రద్దీ రోజుల్లో స్పర్శ దర్శనం నిలుపుదల
ABN , Publish Date - Dec 04 , 2024 | 12:24 AM
నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లికార్జున స్వామివారి స్పర్శదర్శనం, ఆర్జిత గర్భాలయ, సామూహిక అభిషేకాలను రద్దీ రోజులు శని, ఆది, సోమ, ప్రభుత్వ సెలవు రోజులు, ప్రత్యేక రోజుల్లో పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
శ్రీశైలం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లికార్జున స్వామివారి స్పర్శదర్శనం, ఆర్జిత గర్భాలయ, సామూహిక అభిషేకాలను రద్దీ రోజులు శని, ఆది, సోమ, ప్రభుత్వ సెలవు రోజులు, ప్రత్యేక రోజుల్లో పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అదేవిధంగా ఉదయాస్తమాన సేవ, ప్రాతఃకాల సేవ, ప్రదోషకాల సేవలు కూడా నిలుపుదల చేశారు. ఈ రోజులలో భక్తులందరికీ స్వామివారి అలంకరణ దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు తెలిపారు. కాగా రద్దీ రోజుల్లో వృద్ధ మల్లికార్జున స్వామికి జరిగే ఆర్జిత అభిషేకాలు, ఆలయంలో జరిగే అన్ని రకాల ఇతర ఆర్జితసేవలు యఽథావిధిగా ఉంటాయి. అలాగే అమ్మవారి ముఖ మండపంలో నిర్వహించుకునే కుంకుమార్చనను రద్దీ రోజులలో నిలుపుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ సేవలకు సంబంధించిన టికెట్లను ఇప్పటికే అన్‌లైన్‌లో నిలుపుదల చేసినట్లు, ముందుగానే టికెట్లు పొందిన భక్తులకు మాత్రం సేవలను నిర్వహించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రానికి రోజురోజుకు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకే దేవస్థానం వైదిక కమిటీ, అధికారుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.