Amaravati: అమరావతి నిర్మాణానికి మంత్రి మండిపల్లి తొలి జీతం విరాళం
ABN , Publish Date - Aug 12 , 2024 | 10:15 PM
ర్మాణానికి.. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి (Mandipalli Ram Prasad Reddy) తనవంతు సాయం చేయడానికి ముందుకొచ్చారు. మండిపల్లి తన మొదటి నెల జీతం రూ. 3,01,116 విరాళంగా ఇచ్చారు...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (AP Capital Amaravati) నిర్మాణానికి.. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి (Mandipalli Ram Prasad Reddy) తనవంతు సాయం చేయడానికి ముందుకొచ్చారు. మండిపల్లి తన మొదటి నెల జీతం రూ. 3,01,116 విరాళంగా ఇచ్చారు. తన మొదటి నెల జీతాన్ని ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా మొత్తం అంతా చెక్కు రూపంలో రాజధాని నిర్మాణానికే ఇచ్చేశారు మంత్రి. సోమవారం రాత్రి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కలిసిన మండిపల్లి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మండిపల్లిని బాబు అభినందించారు. విరాళం విషయాన్ని అటు టీడీపీ అధికారిక సోషల్ మీడియా.. ఇటు రామ్ ప్రసాద్ రెడ్డి ఫేస్ బుక్ ద్వారా తెలియజేశారు. వావ్.. శభాష్ అంటూ అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు.. మండిపల్లిని అభినందిస్తున్నారు.
రండి.. రారండి..!
మంత్రిని ఆదర్శంగా తీసుకుని మిగిలిన మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా విరాళాలు ప్రకటించాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నారు. విభజన తర్వాత ఆర్థిక పరిస్థితి, వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రం అప్పుల పాలైందని.. ఖజనాలో ఖాళీ అయ్యిందన్న విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీల వరకూ చేయి చేయి కలిపి.. తోచినంత సాయం చేసి రాజధాని నిర్మాణంలో భాగంగా కావాలని టీడీపీ కార్యకర్తలు పిలుపునిస్తున్నారు. ఇప్పటికే ఎందరో సామాన్యులు, టీడీపీ వీరాభిమానులు తమ వంతుగా విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పలువురు విద్యార్థులు, చిన్నారులు సైతం టీడీపీ ప్రధాన కార్యాలయం, సచివాలయానికి వచ్చి చంద్రబాబుకు చెక్కుల రూపంలో విరాళాలు ఇచ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. 2014-2019 వరకూ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎందరో ఇటుకలు, డబ్బులు ఇలా ఎవరికి తోచినది వాళ్లు డోనేట్ చేశారు.
వడివడిగా అడుగులు!
ఇదిలా ఉంటే.. రాజధాని నిర్మాణ పనులకు తొలి అడుగు పడింది. కిందటి వైసీపీ ప్రభుత్వ విధ్వంసానికి బలి అయిన అమరావతి రాజధానిని మళ్లీ గాడిన పెట్టేందుకు వీలుగా టీడీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలలో భాగంగా తొలి అడుగుగా కంపచెట్లు, పిచ్చిచెట్లు, తుమ్మ చెట్ల తొలగింపు ప్రారంభమైంది. అమరావతి రాజధాని అంతా గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాపానికి శాపంగా పిచ్చిచెట్ల, ముళ్ల చెట్లతో అడవిలా మారిపోయింది. వీటిని తొలగించటానికి సీఆర్‌డీఏ అధికారులు రూ.36.50 కోట్లతో టెండర్లు పిలవాల్సి వచ్చింది. టెండర్లను ఇటీవలే ఖరారు చేశారు. ఎన్‌సీసీఎల్ సంస్థ ఈ టెండర్లను దక్కించుకుంది. ఎన్‌సీసీఎల్ సంస్థ పిచ్చి, తుమ్మ చెట్ల తొలగింపు చేపట్టింది. సెక్రటేరియట్ వెనుక వైపున ఎన్-09 రోడ్డు నుంచి పనులు ప్రారంభం అయ్యాయి. మునిసిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ దగ్గరుండి మరీ ఈ పనులు పర్యవేక్షిస్తున్నారు. జంగిల్ క్లియరెన్స్‌ను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని, రాజధాని క్యాపిటల్ పరిధిలోని మొత్తం 99 డివిజన్లలో ఒకేసారి పనులు మొదలుపెట్టనున్నట్టు మంత్రి మీడియాతో చెప్పారు. వీలైనంత వరకూ నెల రోజుల్లోనే జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేస్తామని నారాయణ వెల్లడించారు.