Nagarjuna Sagar Dam: రేపు ఉదయం 8 గంటలకు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత
ABN , Publish Date - Aug 04 , 2024 | 08:22 PM
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. క్రమంగా నీటి మట్టాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రేపు (సోమవారం) ఉదయం 8 గంటలకు నాగార్జున సాగర్ గేట్లు తెరవాలని అధికారులు నిర్ణయించారు.
అమరావతి: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. క్రమంగా నీటి మట్టాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రేపు (సోమవారం) ఉదయం 8 గంటలకు నాగార్జున సాగర్ గేట్లు తెరవాలని అధికారులు నిర్ణయించారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం రేపు ఉదయానికి చేరుకోనుంది. అందుకే రేపే గేట్లను పైకెత్తి నీటిని దిగువకు వదలాలని అధికారులు నిర్ణయించారు. కాగా ఇవాళ సాయంత్రం 6 గంటలకే ప్రాజెక్టు నీటిమట్టం 575 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండడంతో రేపు ఉదయానికి పూర్తి స్థాయిలో నిండనుంది. శ్రీశైలం నుంచి 3 లక్షల 50 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.
మరోవైపు.. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 4,00,491 క్యూసెక్కులుగా ఉంది. ఇక ఔట్ ఫ్లో 4,27,711 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.90 అడుగుల మేర నిండింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203.8909 టీఎంసీలు ఉన్నాయి. ఇక జలాశయం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
కాగా శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరద కొనసాగుతోంది. సమయం గడిచే కొద్దీ నీటి మట్టం క్రమంగా పెరుగుతూ ఉంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి ఇన్ ఫ్లో కూడా కొనసాగుతోంది.