సంక్షేమం సిగ్గుపడాల్సిందే
ABN , Publish Date - Dec 04 , 2024 | 12:29 AM
జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు దుర్భరంగా తయారయ్యాయి. కనీస వసతులు లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
నిర్లక్ష్యానికి నిదర్శనం
సమస్యల వలయంలో హాస్టళ్లు
కర్నూలు ఎడ్యుకేషన్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు దుర్భరంగా తయారయ్యాయి. కనీస వసతులు లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సంక్షేమం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ హాస్టళ్లు ఉదాహరణగా మారాయి. నాసిరకం దుప్పట్లు ఇవ్వడంతో అవి చలి నుంచి విద్యార్థులను కాపాడటం లేదు. కిటికీలకు తలుపులు లేవు. స్నానపు గదులు, మరుగుదొడ్ల కొరత వేధిస్తోంది. దీంతో బహిరంగ స్నానాలు చేయాల్సి వస్తున్నది. చాలా హాస్టల్స్‌కు ప్రహరీలు లేవు. విషపురుగులు, పాములు సంచరిస్తున్నాయి. ఆంధ్రజ్యోతి క్షేత్ర పరిశీలనలో హాస్టళ్ల దుస్థితి వెలుగులోకి వచ్చింది.
కర్నూలు అర్బన్‌లోని పెద్దపాడు గ్రామంలోని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బీసీ బాలుర హాస్టల్ అధ్వాన స్థితిలో ఉంది. ఈ హాస్టల్‌లో 240 మంది నుంచి విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం పక్కనే ఉన్న ఈ వసతి గృహం భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఇందులో ఆరు గదులు ఉండగా.. ఒకటి పూర్తిగా నిరుపయోగంగా మారడంతో దాన్ని మూసేశారు. ఈ భవనానికి ఆనుకుని షెడ్డును ఏర్పాటు చేశారు. స్నానపు గదులు, మరుగుదొడ్లు పాడైపోయాయి. దీంతో ఆరుబయటనే స్నానాలు చేస్తున్నారు. అలాగే బహిర్భూమికి ఆరుబయటకే వెళ్తున్నారు. చలి కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా నాసిరకం దుప్పట్లు సరఫరా చేశారు. అవి చలిని ఆపలేకపోతున్నాయి. ఆంధ్రజ్యోతి సోమవారం రాత్రి 10 గంటల సమయంలో విజిట్ చేయగా హాస్టల్లోని విద్యార్థి మలమూత్ర విసర్జనకు బయటకు వెళ్తుండగా.. పాము కంట పడటంతో భయంతో కేకలు వేస్తూ లోపలికి వచ్చాడు. దీంతో విద్యార్థులు వేటాడి ఆ పామును చంపేశారు. ఆ తర్వాత చీకటిలోనే కట్టెపుల్లలను వెతికి చితి రాజేసి చనిపోయిన పామును మంటల్లో కాల్చేశారు. ఇట్లా తమ హాస్టల్ పరిసరాల్లో పాములు, కుక్కలు, పందులు తిరుగుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. హాస్టల్ బోరు బావితో ఉప్పు నీరు రావడంతో విద్యార్థులు మంచినీరు బైటికి వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఈ హాస్టల్ భవనానికి ప్రహరి లేదు. వర్షం నీరు చేరి బురదమయంగా మారుతుందని, ముఖ్యంగా చలికి ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వివరించారు. అయితే స్నానాలు, మరుగుదొడ్ల సులభ్ కాంప్లెక్స్ పనులు పూర్తయినప్పటికీ ఇంకా ప్రారంభించలేదు.
అద్దె భవనంలో ఆలూరు బీసీ బాలుర హాస్టల్
ఆలూరు: ఆలూరు బీసీ బాలుర హాస్టల్ అద్దె భవనంలో కొనసాగుతున్నది. ఇందులో 150 విద్యార్థులు ఉండగా సోమవారం రాత్రి 120 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇంత మంది విద్యార్థులకు 3 మరుగు దొడ్లు మాత్రమే ఉన్నాయి. దీంతో బహిర్భూమికి బయటకు వెళ్తున్నారు. 10 మాత్రమే స్నానం గదులు ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆంధ్రజ్యోతి విజిట్‌లో విద్యార్థులు తెలిపారు.
