Mangalagiri : ఏపీ శాట్ కార్యాలయంలో ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Aug 09 , 2024 | 03:52 AM
ప్రభుత్వ కార్యాలయంలోనే ఓ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన ఎ.శిరీష రాణి మంగళగిరిలోని రాష్ట్ర సామాజిక తనిఖీ కేంద్రం(ఏపీ శాట్)లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
డైరెక్టర్ జగదీశ్ కుమార్ వేధింపులే
కారణమని ఆరోపణ ఆయన వైసీపీ ఎమ్మెల్సీకి బావమరిది అని వెల్లడి
మంగళగిరి సిటీ, ఆగస్టు 8: ప్రభుత్వ కార్యాలయంలోనే ఓ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన ఎ.శిరీష రాణి మంగళగిరిలోని రాష్ట్ర సామాజిక తనిఖీ కేంద్రం(ఏపీ శాట్)లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏపీ శాట్ డైరెక్టర్ జగదీశ్ కుమార్ నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారని, తరచుగా సెక్షన్లు మారుస్తూ, మెమోలు జారీ చేస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆమె ఆరోపించారు. బుధవారం మరోమారు కిందస్థాయి ఉద్యోగులకు మెమో జారీ చేశారని తాను వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా సహచర ఉద్యోగుల ముందు దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కార్యాలయంలోని మెడికల్ కిట్ నుంచి హానికరమైన మాత్రలను మింగి ఆత్మహత్యకు యత్నించారు.
గమనించిన తోటి ఉద్యోగులు ఆమెను మంగళగిరిలో ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ బావమరిది అయిన జగదీశ్ కుమార్ పదవీకాలం గత నెల 12నే ముగిసినప్పటికీ తన పలుకుబడిని ఉపయోగించుకుని మూడు నెలలు పొడిగించుకున్నారని, అప్పటి నుంచి కింది స్థాయి ఉద్యోగులపై వేధింపులు మరింత అధికమయ్యాయని ఉద్యోగులు సైతం వాపోయారు. జగదీశ్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని, ఆయన నుంచి తన కు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని శిరీష అన్నారు.