ట్రేడ్ లైసెన్సు బకాయిలు
ABN , Publish Date - Nov 20 , 2024 | 12:05 AM
నగర పాలక సంస్థ పరిధిలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, శానిటేషన్ కార్యదర్శుల నిర్లక్ష్యం వల్ల ట్రేడ్ లైసెన్సుల బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి.
వసూళ్లలో నిర్లక్ష్యం..
పట్టించుకోని అధికారులు
కర్నూలు న్యూసిటీ, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): నగర పాలక సంస్థ పరిధిలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, శానిటేషన్ కార్యదర్శుల నిర్లక్ష్యం వల్ల ట్రేడ్ లైసెన్సుల బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. దీని వల్ల నగర పాలక సంస్థ ఆదాయానికి గండిపడుతోంది. పైగా కొత్తగా ఏర్పాటు చేసుకుంటున్న దుకాణాలకు లైసెన్సులు ఇవ్వకుండా కొందరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, శానిటేషన్ కార్యదర్శులు అందినకాడికి దోచుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. నగరంలో వేల సంఖ్యలో దుకాణాలు ఉంటే లైసెన్సులు తీసుకున్న దుకాణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. గతంలో లైసెన్సు తీసుకున్న వారు ఆ తర్వాత రెన్యువల్ చేసుకోవడం లేదు.
నగర పాలక పరిధిలో ట్రేడ్ లైసెన్సు ఫీజు భారీగా పేరుకుపోయాయి. 2021 ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ వరకు మొత్తం బకాయిలు రూ.11,35,23,531 ఉండగా రూ. రూ.8,07,12,580 వసూలు చేశారు. ఇంకా రూ.3,28,10,951 వసూలు చేయాల్సి ఉంది. దీనిపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనిని వసూలు చేయడంలో నగర పాలక ఆరోగ్య విభాగం అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో నగరపాలక సంస్థకు పూర్తిస్థాయిలో గండిపడుతోంది. నగరంలో 50 వేలకు పైగా దుకాణాలు ఉండగా అధికారుల లెక్కల్లో మాత్రం 10,858 దుకాణాలకు లైసెన్సులు ఉన్నట్లు చూపిస్తున్నారు. లైసెన్సుకు నగదు వసూలు చేయని దుకాణాలు సుమారు 25 వేలకు వరకు ఉంటాయి. ఇందులో సిబ్బంది లైసెన్సు పేరుతో వసూలు చేస్తున్న నగర పాలక సంస్థకు జమచేయకుండా స్వాహ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రతి సంవత్సరం రూ.లక్షలు పక్కదారి పడుతున్నాయి. బకాయిలు చాలా వరకు వసూలు చేసి లెక్కలు చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నగర పాలక ఉన్నతాధికారులు లైసెన్సు వసూళ్లపై దృష్టిసారిస్తే నగర పాలక ఆదాయం పెరుగుతోంది.
దోచుకుంటున్నారు...
నగరంలో సుమారు 7 లక్షల జనాభా ఉంది. చిన్న, పెద్ద దుకాణాలు కలిపి 50 వేలకు పైగా ఉంటాయి. నగర పాలక పరిధిలో 10858 దుకాణాలకు మాత్రమే లైసెన్సులు ఉన్నాయి. నగర పాలక ప్రజారోగ్య విభాగం ప్రతి దుకాణం నుంచి లైసెన్సు, రెన్యువల్ వసూలు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1లోపల పూర్తి చేయాలి. ఏప్రిల్ నెలాఖరుకు చెల్లించని వారు 25 శాతం అపరాధ రుసుముతో కలిపి చెల్లించాలి. మే 1 నాటికి అన్ని దుకాణాల నుంచి పూర్తిస్థాయిలో వసూలు చేయాలని నిబంధనలు ఉన్నాయి. లేదంటే సంబంధిత అధికారి సొంత సొమ్ము జమ చేయాలి. రుసుము చెల్లించిన ప్రతి దుకాణాలోను లైసెన్సు ధృవీకరణ పత్రం ప్రదర్శించాలి. అయితే నగరంలోని పలు కాలనీల్లో పలువురు దుకాణదారులు ట్రేడ్ లైసెన్సు తీసుకోకుండానే వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇలాంటి వారికి నగర పాలక అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
వసూలు చేస్తున్నాం
నగరంలో పెండింగ్ లేకుండా ట్రేడ్ లైసెన్స్ వసూలు చేస్తున్నాం. విద్యుత్ శాఖ అధికారులకు నగరంలో ఎన్ని వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయో తెలపాలని లేఖ రాశాం. అక్కడ నుంచి వచ్చిన వెంటనే వ్యాపారులు ట్రేడ్ లైసెన్సు తీసుకునేలా ప్రోత్సహిస్తాం. పాత బకాయిలు..కొత్తవి కలిపి సుమారు రూ.3 కోట్ల దాకా ఉంది. త్వరలోనే వసూలు చేసేలా చర్యలు తీసుకుంటాం.
- కే.విశ్వేశ్వరరెడ్డి, ఆరోగ్య అధికారి, నగర పాలక సంస్థ