తాగునీరు లేని వసతి గృహాలు
ఆస్పరి : ఆస్పరిలో ఎస్సీ వసతి గృహం, చిన్న హోత్తూరులో బీసీ వసతి గృహం ఉన్నాయి. ఆస్పరి వసతి గృహంలో విద్యార్ధులు 36 మంది, చిన్న హోత్తూరు వసతి గృహంలో 183 మంది విద్యార్థులు ఉన్నారు. వీటిలో తాగునీటి సౌకర్యం లేదు. ఆస్పరి వసతి గృహంలో ఉన్న తాగునీటి సింటెక్స్ ట్యాంకులు పగిలిపోవడంతో నీరు వృఽథాగా మారి అక్కడే నిల్వ ఉండడంతో దోమలు, ఈగలు వ్యాప్తి చెంది విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ప్రభుత్వం విద్యార్ధులకు ఒకే బెడ్ షీట్ పంపిణీ చేసింది. చలి తీవ్రంగా ఉండడంతో విద్యార్థులు రాత్రిళ్లు వణుకుతూ పడుకుంటున్నారు. పైగా వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు.
ఇండ్ల నుంచి దుప్పట్లు
ఆదోని: అధికారులు ఇచ్చిన నాసిరకం దుప్పట్లను విద్యార్థులు ట్రంక్ పెట్టెలో ఉంచేసి, ఇంటి నుంచి తెచ్చుకున్న మందపాటి ఉలన్ దుప్పట్లను కప్పుకొని రాత్రిపూట నిద్రపోతున్నారు. ఆదోని పట్టణంలోని ఎస్సీ బాలుర నెంబర్-1 హాస్టల్లో 100మంది విద్యార్థులుండగా మంగళవారం 75మంది మాత్రమే హాజరు కాగా, 25మంది విద్యార్థులు గ్రామాల్లో గౌరమ్మ పండుగ ఉందని వెళ్ళి తిరిగి రాలేదు. గత నెల విద్యార్థులకు నాసిరకం దుప్పట్లు ఇచ్చారు. అవి చలికి రక్షణ ఇవ్వలేవని వాటిని పెట్టెల్లో పడేసి ఇండ్ల నుంచి ఉలన్ దుప్పట్లు తెచ్చుకున్నారు. మండగిరి ఏరియాలో ఉన్న బీసీ బాలుర వసతి గృహంలో 215మంది విద్యార్థులకు గాను 175 మంది ఉన్నారు. హాస్టల్ భవనం పెచ్చులూడిపోవడంతో ఇటీవల బీసీ సంక్షేమ శాఖ రూ.13 లక్షలు మరమ్మతు కోసం నిధులు మంజూరు చేసింది. ఓ కాంట్రాక్టర్ రెండు నెలలుగా పనులు చేస్తున్నారు. పైకప్పు పెచ్చులూడిన చోట సిమెం టు పూత పూసి వదిలేశారు. ప్యాన్‌లు ఏర్పాటు చేయలేదు. కిటికీలకు మెష్ లేక దోమలతో విద్యార్థులు అవస్థ పడుతున్నారు.
ఇంటి దుప్పట్లే గతి
పెద్దకడుబూరు: పెద్దకడబూరులోని బీసీ హాస్టల్‌లో ఏడు రూమ్‌లు ఉన్నాయి. వీటిలో రెండు శిథిలమైపోవడంతో మూసివేశారు. సోమవారం ఆంధ్రజ్యోతి విజిట్ చేయగా 60 మంది విద్యార్ధులు ఉన్నారు. విద్యార్ధులకు ఇచ్చిన దుప్పట్లు నాసిరకంగా ఉండటంతో అవి చలి నుంచి కాపాడటం లేదు. దీంతో ఇంటి నుంచి దుప్పట్లు తెచ్చుకొని కాలం వెళ్లబుచ్చుతున్నారు. బాత్‌రూమ్‌ల్లోంచి నీరు బయటకు పోకపోవటంతో ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు. విద్యార్థులకు వేడి నీళ్లు ఇవ్వటం లేదు. ఆదోని కాలేజీ హాస్టల్ వార్డెన్ హనిమిరెడ్డి పెద్దకడబూరు హాస్ట్టల్‌కు ఇన్‌చార్జిగా నియమించడంతో ఆయన స్థానికంగా ఉండటం లేదు.
