Share News

మంచం పట్టిన తోడెండ్లపల్లె

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:42 AM

మండలంలోని తోడెండ్లపల్లె, మల్లేవేముల గ్రామాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి.

మంచం పట్టిన తోడెండ్లపల్లె
జ్వరాలతో అల్లాడుతున్న గ్రామస్థులు

చాగలమర్రి, సెప్టెంబరు 15: మండలంలోని తోడెండ్లపల్లె, మల్లేవేముల గ్రామాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. తోడెండ్లపల్లె గ్రామంలో ఇంటికి ఒకరిద్దరు చొప్పున జ్వర బాధితులు మంచం పట్టారు. ఒకే కుటుంబానికి చెందిన రాంమోహన, చంద్‌ప్రియ, హేమాంజలి, లక్ష్మీదేవి, రాజశేఖర్‌, రామకృష్ణుడుతో పాటు మరో 50 మంది దాక జ్వరాల బారిన పడ్డారు. రోజుల తరబడి జ్వరాలు తగ్గక పోవడం, అది సాధారణ జ్వరమా, వైరల్‌ ఫివరా అని జ్వర పీడితులు భయపడుతున్నారు. జ్వరాలు విజృంభిస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. జ్వర పీడితులు అధిక భాగం వైరల్‌ ఫివర్‌, టైఫాయిడ్‌వారే ఉన్నారు. మల్లేవేముల ఎస్సీ కాలనీలో జ్వరాలతో అల్లాడుతున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసిన పారిశుధ్యం అధ్వానంగా మారింది. మురుగు నీరు ముందుకు కదలడం లేదు. దీంతో దోమలకు ఆవాస కేంద్రాలుగా మారి కంటి మీద కునుకు లేకుండా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమ కాటు వల్ల జ్వరాల బారిన పడుతున్నామని ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువల్లో బ్లీచింగ్‌ పౌడర్‌, హెబిట్‌ ద్రావణంతో పిచికారి చేసి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అప్రమత్తంగా ఉండాలి: వైద్యులు సుల్తానా

వాతావరణం మార్పుతో సీజనల్‌ వ్యాధులు అధికమయ్యాయి. టైఫాయిడ్‌, డెంగీ జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం జ్వర బాధితులు అధికంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. ఇంటి చుట్టూ, పరిసరాల్లో మురుగు నీరు నిల్వ లేకుండా, దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలి. జ్వర బాధితులు నిర్లక్ష్యం చేయకుండా చికిత్సలు చేయించుకోవాలి.

Updated Date - Sep 16 , 2024 | 12:42 AM