Share News

నిరుపయోగంగా చేప పిల్లల తొట్లు

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:35 AM

నగరంలోని బంగారుపేటలో చేప పిల్లల పెంపకం కోసం ఏర్పాటు చేసిన తొట్లు నిరుపయోగంగా మారాయి.

నిరుపయోగంగా చేప పిల్లల తొట్లు
పాచి పట్టి నిరుపయోగంగా ఉన్న చేపల తొట్లు

కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): నగరంలోని బంగారుపేటలో చేప పిల్లల పెంపకం కోసం ఏర్పాటు చేసిన తొట్లు నిరుపయోగంగా మారాయి. దాదాపు 30 తొట్లను రూ.లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేశారు. ఈ తొట్లలో గతంలో రెండు లక్షల చేప పిల్లలను పెంచి వాటిని శ్రీశైలం, అవుకు, గోరుకల్లు, అలగనూరు రిజర్వాయర్లతోపాటు గాజులదిన్నె, సుంకేసుల, వెలుగోడు, సిద్దాపురం, ప్రధాన కాలువలైన హంద్రీనీవా, కేసీ కెనాల్‌, ఎల్లెల్సీ కాలువల్లో విడిచిపెట్టేవారు. నీటిని ఆధారంగా చేసుకుని ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 50 వేల మత్స్యకారుల కుటుంబాలు చేపల వేటను కొనసాగించి జీవనోపాది పొందుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం చేప పిల్లల పెంపకం తొట్లను మరమ్మతులు చేయించడంలో పూర్తిగా నిర్లక్ష్యం చూపింది. దీంతో దాదాపు 15 తొట్లలో డ్రైనేజీ నీరు చేరి పాచి పట్టి చేప పిల్లల పెంపకానికి అనువుగా లేకపోయింది. వీటిని మరమ్మతులు చేయాలని మత్స్యశాఖ అధికారులు విజ్ఞప్తి చేసినా చిల్లిగవ్వ విడుదల చేయలేదు. ప్రస్తుతం ఈ తొట్లలో చేప పిల్లల పెంపకం జరగకపోవడంతోపాటు పరిసర కాలనీల ప్రజలు ఈ తొట్లలో తమ పిల్లలు ఎక్కడ ముంపునకు గురవుతారోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం శిథిలావస్థకు చేరిన చేప పిల్లల పెంపకం తొట్లను మరమ్మతులు చేస్తే వేల మంది మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి దొరుకుతుంది.

తొట్లకు మరమ్మతులు చేయించాలి

తొట్లకు మరమ్మతులు చేయించాలి. ఒకప్పుడు కర్నూలు నుంచి చేప పిల్లలను రాయలసీమలోని అన్ని జిల్లాలకు సరఫరా చేసేవారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కనీసం కర్నూలు జిల్లాలోని జలాశయాలకు కూడా ఇవ్వలేకపోవడం దురదృష్టకం. చేప పిల్లల పెంపకం తగ్గిపోవడం వల్ల కర్నూలు జిల్లాలోని వేలాది మంది మత్స్యకార్మికులు జీవనోపాధి కోల్పోయారు. ప్రభుత్వం నిధులను విడుదల చేస్తే తొట్లకు మరమ్మతుల చేయాలి.

-నవీన కుమార్‌, జిల్లా మత్స్య సహకార యూనియన జిల్లా అధ్యక్షుడు

Updated Date - Oct 23 , 2024 | 12:35 AM