Share News

Narsaraopeta : సాగర్‌ గేట్లన్నీ తెరచుకున్నాయ్‌

ABN , Publish Date - Aug 09 , 2024 | 04:20 AM

వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ జలశయాలన్నీ నిండుకుండలా మారాయి. శ్రీశైలం నుంచి భారీగా వరద కొనసాగుతుండడంతో గురువారం నాగార్జునసాగర్‌ జలాశయం అన్ని గేట్లూ తెరుచుకున్నాయి.

Narsaraopeta : సాగర్‌ గేట్లన్నీ తెరచుకున్నాయ్‌

  • 26 గేట్లు ఎత్తి 2.74 లక్షల క్యూసెక్కులు విడుదల

  • పులిచింతల, ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద

నరసరావుపేట (ఆంధ్రజ్యోతి), తాడేపల్లి టౌన్‌, కొల్లూరు, ఆగస్టు 8: వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ జలశయాలన్నీ నిండుకుండలా మారాయి. శ్రీశైలం నుంచి భారీగా వరద కొనసాగుతుండడంతో గురువారం నాగార్జునసాగర్‌ జలాశయం అన్ని గేట్లూ తెరుచుకున్నాయి.

డ్యాం 26 క్రస్ట్‌ గేట్లను తెరచి 2,74,065 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.40 అడుగలకు చేరింది. పూర్తిస్థాయి నీటినిల్వ సామరధ్యం 312.05 టీఎంసీలకు 295.58 టీఎంసీల నీటి నిల్వ ఉంది. సాగర్‌ గేట్లన్నీ ఎత్తడంతో పై నుంచి జాలువారుతున్న కృష్ణమ్మ సోయగాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు పర్యాటకులు పోటెత్తారు.

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద

ఎగువ ప్రాజెక్టుల నుండి భారీగా వరదనీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతోంది. సాగర్‌ నుంచి పులిచింతలకు వచ్చిన నీటిని దిగువకు వదులుతున్నారు. గురువారం పులిచింతల నుంచి 2.56 లక్షల క్యూసెక్కులు, కీసర వాగు నుంచి 54 వేల క్యూసెక్కు వరద ప్రకాశం బ్యారేజీకి చేరుతున్నట్టు నీటిపారుదల శాఖ జెఈ దినేశ్‌ తెలిపారు.

బ్యారేజీలో 12 అడుగుల నీటిమట్టం కొనసాగుతుండగా 60 గేట్లను 7 అడుగులు, 10 గేట్లను 8 అడుగుల మేర ఎత్తి దిగువకు 2.96లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 13వేల 800 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్టు జేఈ తెలిపారు.


లంక గ్రామాల్లో పంటలు మునక

కృష్ణానదికి వరద పోటెత్తింది. దీంతో ప్రకాశం బ్యారేజీ నుంచి సుమారు 2.96 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని అరవింద వారధి, గాజుల్లంక, పోతార్లంక, జువ్వలపాలెం పుష్కర ఘాట్‌లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. గాజుల్లంక వద్ద చిన్నరేవులో వరద మెల్లమెల్లగా పెరుగుతోంది. దీంతో గ్రామ పరిధిలోని పల్లపు ప్రాంతాల్లో వాణిజ్య పంటలు, ఇటుక బట్టీలు నీట మునిగాయి.

ఈ ప్రవాహం దోనేపూడి కరకట్ట దిగువన ఉన్న పోతార్లంక లోలెవల్‌ చప్టాపై నుంచి వెళ్లే అవకాశాలు ఉండటంతో ఆ రహదారిపై రాకపోకలు నిలిపి వేయనున్నారు. గాజుల్లంక, పోతార్లంక మధ్యన కృష్ణానది అంచులు బలహీనంగా ఉండటంతో వరద నీరు పంట పొలాలను ముంచెత్తుతోంది. వరద ఉధృతి 4 లక్షల క్యూసెక్కులకు పైగా పెరిగితే రహదారులపై కూడా వరద నీరు ప్రవహించే సూచనలు కనిపిస్తున్నాయి. దీని వల్ల పలు లంక గ్రామాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి.

పోలవరం వద్ద పెరిగిన గోదావరి

పోలవరం, ఆగస్టు 8: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం గురువారం నాటికి కొద్దిగా పెరిగింది. ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి 7,43,222 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేశారు.

Updated Date - Aug 09 , 2024 | 04:20 AM