ఫైళ్ల దహనం కేసు సీఐడీకి!
ABN , Publish Date - Jul 26 , 2024 | 03:59 AM
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయ ఫైళ్ల కాల్చివేత కేసు విచారణ సీఐడీ చేతుల్లోకి వెళ్తోంది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగానే సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ బుధవారం రాత్రి నుంచి మదనపల్లెలోనే మకాం వేశారు. సీఐడీ ఆధ్వర్యంలో 60 మంది
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం!
మదనపల్లెలోనే చీఫ్ అయ్యన్నార్ మకాం
60 మందితో ఆరు బృందాల దర్యాప్తు?
ఒక్కో జట్టుకు ఒక్కో డీఎస్పీ సారథ్యం
పెద్దిరెడ్డి బినామీ మాధవరెడ్డి కోసం వేట
మంటలకు ముందే ఫైళ్లు దాటించేసిన
మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు
2,400 ఫైళ్లు బుగ్గి అయినట్లు గుర్తింపు!
రాయచోటి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయ ఫైళ్ల కాల్చివేత కేసు విచారణ సీఐడీ చేతుల్లోకి వెళ్తోంది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగానే సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ బుధవారం రాత్రి నుంచి మదనపల్లెలోనే మకాం వేశారు. సీఐడీ ఆధ్వర్యంలో 60 మంది సభ్యులతో ఆరు బృందాలు ఈ కేసు దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, అదనపు ఎస్పీ రాజ్‌కమల్‌తో పాటు అనేక మంది డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో తలమునకలై ఉన్నారు. పలువురు సబ్ కలెక్టరేట్ ఉద్యోగులను, అనుమానితులను విచారించారు. ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. కొందరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. ఫైళ్ల దహనంలో ప్రధాన అనుమానితుడిగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు, బినామీ మాధవరెడ్డి కోసం వేట కొనసాగిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల కదలికలపై పోలీసులు కన్నేశారు. ప్రస్తుత విచారణను ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. ఫైళ్ల దహనం ఘటన జరిగి రోజులు గడిచే కొద్దీ.. పెద్దిరెడ్డి అనుచరులు, బినామీల భూఅక్రమాలు, ఆగడాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. తమ తమ భూములను వారు ఎలా ఆక్రమించుకున్నదీ ఉన్నతాధికారులకు తెలియజేసేందుకు బాధితులు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తు బాధ్యతను ప్రభుత్వం సీఐడీకి అప్పగించనుంది. విచారణ కోసం ఏర్పాటు చేసే ఆరు బృందాల్లో ప్రతి బృందానికీ ఓ డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారని సమాచారం. సీఐలు,ఎస్‌ఐలు,కానిస్టేబుళ్లు ఈ బృందాల్లో ఉంటారు.అనుమానితుల కదలికలను పరిశీలించడంతో పాటు ఫోన్ కాల్స్ వివరాలపైనా ఆరా తీయనున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందితో పాటు బయట వ్యక్తులపైనా నిఘా ఉంచారు. ముఖ్యంగా ఐదుగురిపై పూర్తి స్థాయిలో డేగకన్ను వేసినట్లు సమాచారం.
కాలిపోయిన రికార్డుల వివరాల సేకరణ..
మదనపల్లె ఫైళ్ల దహనం వ్యవహారంలో సమాంతరంగా రెవెన్యూ శాఖ కూడా విచారణ సాగిస్తోంది. ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా విచారణను పర్యవేక్షిస్తున్నారు. కాలిపోయిన రికార్డుల వివరాల సేకరణలో కలెక్టర్ శ్రీధర్, జిల్లావ్యాప్తంగా పలువురు తహశీల్దార్లు నిమగ్నమై ఉన్నారు. మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలోని 11 మండలాల తహశీల్దార్ కార్యాలయాల్లో ఉన్న రికార్డులను పరిశీలిస్తున్నారు. ప్రధానంగా 22ఏ ఫైళ్లపై ఆరా తీస్తున్నారు.
బుగ్గిచేయడానికి 4 రోజుల ముందే..!
