అడుగుపడని ఐకానిక్
ABN , Publish Date - Dec 04 , 2024 | 12:31 AM
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లోని సోమేశ్వరం - సంగమేశ్వరం అనుసంధానంగా కృష్ణా నదిపై ఐకానిక్ సస్పెన్షనబుల్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి సంకల్పించింది.
30 నెలల్లో పనులు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి ఆర్భాట ప్రకటన
ఇప్పటి వరకు పునాదికి నోచుకోని వైనం
ఆత్మకూరు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లోని సోమేశ్వరం - సంగమేశ్వరం అనుసంధానంగా కృష్ణా నదిపై ఐకానిక్ సస్పెన్షనబుల్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి సంకల్పించింది. రెండేళ్ల కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ప్రకటించింది. 30 నెలల్లో నిర్మాణం చేపడతామని కేంద్ర మంత్రి ఆర్భాటంగా ప్రకటించారు. ఇవన్నీ పైపై వ్యవహారాలే. పనుల్లో నికరంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇంతకూ ఈ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? అనే సందేహం ప్రజలకు కలుగుతోంది.
కృష్ణానదిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రయాణ సౌకర్యం లేక స్థానిక ప్రజలు చాలా ఏళ్లుగా ఇబ్బందిపడుతున్నారు. నదికి ఇరువైపుల తెలంగాణలో సోమేశ్వరాలయం, ఆంధ్రాలో సంగమేశ్వరాలయం క్షేత్రాలు ఉన్నాయి. వీటి మధ్య నది మీద వంతెన నిర్మిస్తే ఇరుప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి కూడా జరిగే అవకాశం ఉంది. హైద్రాబాద్ నుంచి తిరుపతి, చెన్నై, నంద్యాల వంటి ప్రాంతాలకు దూరం తగ్గుతుంది. ఇందుకోసం ప్రపంచంలోనే రెండవదిగా, దేశంలోనే తొలి ఐకానిక్ సస్పెన్షనబుల్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి రెండేళ్ల క్రితం రూ.1082.56కోట్ల అంచనాలతో కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తొలివిడతగా రూ.436 కోట్లను జాతీయ రహదారుల, రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ నిధులను మంజూరు చేశారు. 30నెలల్లో ఐకానిక్ వంతెన నిర్మాణం పూర్తి చేపడతామని ప్రకటించారు. కానీ రెండేళ్లు కావస్తున్నా.. ఇంతవరకు ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి ఒక్క అడుగు పడలేదు.
వంతెన ప్రస్థావన ఎప్పుడు వచ్చింది?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణానదికి ఇరువైపుల కర్నూలు - మహబూబ్‌నగర్ జిల్లాల గ్రామాల ప్రజల మధ్య బంధుత్వాలు ఉన్నాయి. కృష్ణానది మీద పడవల్లో రాకపోకలు సాగించేవారు. ఈ క్రమంలోనే పలుమార్లు పడవ ప్రమాదాలు సంభవించాయి. అయితే 2007 జనవరి 18వ తేదిన మహబూబ్‌నగర్ జిల్లా సోమశిల సమీపంలో ఉన్న సింగోటం నరసింహస్వామి జాతరకు నందికొట్కూరు తాలుకాలోని నెహ్రూనగర్ గ్రామం నుంచి సుమారు 63 మంది ప్రయాణికులు నాటు పడవపై కృష్ణానదిపై ఆవలి తీరానికి బయలుదేరారు. పడవలో పరిమితికి మంచి ప్రయాణికుల సంఖ్య ఉండటంతో పడవ కృష్ణా నదిలో మునిగిపోయింది. 63 మంది జలసమాధయ్యారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్రాన్నే కుదిపివేసింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘటనా.. స్థలికి చేరుకుని బాధితులను ఓదార్చారు. పడవ ప్రమాదాలను నియంత్రించడానికి సిద్ధేశ్వరంపై వంతెన నిర్మాణాన్ని చేపడతామని హామీ ఇచ్చారు. ఇందుకోసం 2007-08 వార్షిక బడ్జెట్‌లో రూ.110 కోట్ల నిధులను కూడా విడుదల చేశారు. ఆ తర్వాత వైఎస్‌ఆర్ మృతిచెందడం, ఆపై రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలతో ప్రక్రియ ముందుకు సాగలేదు. ఆ తర్వాత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయంలో 2011-12 బడ్జెట్‌లో రూ.280కోట్లతో మరోసారి సిద్ధ్దేశ్వరం వంతెన నిధుల కేటాయింపు చేసినప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. కాగా తెలంగాణ ప్రభుత్వం 2014 నవంబర్‌లో జీవోనెం.131 కింద సిద్ధేశ్వరం వంతెన నిర్మాణానికి రూ.193కోట్లు కేటాయించినప్పటికీ నిర్మాణ ప్రక్రియ జరగలేదు. ఆ తర్వాత 2020లో కల్వకుర్తి - నంద్యాలను అనుసంధానిస్తూ రూ.800కోట్లతో 167కే జాతీయ రహదారి నిర్మాణం నిర్మించడంతో పాటు అందులో భాగంగానే కృష్ణానదిపె ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం రెండేళ్ల క్రితం రూ.1082.56కోట్ల ప్రతిపాదనలతో ఆమోదం పొందగా 2022 నవంబరు 24వ తేదిన తొలివిడతగా రూ.436కోట్లను మంజూరు చేసినప్పటికీ ఇప్పటివరకు బ్రిడ్జి పనులు మొదలేకాలేదు.
ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణంలో ప్రత్యేకతలు
కృష్ణానదిపై 800మీటర్ల ఐకానిక్ సస్పెన్షనబుల్ కేబుల్ బ్రిడ్జి ప్రపంచంలోనే రెండవదిగా, దేశంలోనే తొలి చారిత్రాత్మకంగా వంతెనగా గుర్తింపు దక్కించుకోనుంది. ఈ వంతెన డబుల్ డెక్కర్‌లో నిర్మించనున్నారు. ఇందులో ఎగువన రోడ్డు నిర్మాణంపై వాహనాలు వెళ్లనున్నాయి. దిగువన గాజు బ్రిడ్జి మీదుగా పాదచారులు కృష్ణానదిని, నల్లమల అటవీ అందాలను వీక్షిస్తూ నడిచేలా ఈ వంతెనను రూపొందిస్తున్నారు. గాజు వంతెనపై అక్కడక్కడా పర్యాటకులు కూచొని విశ్రాంతి తీసుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వ ఆలోచన. అలాగే ఈ వంతెన గోపురం ఆకారంలో పైలాన్ నిర్మాణ రూపంలో ఉంటుంది. దీనికిఅద్భుతమైన లైటింగ్ వ్యవస్థను సమకూర్చనున్నారు.
ఐకానిక్ వంతెన నిర్మాణంతో ఇరు ప్రాంతాల అభివృద్ధి
కృష్ణానదిపై వంతెన నిర్మాణం పూర్తయితే తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు పర్యాటకంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. వంతెన నిర్మాణంతో కొల్లాపురం
నంద్యాల హైవే ఏర్పాటు జరిగితే సీమ జిల్లాల నుంచి హైద్రాబాద్ చేరుకునేందుకు దాదాపు 70కిమీల ప్రయాణ దూరం తగ్గుతోంది. దీంతో ఇంధనం సమకూరి ప్రజలపై ప్రయాణ ఖర్చుల భారం తగ్గనుంది.
కృష్ణానదిపై చేపలవేటకు కోస్తా ప్రాంతానికి చెందిన కాకినాడ, వైజాక్, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి వందల కుటుంబాలు ఇక్కడికి ఏటా వలస వస్తుంటారు. వంతెన నిర్మాణంతో మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు.
వంతెన నిర్మాణంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన సంగమేశ్వరం, కొలనుభారతి, అహోబిలం, మహానందితో పాటు మరికొన్ని క్షేత్రాలు అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్, సింగోటం తదితర క్షేత్రాలు కూడా అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి.
కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజల మధ్య బంధుత్వాలు వున్నాయి. వంతెన నిర్మాణం జరగకపోతే వారు పడవలను ఆశ్రయించి ప్రమాదాలు కొనితెచ్చుకోవాల్సిన పరిస్థితి తప్పదు. వంతెన నిర్మాణం జరిగితే ఇరు ప్రాంతాల వారు మరింత బంధుత్వాన్ని పెంచుకుంటారు.
హైద్రాబాద్ నుంచి నంద్యాలకు తగ్గనున్న 70 కి.మీ. దూరం
ఈ ఐకానిక్ బ్రిడ్జి పూర్తయితే హైద్రాబాద్ నుంచి నంద్యాలకు 70కిమీల ప్రయాణదూరం తగ్గనుంది. ఎన్‌హెచ్-44, ఎన్‌హెచ్-40 జాతీయ రహదా రుల మీద సాగుతున్న ప్రయాణం ఎన్‌హెచ్ 167కే జాతీయ రహదారి మీదుగా హైద్రాబాద్ నుంచి నంద్యాల చేరుకునే వెసులుబాటు కలుగుతుంది. కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు 170కిమీల దూరం వున్న ఎన్‌హెచ్ 167కే రహదారి కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు 79కిమీలు రెండు లైన్లలో, అక్కడి నుంచి సుమారు 90కిమీలు నాలుగులైన్లలో నిర్మించాలని నిర్ణయించారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను అప్పట్లో తెలంగాణ జాతీయ రహదారుల శాఖకు అప్పగించారు.
2028 కృష్ణా పుష్కరాల్లోగా పూర్తి కావాలని ఆశిస్తున్నా
2028లో జరిగే కృష్ణా పుష్కరాల సమయానికి కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణం పూర్తి కావాలని ఆశిస్తున్నా. ఇదే జరిగితే సంగమేశ్వర క్షేత్రం ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందనుంది.
-తెలకపల్లి రఘురామశర్మ, పురోహితుడు, సంగమేశ్వర క్షేత్రం
వంతెన నిర్మాణంతో ఉపాధి అవకాశాలు
కృష్ణానదిపై వంతెన నిర్మాణం జరిగితే ఇరు ప్రాంతాల్లో వాణిజ్యపరంగా, పారిశ్రామికంగా అభివృద్ధి జరిగి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. పుట్టి ప్రమాదాలు నివారించవచ్చు. కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన వంతెన నిర్మాణంతో పాటు జాతీయ రహదారిని నిర్మించాలి.
- సుధాకర్, జానాల గూడెం, కొత్తపల్లి మండలం