‘సహకార’ అధ్యక్ష పీఠంపై తమ్ముళ్ల ఆశలు
ABN , Publish Date - Nov 18 , 2024 | 12:09 AM
స్థానిక విశాల పరపతి సంఘం అధ్యక్ష పదవిపై తెలుగు తమ్ముళ్లు ఆశలు పెంచుకుంటున్నారు.
టీడీపీ ఇన్‌చార్జి ఆశీస్సులు ఎవరికో?
పోటీ పడుతున్న నాయకులు
ఇప్పటికే రైతులతో సభ్యత్వాన్ని చేయిస్తున్న నాయకులు
ఆలూరు, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక విశాల పరపతి సంఘం అధ్యక్ష పదవిపై తెలుగు తమ్ముళ్లు ఆశలు పెంచుకుంటున్నారు. 2013లో ఎన్నికలు నిర్వహించారు. అనంతరం మళ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. గతంలో వైసీపీ ప్రభుత్వం త్రీమెన్ కమిటీని నియమించింది. ఇందులో ఒకరు అధ్యక్షుడు కాగా, ఇద్దరు డైరెక్టర్లు ఉండేవారు. గతంలో ఈ పదవులు పెద్దహోతూరు, హత్తిబెళగల్, మొలగవళ్లి గ్రామాల నాయకులకు దక్కాయి. కూటమి ప్రభు త్వం వచ్చాక 11మంది డైరెక్ట ర్లు, అధ్యక్షుడు ఉండేలా నిర్ణయం తీసుకుంది. సొసైటీలో దాదాపు 3వేల మంది వరకు రైతులు సభ్యులుగా ఉన్నారు.
సభ్యత్వం మొదలు..
పదవి దక్కించుకునేందుకు ముందస్తుగా ఒక్కొక్కరు 30నుంచి40 మంది రైతులతో సభ్యత్వం కూడా చేయించారు. ఆదాయ వనరుగా ఉన్న ఈ పదవి ఎలాగైన దక్కించుకోవాలని రైతులతో సంబంధాలు పెంచుకుంటున్నారు. మరి టీడీపీ ఇన్‌చార్జి ఈ పదవిని ఎవరికి కట్టబెడతారో చూడాలి.
నాయకుల ప్రయత్నాలు
పదవి దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. టీడీపీ ఇన్‌చార్జిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పదవి కోసం ఓ విలేకరితో పాటు కురువ వర్గానికి చెందిన మొలగవల్లి బెలగంటి హనుమప్ప, మైనారిటీ వర్గానికి చెందిన అరికేర వన్నూర వల్లి, జిలానీ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నరసప్ప, కొమ్ము రామాంజనేయులు, వాల్మీకి సామాజిక వర్గానికి చెదిన డా.నెట్టప్ప, ముద్దురంగ, యాదవ వర్గం నుంచి ఉగాది రాము ప్రయత్నిస్తున్నారు.