Share News

అప్పుడు తప్పు.. ఇప్పుడు ఒప్పా..?

ABN , Publish Date - Dec 21 , 2024 | 12:05 AM

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూటమి నాయకులు తెగ విమర్శలు చేశారు. కన్సిడరేషన్‌ పన్నుతో నాపరాయి పరిశ్రమ మూతబడేలా చేస్తోందని మండిపడ్డారు.

అప్పుడు తప్పు.. ఇప్పుడు ఒప్పా..?
బందర్లపల్లె చెక్‌పోస్టు వద్ద లోడ్‌ వాహనాలతో రోడ్డు దిగ్బంధనం చేసిన నాపరాయి పరిశ్రమ యజమానులు

‘కూటమి’పై నాపరాయి పరిశ్రమల యజమానుల అసంతృప్తి

గత ప్రభుత్వ విధానాన్నే అమలు చేస్తోందని ఆగ్రహం

కన్సిడరేషన్‌ పన్ను చెల్లించాలనడంపై సర్వత్రా ఆందోళన

ఉపాధి లేక రోడ్డున పడుతున్న కార్మికులు

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూటమి నాయకులు తెగ విమర్శలు చేశారు. కన్సిడరేషన్‌ పన్నుతో నాపరాయి పరిశ్రమ మూతబడేలా చేస్తోందని మండిపడ్డారు. పరిశ్రమ వర్గాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత రావడంతో గత ప్రభుత్వం పన్ను వసూలు వసూలు చేయడం ఆపేసింది. అయితే అప్పట్లో వైసీపీ తీరు సరైంది కాదని చెప్పుకొచ్చిన టీడీపీ నేతలు అధికారంలోకి రాగానే అదే విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో పరిశ్రమ యజమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వం చేసింది తప్పయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఒప్పా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నాపరాయి పరిశ్రమలు నడవలేని పరిస్థితికి వచ్చాయి. ఉపాధి లేక వందలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఇప్పటికైనా కన్సిడరేషన్‌ పన్ను చెల్లింపులను ఆపాలన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది.

నంద్యాల, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు జిల్లాలో నాపరాయి పరిశ్రమ ఓ వెలుగు వెలిగింది. ముఖ్యంగా బనగానపల్లె నియోజకవర్గంతో పాటు, బేతంచర్ల వంటి ప్రాంతాల్లో ఈ పరిశ్రమలు ఎక్కువగా ఉండేవి. దీనిపైన వందలాది మంది జీవనోపాధి పొందేవారు. వైసీపీ వచ్చాక ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. లేనిపోని నిబంధనలు పెట్టడంతో పాటు, ఇష్టారీతిన పన్నులు వేయడంతో నాపరాయి పరిశ్రమ పూర్తిగా దెబ్బతింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత తమ బతుకులు మారతాయని ఆశించిన పరిశ్రమ యజమానులకు అవే తిప్పలు తప్పడం లేదు. అప్పట్లో తీసుకువచ్చిన జీవోలను ఇప్పుడు అమలు చేసి నాపరాయి పరిశ్రమ లేకుండా చేసేందుకు పూనుకుందనన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పునరాలోచించి కన్సిడరేషన్‌ ఫీజు తొలగించటమే కాకుండా గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలు, విధానాలను మార్చి పరిశ్రమను ఆదుకోవాలని పరిశ్రమ యజమానులు కోరుతున్నారు.

ఏమిటీ కన్సిడరేషన్‌ ఫీజు..?

కొవిడ్‌ తర్వాత అన్ని రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ప్రభుత్వ ఖజానాకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కొవిడ్‌ వల్ల నష్టపోయిన పరిశ్రమలను తిరిగి గాడిలో పెట్టేందుకు, కార్మికులకు ఉపాధి కల్పించడానికి, చిన్న తరహా పరిశ్రమల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం వద్ద సరైన నిధులు లేకపోయాయి. ఇందుకోసం మైనింగ్‌ పరిశ్రమల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు అప్పటి వైసీపీ ప్రభుత్వం పూనుకుంది. దీనికి కన్సిడరేషన్‌ ఫీజు అని పేరు పెట్టింది. ఆయా మైనింగ్‌ పరిశ్రమల నుంచి వసూలు చేస్తున్న సీనరేజి పన్ను, డీఎంఎఫ్‌ (డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌), మెరిట్‌ ఫీజుతోపాటు అదనంగా ఈ కన్సిడరేషన్‌ ఫీజు కట్టాలని ఆదేశిస్తూ 2021 జూన్‌లో జీఓఎంఎస్‌ నంబరు 42 విడుదల చేసింది. దీని ప్రకారం ఇసుకు, సిలికా వంటి వాటికి సీనరేజ్‌ పన్ను మొత్తానికి వంద శాతం అదనంగా కన్సిడరేషన్‌ ఫీజు వసూలు చేసింది. గ్రానైట్‌ ధర ఎక్కువ కావటంతో కన్సిడరేషన్‌ పన్ను వంద శాతం వసూలు చేస్తే ఆ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడుతుందని భావించి, కన్సిడరేషన్‌ పన్నును 50 శాతానికి కుదించింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా భారీ ఖనిజాలకు సంబంధించిన పరిశ్రమలకు వర్తింపజేసే నిబంధనలనే నాపరాయి పరిశ్రమకు వర్తింపజేసింది. అంతంతమాత్రం ఆదాయం ఉండే నాపరాయి పరిశ్రమ యజమానులు కూడా వంద శాతం కన్సిడరేషన్‌ ఫీజు కట్టే పరిస్థితి ఏర్పడింది.

గతం వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కన్సిడరేషన్‌ పన్నుపై నాపరాయి పరిశ్రమ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఈ పన్నును అప్పట్లో వసూలు చేయలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అప్పటి నుంచి ఉన్న బకాయి కన్సిడరేషన్‌ పన్ను వసూలుకు సిద్ధమైంది. అంటే ఈ లెక్కన వైసీపీ నిబంధనలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నట్లే లెక్క. మరి అప్పట్లో వైసీపీ విధానాలు సరైనవి కావని చెప్పుకొచ్చిన టీడీపీ నేతలు, అధికారంలోకి రాగానే ఎలా అమలు చేస్తున్నారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం చేసింది తప్పయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్నది కూడా తప్పు కాదా అన్న వాదన వినిపిస్తోంది. ఈ విమర్శలు ఏమీ పట్టించుకోని కూటమి ప్రభుత్వం కన్సిడరేషన్‌ పన్నును నాపరాయి పరిశ్రమపై బలంగా రుద్దుతోంది. రెండు మూడు రోజుల క్రితం నుంచి నాపరాయిని రవాణా చేసేందుకు సంబంధిత యజమానులు ఆన్‌లైన్‌లో అనుమతుల కోసం దరఖాస్తు చేస్తుండగా వారికి కన్సిడరేషన్‌ పన్ను అంటూ లక్షల రూపాయిల బకాయిలను చూపుతోంది.

మూతబడుతున్న నాపరాయి పరిశ్రమ..

ఒకప్పుడు ఇల్లు కట్టుకునే ప్రతివారు నాపరాయిని వాడేవారు. ప్రస్తుతం అంతా గ్రానైట్‌, టైల్స్‌ వైపు చూస్తున్నారు. దీంతో జిల్లాలోని నాపరాయి పరిశ్రమ పూర్తిగా దెబ్బతింటోంది. నాపరాయి పరిశ్రమలను ఆదుకుని, దీనిపైన ఆధారపడిన వారికి మేలు చేకూర్చేలా నిబంధనలు సడలించాల్సిన గత ప్రభుత్వం మరిన్ని కఠిన నిబంధనలను తీసుకువచ్చింది. ఖనిజాల్లో మేజర్‌, మైనర్‌ అంటూ విభాగాలు ఉంటాయి. మేజర్‌ ఖనిజ పరిశ్రమలు పెట్టాల్సిన నిబంధనలను నాపరాయి పరిశ్రమకు వర్తింపజేసింది. దీంతో ఈ పరిశ్రమ మరింత ఇబ్బందుల్లో పడింది. పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేని నాపరాయి పరిశ్రమకు కూడా నిబంధన విధించింది. లైసెన్సు ఫీజును భారీగా పెంచేసింది. కొత్తగా లైసెన్సు తీసుకోవడానికి అయ్యే ఖర్చు కంటే రెన్యువల్‌ చేసే వారి నుంచి మరింత ఎక్కువ ఫీజు వసూలు చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న నాపరాయి పరిశ్రమలు నడవలేని పరిస్థితికి వచ్చాయి. ఏ స్థాయిలో అంటే జిల్లా వ్యాప్తంగా నాపరాయి పరిశ్రమలు 200 కాస్త, 40కి పడిపోయాయి. మిగతావన్నీ కఠిన నిబంధనల వలలో చిక్కుకుని రెన్యువల్‌ అవలేదు.

ఆదుకోని కూటమి ప్రభుత్వం..

వైసీపీ ప్రభుత్వ తీరుతో ఎక్కువ సంఖ్యలో నాపరాయి పరిశ్రమలు మూతపడటంతో దీనిపైన ఆధారపడిన వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. వీరిని ఆదుకుంటామని, 2014-2019 వరకు ఏ నిబంధనలు ఉన్నాయో వాటినే అమలు చేస్తామని చెప్పి ఓట్లు దండుకున్న టీడీపీ నాయకులు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం వారి గురించి పట్టించుకున్నది లేదు. పైగా 2019-2024 వరకు వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే అనుసరిస్తోంది. పైగా కన్సిడరేషన్‌ పన్నును తీసేస్తుందా అంటే వచ్చే నెల 10 వరకు పెండింగ్‌ బకాయిలు చెల్లించే వెసులుబాటు కల్పిస్తామని, కానీ తర్వాతైనా బకాయిలు చెల్లించాల్సిందేనని జిల్లా మైనింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు పెండింగ్‌ బకాయిలు కట్టినట్లు రశీదు ఉంటేనే రవాణాకు అనుమతిస్తామని చెక్‌పోస్టు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవటంపైన, ప్రభుత్వ శాఖల ద్వంద్వ వైఖరిపైన విసిగెత్తిపోయిన నాపరాయి పరిశ్రమ యజమానులు కడుపు మండి ధర్నాలకు దిగుతున్నారు. రెండ్రోజుల కింద నంద్యాల, అనంతపురం చెక్‌పోస్టు వద్ద వందలాది నాపరాయి లోడు వాహనాలను అడ్డుగా పెట్టి రోడ్దు దిగ్బంధనం చేయగా గురువారం బేతంచర్లలో రోడ్డుపైన ధర్నా చేశారు. ఏ ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించదని, ఇలా రూ.లక్షల్లో పన్నులు వసూలు చేస్తే ఉన్న కొద్ది రోజుల్లో నాపరాయి పరిశ్రమలు మూతపడటం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ప్రభుత్వానికి పడిపోయిన ఆదాయం

జిల్లాలోని నాపరాయి పరిశ్రమల నుంచి ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో రూ.12 కోట్లు, డీఎంఎఫ్‌ రూపంలో మరో రూ.1.20 కోట్లు, మెరిట్‌ రూపంలో మరో రూ.20 లక్షలు, ఇతర పన్నుల రూపంలో సంవత్సరాదాయం దాదాపు రూ.14 కోట్లు వచ్చేది. కానీ వైసీపీ విధానాల వల్ల ఈ ఆదాయం రూ.3 కోట్లకు పడిపోయింది. ఈ లెక్కన గత జగన్‌ ప్రభుత్వం జిల్లాలోని నాపరాయి పరిశ్రమను ఏ విధంగా నాశనం చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ‘సంపద సృష్టిస్తాం.. అందరికీ పంచుతాం’ అంటూ వచ్చిన కూటమి ప్రభుత్వం ఖజానాకు నష్టం చేకూర్చే విధానాలను పట్టుకుని ఎందుకు వేలాడుతోందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా మంత్రులు, కూటమి నాయకులు సీఎం చంద్రబాబు నాయుడికి వివరించి కన్సిడరేషన్‌ ఫీజు వసూలును నిలిపేయాలని పరిశ్రమ యజమానులు కోరుతున్నారు.

త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం

నాపరాయి పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి సీఎం చంద్రబాబునాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముకేశ్‌ కుమార్‌ మీనా దృష్టికి తీసుకెళ్లాను. గతంలో నాపరాయి పరిశ్రమకు ఇచ్చిన హామీలను కూడా వారికి గుర్తు చేశాను. దీనిపైన వచ్చే నెల మొదటి వారంలో గనుల శాఖ మంత్రి, ముఖ్య అధికారులతో చర్చలు జరిపి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సాధ్యమైనంత త్వరలో సమస్యను పరిష్కరించి నాపరాయి పరిశ్రమను ఆదుకుంటాం.

- బీసీ జనార్దన్‌ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి

నాపరాయి పరిశ్రమ యజమానుల కష్టాలపై ప్రభుత్వానికి నివేదిక పంపాం

నాపరాయి కన్సిడరేషన్‌ ఫీజుపై నాపరాయి గనుల యజమానుల నిరసన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపాం. నాలుగు రోజుల నుంచి కొలిమిగుండ్ల మండలం బందార్లపల్లె చెక్‌పోస్టు వద్ద వాహనాలను నిలిపి ధర్నా చేసిన విషయంపై ప్రభుత్వానికి నివేదించాం. మైనింగ్‌ యజమానులకు ఆన్‌లైన్‌లో రూ.లక్షల్లో కన్సిడరేషన్‌ ఫీజు చూపుతోంది. ఈ విషయాన్ని రోడ్లు భవనాల శాఖామంత్రి దృష్టికి తీసుకు వెళ్లాం. రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి ఒక నిర్ణయం వెలువడనుంది.

-రాజగోపాల్‌, మైనింగ్‌ ఏడీ

Updated Date - Dec 21 , 2024 | 12:05 AM