వాచ్‌మెన్, వార్డెన్లు లేరు
కోసిగి: కోసిగిలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌కు ఆంధ్రజ్యోతి విజిట్‌లో భాగంగా సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో వెళ్లితే.. అప్పటికీ హాస్టల్ ప్రధాన గేటు తెరిచి ఉంది. నైట్‌వాచ్‌మెన్ మెడికల్ లీవ్‌లో ఉన్నాడు. వార్డెన్ అందుబాటులో లేడు. హాస్టల్‌లో ఓ బైటి వ్యక్తి కూడా నిద్రపోతున్నాడు. కొందరు విద్యార్థులకు దుప్పట్లు లేక చలికి వణుకుతున్నారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌లో 5 నుంచి 10వ తరగతి వరకు 400 మందికిగాను 210 మంది ఉంటున్నారు. సోమవారం 80 మంది విద్యార్థులు ఉన్నారు. వార్డెన్‌కు ఫోన్ చేయగా.. తాను ఆదోనిలో ఉన్నట్లు తెలిపారు. హాస్టల్‌కు కిటికీలు లేకపోవడంతో చల్లటి ఈదురుగాలులకు విద్యార్థులు చలికి వణుకిపోతున్నారు.
అరకొర వసతులే
పత్తికొండ: పట్టణంలోని ఎస్సీ-2 బాలుర హాస్టల్‌ను మంగళవారం రాత్రి ఆంధ్రజ్యోతి విజిట్ చేసింది. ఈ హాస్టల్‌లో విద్యార్థులు 90 ఉండాలి. కానీ విజిట్ సమయంలో 80 మంది ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన బెడ్‌షీట్లు వార్డెన్ అందించారని విద్యార్థులు తెలిపారు. అయితే బెడ్‌షీట్లు నాసిగా ఉన్నాయని, చలికి తట్టుకోవడం కష్టంగా ఉందని విద్యార్థులు అన్నారు.
అన్నీ అసౌకర్యాలే..
ఎమ్మిగనూరు: పట్టణంలోని ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులు తీవ్రమవుతున్న చలిలో అసౌకర్యాలతో రాత్రిళ్లు నిద్రపోతున్నారు. అద్దె భవనాల్లో హాస్టళ్లు నడుస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీసీ సంక్షేమ వసతిగృహాం పట్టణంలోని గుడికల్ రోడ్డులోని ఓ ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్నారు. 190మంది విద్యార్థులు ఇందులో ఉంటున్నారు. సోమవారం రాత్రి ఆంధ్రజ్యోతి పరిశీలనకు వెళ్లినప్పుడు 170 మంది విద్యార్థులు హాస్టల్‌లో ఉన్నారు. వీరికి దుప్పట్లు ఇచ్చారే తప్ప కింద పరుచుకొనేందుకు అవసరమైన జంఖానాలు ఇవ్వలేదు. వాటిని విద్యార్థులు ఇండ్ల నుంచి తెచ్చుకున్నారు. ఒక్కో గదిలో దాదాపు 15మంది విద్యార్థులు పడుకుంటున్నారు. ఓ గది ఐరన్ గ్రిల్‌కు తలుపులు లేవు. దీంతో విద్యార్థులు చలికి ఒణికిపోతున్నారు. దీనికితోడు గదులు సరిగాలేవు. బాత్‌రూంలకు తలుపులు లేవు. వాటి ముందుభాగంలో మురుగునీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది.