Share News

నత్తకు నడక నేర్పేలా..!

ABN , Publish Date - Oct 06 , 2024 | 11:52 PM

ములకలచెరువు మండలం పెద్దపాళ్యం వద్ద ఉన్న రైల్వేగేటు వల్ల వాహనదారులు ఇబ్బందులు పడేవారు.

నత్తకు నడక నేర్పేలా..!
పెద్దపాళ్యం రైల్వేగేటుపై నిర్మించిన ఫ్లైఓవర్‌ బ్రిడ్జి

పెద్దపాళ్యం ఫ్లైఓవర్‌ నిర్మాణం పనుల్లో

తీవ్ర జాప్యం

పనులు ప్రారంభించి ఐదేళ్లు పూర్తి..

ఇంకా అసంపూర్తిగానే..

రెండేళ్లుగా ఆగిన చివరి దశ పనులు

ఏడాది క్రితం తిరిగి ప్రారంభం

ములకలచెరువు, అక్టోబరు 6: ములకలచెరువు మండలం పెద్దపాళ్యం వద్ద ఉన్న రైల్వేగేటు వల్ల వాహనదారులు ఇబ్బందులు పడేవారు. దేశంలోనే అతి పొడవైన ఎనహెచ-42 జాతీయ రహదారి కావడంతో ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు సాగించే సమయంలో తరచూ రైల్వే గేటు పడుతుండడంతో వాహనాలు బారులు తీరి నిలిచిపోతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోతుండడంతో తరచూ ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగేవి. జాతీయ రహదారిలో వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని సమయం ఆదా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పెద్దపాళ్యం రైల్వేగేటుపై ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.49 కోట్లు మంజూరు చేసింది. 2019 సెప్టెంబరు నెలలో పనులు ప్రారంభించారు. ఏడాదిన్నర పాటు పనులు జరిగాయి. బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి దశకు చేరాయి. ఇరువైపులా రోడ్ల నిర్మాణం కూడా పూర్తి చేశారు. అయితే రైల్వేగేటుపై వెళ్తున్న బ్రిడ్జిపై కొంత భాగం పనులు నిలిచిపోయాయి. ఇక్కడ దిమ్మెలు ఏర్పాటు చేసి కొంతమేర పనులు పూర్తి చేస్తే ముగుస్తాయి. ఈ పనులు చేపట్టకుండా రెండేళ్ల పాటు నిలిపేశారు. దీంతో బ్రిడ్జి నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. బ్రిడ్జి ఎత్తు తక్కువగా ఉండడంతో పనులు నిలిచిపోయిన చోట దిమ్మెలు ఏర్పాటు చేస్తే రైల్వే కరెంటు లైనుకు తగులుతాయని, దీని కారణంగా పనులు నిలిచిపోయాయని ఈ ప్రాంతంలో ప్రచారం జోరుగా జరుగుతోంది. అలాంటిది ఏమీ లేదని రైల్వే అనుమతుల కోసం జాప్యం జరుగుతోందని ఎనహెచ అధికారులు సమాధానం చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో 2023 సెప్టెంబరు నెలలో తిరిగి పనులు ప్రారంభించారు. ఈ పనులు నత్తకు నడక నేర్పేలా జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ పనులు పూర్తయ్యేందుకు ఇంకా ఎనిమిది నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఈ మార్గంలో తరచూ రాకపోకలు సాగించే వాహనదారులు బ్రిడ్జి పనులు ఎప్పటికి పూర్తవుతాయోనని చర్చించుకుంటున్నారు. కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వమైనా చొరవ తీసుకుని పనులు పూర్తి చేసేందుకు సంబంధిత ఉన్నతాధికారులకు గడువు విధిస్తే పూర్తయ్యే అవకాశం ఉందని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

మందుబాబులకు అడ్డాగా ఫ్లైఓవర్‌

బ్రిడ్జి నిర్మాణ సమయంలో ఇరువైపులా వేసిన రోడ్డు మందుబాబులకు అడ్డాగా మారింది. రాత్రయితే కొత్త ఫ్లైఓవర్‌పై మందుబాబులతో సందడిగా మారుతోంది. బ్రిడ్జి పనులు అసంతృప్తిగా ఉండడంతో వాహనాల రాకపోకలు సాగడం లేదు. దీంతో ఈ రోడ్డు మందుబాబులకు అనువుగా మారింది. మందుతాగి బాటిళ్లు పగులగొట్టి వెళుతున్నారు. దీంతో రోడ్డుపై గాజుపెంకులు భారీగా కన్పిస్తున్నాయి.

Updated Date - Oct 06 , 2024 | 11:52 PM