Minister Lokesh :మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్‌కు 50 రోజులు
ABN , Publish Date - Dec 07 , 2024 | 05:50 AM
ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ‘ప్రజాదర్బార్’ శుక్రవారంతో 50 రోజులు పూర్తిచేసుకుంది.
ప్రజా సమస్యల పరిష్కారమే అజెండా.. 75% వినతుల పరిష్కారం
అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ‘ప్రజాదర్బార్’ శుక్రవారంతో 50 రోజులు పూర్తిచేసుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక మొదట తన నియోజకవర్గం మంగళగిరిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన లోకేశ్.. క్రమంగా ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తున్న బాధితుల సమస్యలు తెలుసుకుని, పరిష్కరించేందుకు ఉదయం 8గంటలకే ప్రజాదర్బారుకు హాజరవుతున్నారు. అర్జీదారులను నేరుగా కలిసి, ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, వారి గోడు వింటూ, వినతులు స్వీకరిస్తున్నారు. సోషల్‌మీడియా ద్వారా వచ్చే విజ్ఞప్తులనూ పరిశీలించి, పరిష్కార మార్గాలు చూపుతున్నారు. గడచిన 50రోజుల్లో 5,810 విజ్ఞప్తులు అందగా, 4,400(75ు) అర్జీలను పరిష్కరించారు. 1,410 పరిశీలన దశలో ఉన్నాయి. భూ వివాదాలకు సంబంధించి, 1,588 విజ్ఞప్తులు అందగా, 1,770 పరిష్కరించారు. హోంశాఖకు చెందిన 1,276 వినతులు రాగా, 1,158 పరిష్కరించారు. ఉద్యోగాల కోసం 800 దరఖాస్తులు అందగా, అర్హతలను బట్టి 347మందికి త్వరలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నారు. పింఛన్ల కోసం 350 అర్జీలు అందగా, త్వరలో పరిష్కారం చూపనున్నట్లు మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.