ్చారు. నామినేటెడ్‌ పదవులు దక్కిన నేతలను అభిమానులు, కార్యకర్తలు కలసి అభినందనలు తెలియజేశారు.

ఆ ఇద్దరు నేతలకు నిరాశ

టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు వై.సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డిలను టీడీపీ ఇన్‌చార్జిలు, మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు, పి.తిక్కారెడ్డిలు దీటుగా ఎదుర్కొన్నారు. కార్యకర్తలకు అండగా నిలిచారు. ఆదోనిలో నిర్వహించిన బాదుడే బాదుడు రోడ్‌ షో దిగ్విజయం చేసి మీనాక్షినాయుడు రాష్ట్రంలోనే టీడీపీ శ్రేణుల్లో సరికొత్త నూతనోత్తేజం తీసుకొచ్చారని అధినేత చంద్రబాబు మహానాడు వేదికగానే ప్రశంసించారు. యువగళం పాదయాత్ర ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాల్లో దిగ్విజయం చేయడం, అధినేత అక్రమ అరెస్టుతో 53 రోజులు అక్రమంగా జైలు నిర్భందంలో ఉంటే వివిధ రూపాల్లో అందోళన, నిరసనలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో మీనాక్షినాయుడు, తిక్కారెడ్డి వారి కుటుంబ సభ్యుల కృషి ఎంతో ఉంది. గత ఎన్నికల్లో మరోసారి ఆయా నియోజకవర్గాల్లో వారే పోటీ చేస్తారని అధిష్టానం సంకేతాలు కూడా ఇచ్చింది. అయితే పొత్తుల్లో భాగంగా కె.మీనాక్షినాయుడు ఆదోని టికెట్‌, సామాజిక సమీకరణాల్లో భాగంగా మంత్రాలయం టికెట్‌ తిక్కారెడ్డి త్యాగం చేయాల్సి వచ్చింది. ‘వీరి రాజకీయ భవిషత్తు నాది.. అధికారం చేపట్టగానే తొలి జాబితాలోనే నామినేటెడ్‌ పదవులు ఇస్తా’నని అధినేత చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. జిల్లా పార్టీలోనే అత్యంత సీనియర్‌ నాయకుడైన కె.మీనాక్షినాయుడుకు సముచిత స్థానం కల్పిస్తానని ఎన్నికల ముందు ఆలూరు ప్రజాగళం ప్రచార సభకు హాజరైన చంద్రబాబు బస్సులో దాదాపు అరగంటకు పైగా చర్చించి స్పష్టమైన హామీ ఇచ్చారు. నామినేటెడ్‌ పదవులు రెండు జాబితాలు విడుదల చేసినా సీట్లు త్యాగం చేసిన వీరిద్దరికి నిరాశే మిగిలింది.

Updated Date - Nov 10 , 2024 | 12:40 AM