గంజాయిపై ఉక్కుపాదం
ABN , Publish Date - Jul 15 , 2024 | 11:04 PM
నంద్యాల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయడంతోపాటు స్ర్తీ, శిశు రక్షణకు పెద్దపీట వేస్తామని ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా అన్నారు.
స్ర్తీ, శిశు రక్షణకు ప్రాధాన్యం
బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా
నంద్యాల క్రైం, జూలై 15: నంద్యాల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయడంతోపాటు స్ర్తీ, శిశు రక్షణకు పెద్దపీట వేస్తామని ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా అన్నారు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అధిరాజ్‌సింగ్ రాణా 2018 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా నంద్యాల ఎస్పీగా వచ్చారు. ముందుగా ఆయన అనంతపురం జిల్లాలో ట్రైనీ ఐపీఎస్‌గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత గ్రేహౌండ్స్‌లో అసాల్ట్ కమాండర్‌గా, అసిస్టెంట్ ఎస్పీగా పని చేశారు. రంపచోడవరంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో చొరవచూపారు. నర్సీపట్నంలో ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించి నేర నియంత్రణలో భాగంగా తనదైన శైలిలో గంజాయి, అక్రమ రవాణా, వివిధ రకాల నేరాలపై ఉక్కుపాదం మోపి శాంతిభద్రతల పరిరక్షణకు కృషి వేశారు. నంద్యాలలో బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డీజీపీలు తనపై నమ్మకంతో నంద్యాల ఎస్పీగా పంపారన్నారు. అప్పగించిన బాధ్యతలను వందశాతం సమర్థంగా నిర్వర్తించి జిల్లా ప్రజలకు, పోలీస్‌శాఖకు మంచిపేరు తెస్తానని పేర్కొన్నారు. మహిళలపై జరిగే నేరాల నిర్మూలన, మహిళల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని చెప్పారు. నేర నియంత్రణ తదితర సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సహకారంతో ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తానని స్పష్టం చేశారు. అలాగే పోలీసుల సంక్షేమంపై దృష్టి సారిస్తానని, పోలీస్ అధికారులు, సిబ్బంది ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించే ప్రసక్తేలేదన్నారు. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో మీడియా కూడా సహకారం అందించాలని ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా కోరారు.