Minister Narayana: ఏపీ రాజధానిపై మంత్రి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 15 , 2024 | 12:26 PM
వైసీపీ అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఇవాళ ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఏపీ రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నంత కాలం ఏపీకి మూడు రాజధానులంటూ నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే.
నెల్లూరు: వైసీపీ అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఇవాళ ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఏపీ రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నంత కాలం ఏపీకి మూడు రాజధానులంటూ నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే. గెలుస్తామన్న ధీమాతో విశాఖలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే సీఎం సీటు పాయే.. మూడు రాజధానులు పాయే..
కాగా.. మంత్రి నారాయణ మాత్రం నేడు ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని అని స్పష్టం చేశారు. అమరావతిని నిర్మించి చూపిస్తామని తెలిపారు. రాజధాని భూముల సేకరణ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గతంలో టీడీపీ హయాంలో 11లక్షల టిడ్కో ఇళ్లు నిర్మించామన్నారు. ఇప్పుడు కూడా టిడ్కో ఇళ్ల నిర్మాణాలని కొనసాగిస్తామన్నారు. ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు ఇస్తామని తెలిపారు. తన మీద నమ్మకంతో నెల్లూరు ప్రజలు 73 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారని... నెల్లూరుని అన్ని విధాల అభివృద్ది చేస్తానని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.