Share News

పుస్తకం తలెత్తుకొని బతికేలా చేస్తుంది

ABN , Publish Date - Nov 18 , 2024 | 12:54 AM

తలదించుకొని కష్టపడి చదివే పుస్తకమే యువతను తలెత్తుకొని బతికేలా చేస్తుందని రాయలసీమ యూనివర్శిటీ ఉప కులపతి ఆచార్య ఎనటీకే నాయక్‌ అన్నారు.

పుస్తకం తలెత్తుకొని బతికేలా చేస్తుంది
ప్రసంగిస్తున్న ఆర్‌యూ ఉపకులపతి ఎనటీకే నాయక్‌

ఆర్‌యూ ఉపకులపతి ఎనటీకే నాయక్‌

కర్నూలు కల్చరల్‌, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): తలదించుకొని కష్టపడి చదివే పుస్తకమే యువతను తలెత్తుకొని బతికేలా చేస్తుందని రాయలసీమ యూనివర్శిటీ ఉప కులపతి ఆచార్య ఎనటీకే నాయక్‌ అన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా నాలుగో రోజు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన కవి సమ్మేళనం, పుస్తక పరిచయ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత గ్రంథాలయ ఉద్యమానికి కృషి చేసిన మహనీయుల చిత్ర పటాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆచార్య ఎనటీకే నాయక్‌ మాట్లాడుతూ మంచి పుస్తకా లకు, సెల్‌ఫోన్లకు ఉన్న వ్యత్యాసాన్ని యువత గమనించాలని అన్నారు. రెండూ తల వంచుకొని చూసినా, పుస్తకం విజ్ఞానాన్ని అందించి భవిష్యత్తులో తల ఎత్తుకొని బతికే మార్గాన్ని చూపిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కవి సమ్మేళనానికి సాహితీ సదస్సు సంస్థ కార్యదర్శి జేఎస్‌ఆర్‌కే శర్మ అధ్యక్షత వహించారు. కవులు కా.వెం. సుబ్బలక్ష్మమ్మ, గద్వాల సోమన్న, సయ్యద్‌ జహీర్‌ అహ్మద్‌, ఇనాయతుల్లా, ఆవుల బసప్ప, బోయ శేఖర్‌, స్వరూప్‌ సిన్హా తదితరులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. కవి గద్వాల సోమన్న రాసిన ‘చిరు మువ్వలు’ అనే పుస్తకాన్ని సభలో ఆవిష్కరించారు. కవులును ఆచార్య ఎనటీకే నాయక్‌, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె. ప్రకాశ శాలువలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

Updated Date - Nov 18 , 2024 | 12:54 AM