Share News

వేదవతి, గుండ్రేవుల పూర్తి చేస్తాం

ABN , Publish Date - Nov 14 , 2024 | 11:57 PM

వేదవతి, గుండ్రేవుల పూర్తి చేస్తాం

వేదవతి, గుండ్రేవుల పూర్తి చేస్తాం
నిమ్మల రామానాయుడు

కరువు, వలసల నివారణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

శాసన మండలిలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు

కర్నూలు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో వేదవతి ప్రాజెక్టు, గుండ్రేవుల జలాశయం నిర్మాణాలు పూర్తి చేస్తామని, పశ్చిమ ప్రాంతంలో కరువు, వలసల నివారణకు టీడీపీ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం శాసన మండలిలో వివరించారు. జిల్లా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ.. 2019 జనవరిలో గత టీడీపీ ప్రభుత్వం వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1,942 కోట్లు నిధులు మంజూరు చేసిందని, పాలనాపరమరమై అనుమతులు, టెండర్లు కూడా పూర్తి చేసి పనులు చేపట్టామని వివరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019-24లో బడ్జెట్‌కు పాలనపరమైన అనుమతులు ఉన్నా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. 4,819 ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉంటే కేవలం 9 ఎకరాలే సేకరించారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్ట్‌ ఏజెన్సీ మేఘా కంపెనీ పనులు ఆపేసిందని తెలిపారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టిందని, భూ సేకరణకు రూ.384 కోట్లు, సివిల్‌ వర్క్స్‌, పైపులైన్లు, జలాశయాలు, గ్రావిట్‌ కెనాల్‌, పంప్‌హౌస్‌ నిర్మాణాలకు రూ.1,452 కోట్లు అవసరమని గుర్తించామని చెప్పారు. సుంకేసుల బ్యారేజీ ఎగువన తుంగభద్ర నదిపై 20 టీఎంసీల సామర్థ్యంలో గుండ్రేవుల జలాశయం నిర్మాణం కోసం 2019 ఫిబ్రవరిలో నాటి టీడీపీ ప్రభుత్వం రూ.2,890 కోట్లు కేటాయించి, డీపీఆర్‌ తయారు చేసిందన్నారు. ఈ జలాశయం నిర్మాణం చేయాలంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి 23 వేల ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉందన్నారు. అంతర్‌ రాష్ట్ర ప్రాజెక్టు కావడంతో ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్‌) తలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పంపామన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 11:57 PM