జగన్ పత్రిక కొనుగోలుకు నిధులపై విచారణ
ABN , Publish Date - Oct 12 , 2024 | 04:58 AM
గత ప్రభుత్వంలో వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బందికి నెలనెలా ఒక్కొక్కరికి రూ.200 ఇస్తూ కేవలం జగన్ పత్రికనే కొనుగోలు చేయాలని అనధికారికంగా ఆదేశించారనే సమాచారం తమకు ఉందని, దీనిపై విచారణ జరుగుతోంద ని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు.
గృహ నిర్మాణ శాఖలో ఎన్నో అవకతవకలు
4500 కోట్లు పక్కదారి: మంత్రి పార్థసారథి
అమరావతి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బందికి నెలనెలా ఒక్కొక్కరికి రూ.200 ఇస్తూ కేవలం జగన్ పత్రికనే కొనుగోలు చేయాలని అనధికారికంగా ఆదేశించారనే సమాచారం తమకు ఉందని, దీనిపై విచారణ జరుగుతోంద ని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. పత్రిక కొనుగోలుకు సంబంధించిన జీవోను రద్దు చేశామని, ఎన్ని కొన్నారనే దానిపై విచారణ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రకటనల జారీలో ఇష్టానుసారంగా వ్యవహరించారని, దీనిపైనా విచారణ చేస్తున్నట్టు తెలిపారు. నచ్చిన పత్రిలకు పెద్ద ఎత్తున ప్రకటనలు జారీ చేశారని, ప్రభుత్వాన్ని భుజాన మోయని పత్రికలకు పూర్తిగా యాడ్స్ ఆపేశారన్నారు.
కొన్ని పత్రికలు తటస్థంగా ఉన్నా యాడ్స్ ఇచ్చి పేమెంట్ చేయలేదని, చివరకు వారే వెనక్కి తగ్గేలా నీచమైన పద్ధతిని పాటించారని విమర్శించారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో ఆఽధునికీకరించిన తన చాంబర్‌లోకి ఆయన శాస్త్రోక్తంగా ప్రవేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘గత ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ శాఖలో ఎన్నో అవకతవకలు జరిగాయి. కేంద్రం ఇచ్చిన దాదాపు రూ.4,500 కోట్ల నిధులను పక్కదారి పట్టించి నిరుపేదలకు అన్యాయం చేశారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్కో యూనిట్‌కు రూ.2.50 లక్షల రుణ సహాయాన్ని అందజేస్తే, దాన్ని రూ.1.80 లక్షలకు తగ్గించారు. ఎస్సీ, ఎస్టీల గృహ నిర్మాణాలకు రూ.50 వేల నుంచి లక్ష వరకు అదనంగా అందజేసే ఆర్థిక సాయాన్ని కూడా పూర్తిగా రద్దు చేశారు’ అని ధ్వజమెత్తారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు!
‘రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలోనే కాకుండా, ఇంకా వారికి ఏ విధంగా మేలు చేకూర్చగలమనే కోణంలో ఆలోచించి ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఈ దీపావళి నుంచి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీని అమలు చేయనున్నాం. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని 10.50 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారు. గత ప్రభుత్వం రంగులు, బొమ్మలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. పాఠశాలల్లో కేవలం బిల్డింగ్‌లు, రంగులు, గోడల నిర్మాణం తప్పితే ఏమీ చేయలేదు. విద్యార్థులకు చక్కని చదువు, జ్ఞానం, విజ్ఞానం అందజేయాలనే లక్ష్యంతో 16,700 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహిస్తున్నాం. గతంలో జరిగిన తప్పులను చక్కదిద్ది రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది’ అని పార్థసారథి అన్నారు.