Srisailam: శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Mar 08 , 2024 | 06:41 AM
నంద్యాల: శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు.
నంద్యాల: శ్రీశైలం (Srisailam) క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (Mahashivratri Brahmotsavalu) వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. దైవ దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. శివనామస్మరణతో శ్రీశైలం ఆలయం మారుమ్రోగుతోంది. భక్తులతో కిక్కిరిసిన ఆలయ క్యూలైన్లు.. శివస్వాములతో ప్రత్యేక క్యూలైన్లు నిండిపోయాయి. భక్తులు వేకువ జామున నుంచి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
కాగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామి అమ్మవార్లు నందివాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం నందివాహనంపై స్వామిఅమ్మవార్ల ఆలయ ప్రదక్షిణ, స్వామిఅమ్మవార్లకు ప్రభోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి పదిగంటలకు ఆలయంలో నవనందుల పాగాళంకరణ అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులు భారీగా తరలి రానున్నారు. దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు (EO Peddi Raju) తెలిపారు. 9న రథోత్సవం, తెప్పోత్సవం కార్యక్రమాలు జరగనున్నాయి. 10న ధ్వజావరోహణం.. 11న అశ్వ వాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం కార్యక్రమాలతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా మహానంది, యాగంటి, ఓంకారం, కాల్వబుగ్గ క్షేత్రాల్లో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.