ఈ నెల 21న (ఆదివారం) రాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని కాల్చివేయడానికి నాలుగైదు రోజుల ముందే ముఖ్యమైన డాక్యుమెంట్ల మూటలను పెద్దిరెడ్డి బినామీ అయిన మాధవరెడ్డి రహస్య ప్రదేశానికి తరలించినట్లు ప్రచారంలో ఉంది. వీటిలో పెద్దిరెడ్డికి సంబంధించిన పలు ఫైళ్లు ఉన్నట్లు సమాచారం. ఫైళ్ల దహనం ఘటన జరిగాక.. తన ఇంట్లో సోదాలు నిర్వహిస్తారేమోనని ముందుగానే ఊహించి వాటిని మరెక్కడో మాధవరెడ్డి దాచినట్లు తెలుస్తోంది. అధికారుల లెక్క ప్రకారం.. సుమారు 2,400 ఫైళ్లు కాలి బూడిదయ్యాయి. అయితే బయటకు తీసుకెళ్లిన ఫైళ్లు ఇంకెన్ని ఉంటాయో విచారణలో నిగ్గు తేలాల్సి ఉంది. ఫైళ్ల దహనం వెనుక.. పెద్దిరెడ్డి, ఆయన అనుచరుల హస్తం ఉందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్న విషయం తెలిసిందే.
సిసోడియాను కలిసేందుకు పోటెత్తిన బాధితులు
భూ అక్రమాలపై వందల మంది ఫిర్యాదు
మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, ఇతర వైసీపీ నాయకుల భూఅక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు వందలాది మంది బాధితులు గురువారం మదనపల్లెకు తరలివచ్చారు. జోరుగా వర్షం కురుస్తున్నా.. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాను కలిసి తమ గోడు చెప్పుకొనేందుకు తడుస్తూనే క్యూలో నిలబడడం విశేషం. సబ్ కలెక్టర్ కార్యాలయంలో వారి నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. పెద్దిరెడ్డి, ఆయన అనుచరుల చేతుల్లో చిక్కుకున్న తమ భూములపై ఫిర్యాదు చేసేందుకు మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలోని 11 మండలాల నుంచి భారీగా తరలివచ్చారు. పుంగనూరు, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల నుంచి వచ్చిన ఈ బాధితులతో సబ్‌కలెక్టర్ కార్యాలయం కిటకిటలాడింది. బాధితులు 300 మందికి పైగా ఉండడం చూసి సిసోడియా సైతం ఆశ్చర్యపోయినట్లు సమాచారం. తొలి రోజే ఇంతమంది వచ్చారని.. వచ్చే 2-3 రోజుల్లో ఇంకెంత మంది వస్తారోనని అధికార వర్గాలు అంటున్నాయి.
మా భూమి ఆక్రమించి మాపైనే కేసులు
కోటావూరు గ్రామం నాయనబండపల్లెలోని సర్వే నంబరు 386లో ఉన్న 1.25 ఎకరాల భూమిని 2002లో ఇతరుల నుంచి మేం కొన్నాం. మరో 24 సెంట్ల భూమిని 2022లో కొనుగోలు చేశాం. వైసీపీ ప్రభుత్వంలో 2023 ఫిబ్రవరిలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, ఆయన బావమరిది భానుప్రకాశ్‌రెడ్డి అండదండలతో కోటావూరుకు వైసీపీ నాయకులు చెన్నకేశవ, వెంకటేశ్వరప్రసాద్ తదితరులు మా భూమిని ఆక్రమించి.. మాపైనే తప్పుడు కేసులు పెట్టారు. ప్రస్తుతం మా పొలంలో పంట పెట్టుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఆ భూములకు సంబంధించి మా వద్ద అన్ని రికార్డులూ ఉన్నాయి. మా ఊరి వీఆర్‌వో నరేంద్ర మా పేరు మీద ఉన్న ఆన్‌లైన్‌ను తీసేశాడు.
- నారాయణ, కోటావూరు,
బి.కొత్తకోట, తంబళ్లపల్లె నియోజకవర్గం