శివనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు
ABN , Publish Date - Nov 19 , 2024 | 12:51 AM
కార్తీక మూడో సోమవా రాన్ని పురస్కరించుకుని శివాలయాలకు భక్తులు పోటెత్తారు.
భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు
బనగానపల్లె, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): కార్తీక మూడో సోమవా రాన్ని పురస్కరించుకుని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు యాగంటికి తరలిరావడంతో తెల్లవారు ఝామున నుంచే క్యూలైన్లు నిండిపోయాయి. యాగంటి బసవేశ్వరున్ని, ఉమామహేశ్వరస్వామిని దర్శించుకున్నారు. భక్తులు అభిషేకాలు, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు చిన్న కోనేరు, శ్రీవీరబ్రహ్మేంద్రగవి, శంకర గవి, శ్రీ వెంకటేశ్వరస్వామి గవిని దర్శిం చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లను ఈవో చంద్రుడు, మౌళీశ్వరరెడ్డి, ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.
ప్యాపిలి: కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా పట్టణంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నీలకంఠేశ్వరస్వామి, ఈశ్వర స్వామి, భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు.
కొలిమిగుండ్ల: కార్తీక మాసం మూడవ సోమవారం పురస్కరించుకొని మండలంలోని ప్రముఖ శైవక్షేత్రాలన్నీ శివనామ స్మరణలో మారుమోగాయి. ఈసందర్భంగా కొలిమిగుండ్ల శివాలయం, బెలుం సిద్ధరామేశ్వరాలయం, పేట్నీకోట విశ్వేశ్వరస్వామి ఆలయం, నేలబిళం మల్లేవ్వరస్వామి ఆలయాల్లో మహిళలు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించడంతో ఆలయాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. బెలుం సిద్ధ రామేశ్వరస్వామి ఆలయంలో అన్నాభి షేకం కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు మహేష్‌శర్మ ఆధ్వర్యంలో భక్తి శ్రద్దలతో నిర్వహించారు.
ఉయ్యాలవాడ: మండలంలోని అన్ని గ్రామాల్లో కార్తీక మాస మూడో సోమవారం పూజలు ఘనంగా నిర్వహించారు. ఉయ్యాలవాడ శివాలయంలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. రూపనగుడిలో మహిళలు తెల్లవారు జామున కుందూనదిలో దీపాలు వెలిగించి వదిలారు. ఆర్.జంబులదిన్నె గ్రామంలో ఆంజనేయస్వామికి, ఇంజేడు గ్రామంలో వెంకటేశ్వరస్వామికి అర్చ కుడు కీర్తి లక్ష్మణస్వామి అభిషేకం అలంకరణ చేసి దీప దూప నైవేద్యాలు సమర్పించారు. మార్మెమ్మ గుడి వద్ద భక్తులకు అన్నదానం చేశారు.
ఆళ్లగడ్డ(శిరివెళ్ల): నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలు, ఆలయాలు సోమవారం శివనామ స్మరణతో మారుమోగాయి. మహిళలు ఆలయాలకు వెళ్లి కార్తీక దీపాలు వెలిగించారు. ఆళ్లగడ్డ మండలంలోని కాశింతల క్షేత్రంలో టీడీపీ యువ నాయకుడు భూమా జగత విఖ్యాతరెడ్డి స్వామి వారికి అభిషే కం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అహోబిలం లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం నిర్వాహకుల ఆధ్వర్యంలో లక్ష్మీవనంలో నిర్వహించిన కార్తీక వనభోజన మహోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. శ్రీదేవీ, భూదేవి సమేత ప్రహ్లాదవరద స్వామికి ఆయన విశేష పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు.
చాగలమర్రి: చాగలమర్రి గ్రామంలోని ఆమలింగేశ్వర, భీమలింగేశ్వర, బుగ్గమల్లేశ్వర, భైరవిశ్వర ఆలయాల్లో సోమవారం కార్తీకదీపోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయాల్లో శివపార్వతులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఓంకారనాథలతో ఆలయాలు మారుమోగాయి. మహి ళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి దీపోత్సవం చేశారు. శివ పార్వతుల పల్లకి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆల యాల అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.