Minister Achennayudu : ఏలూరులో కొత్త ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ
ABN , Publish Date - Dec 15 , 2024 | 05:35 AM
రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచి, రైతులకు స్థిరమైన ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.
ఏర్పాటుకు డీపీఆర్: మంత్రి అచ్చెన్న
అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచి, రైతులకు స్థిరమైన ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. శనివారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించి, మాట్లాడారు. ‘ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లాలో కొత్త ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి డీపీఆర్‌ను తయారు చేయాలి. సాగు పెంపుదలకు అనుగుణంగా ఆయిల్‌పామ్ పరిశ్రమలకు మండలాలను కేటాయించాలి. పండ్ల తోటల సాగు ఆధారంగా క్లస్టర్లు ఏర్పాటు చేసి, నాణ్యమైన ఉత్పత్తులు సాధించేలా, ఎగుమతులను మరింత ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి’ అని అధికారులను ఆదేశించారు. రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు అందించేందుకు బడ్జెట్ కేటాయింపులు పెంచేలా కేంద్రాన్ని కోరతామని చెప్పారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, ఉద్యానశాఖ కమిషనర్ శ్రీనివాసులు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, శనివారం ఎక్స్ సామాజిక మాధ్యమంలో మంత్రి అచ్చెన్న స్పందిస్తూ... ‘రైతులపై వైసీపీ నేతలు కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారు. గత ఐదేళ్లూ రైతులకు తీవ్ర నష్టం, అన్యాయం జరిగింది. ధాన్యం డబ్బుల కోసం రైతులు కాళ్లు అరిగేలా తిరిగారు. ఇప్పుడు 24 గంటల్లోనే సొమ్ము అందుకుంటున్నారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంభించిన వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులతో నిరసనలు చేయడం సిగ్గుచేటు’ అని ధ్వజమెత్తరు.