Share News

పేదలకు వైద్యసేవలు అందించడమే లక్ష్యం

ABN , Publish Date - Aug 27 , 2024 | 11:41 PM

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అఖిలప్రియ అన్నారు.

పేదలకు వైద్యసేవలు అందించడమే లక్ష్యం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే అఖిలప్రియ

ఆళ్లగడ్డ, ఆగస్టు 27: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అఖిలప్రియ అన్నారు. ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలలో మంగళవారం అభివృద్ధి కమిటీని నూతనంగా ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ 2019లో టీడీపీ ప్రభుత్వం 15 పడకల వైద్యశాలను 50 పడకల వైద్యశాలగా మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, ఇందుకు రూ.8 కోట్లను మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ నిధులతో కేవలం ప్రభుత్వ వైద్యశాల ముందర మాత్రమే అభివృద్ధి చేసి వెనుక వదిలేసిన పనులను ప్రారంభించామన్నారు. ప్రభుత్వ వైద్యశాలను 100 పడకల వైద్యశాలగా మార్చి పేదలకు ఖరీదైన వైద్యం అందుబాటులోకి తెస్తానన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబునాయుడుతో సహా అన్ని శాఖల మంత్రులను కలుస్తుండగా ఇది ఓర్వలేని వారు తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆళ్లగడ్డలో వ్యాపారస్తులను బెదిరిస్తే తన దృష్టికి తీసుకరావాలని, వారు ఎంతటి వారైన చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం వైద్యశాలలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో ఎమ్మెల్యే కంటి పరీక్ష చేయించుకున్నారు. ఈ సమావేశంలో వైద్యశాల సూపరింటెండెంట్‌ సుజాతమ్మ, సూపర్‌వైజర్‌ దస్తగిరిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2024 | 11:41 PM