Minister Kandula Durgesh : 27న ప్రపంచ టూరిజం డే
ABN , Publish Date - Sep 20 , 2024 | 06:15 AM
ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటక రంగానికి సంబంధించిన 38 విభాగాల్లో అవార్డులను అర్హులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రదానం చేయనున్నట్టు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
విజయవాడలో 38 విభాగాల్లో అవార్డుల ప్రదానం
రాష్ట్రంలో 4 ఐకానిక్ టూరిజం హబ్‌ల ప్రతిపాదన
గోదావరి జిల్లాల్లో అఖండ గోదావరి టూరిజం
సంగమేశ్వరాలయం ప్రాజెక్టు అభివృద్ధి: మంత్రి కందుల
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటక రంగానికి సంబంధించిన 38 విభాగాల్లో అవార్డులను అర్హులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రదానం చేయనున్నట్టు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజమహేంద్రవరంలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెంట్స్ ఫర్ కేపిటల్ ఇన్వె్‌స్టమెంట్(శాసి) పథకం కింద నాలుగు ప్రాంతాల్లో ఐకానిక్ టూరిజం హబ్‌లను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించాం. ఒకటి శ్రీశైలంలో టెంపుల్ టూరిజంతోపాటు టైగర్ రిజర్వు ఏరియా, వాటర్ ఫాల్స్ ప్రాంతాలను కలుపుకుని అభివృద్ధి చేస్తాం. రెండోది గోదావరి జిల్లాలోని ప్రాంతాలన్నీ కలుపుకుని అఖండ గోదావరి ప్రాజెక్టును అమలు చేయనున్నాం.
మూడోది బాపట్ల బీచ్ కారిడార్‌ను అభివృద్ధి చేసి, సూర్యలంకలో రిసార్ట్స్ నిర్మిస్తాం. నాల్గోది నంద్యాలలోని సంగమేశ్వరాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి ప్రతిపాదనలు చేశాం. ఒక్కో ప్రాజెక్టుకు కనీసం రూ.100 కోట్లు అవుతుందని అంచనా. కేంద్ర ప్రభుత్వ సహకారంతో శాసి, ప్రసాద్, స్వదేశీ దర్శన్ స్కీమ్‌ల కింద టూరిజాన్ని అభివృద్ధి చేయనున్నాం. తిరుపతి, గండికోటల్లో ఒబెరాయ్ సంస్థ టూరిజం అభివృద్ధి చేస్తోంది. ఎడ్వంచర్ టూరిజంలో భాగంగా స్వదేశీ దర్శనం కింద అరకు, లంబసింగి, బొర్రా గుహలను పర్యాటకంగా తీర్చి దిద్దనున్నాం. అమరావతిలో మెగా టూరిజం హబ్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. బ్లూఫాగ్ బీచ్‌గా రుషి కొండ బీచ్ అభివృద్ధికి అడుగులు వేస్తున్నాం. సాంస్కృతిక శాఖ ద్వారా నాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం. సంగీత నాట్య అకాడెమీ ఏర్పాటు చేస్తాం. నంది నాటకోత్సవాలపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నాం’ అని తెలిపారు.