Share News

సాగునీటి పొదుపునకు చర్యలు

ABN , Publish Date - Jan 28 , 2024 | 09:56 PM

జిల్లాలో రబీ సీజన్‌(మొదటి పంట)లో సుమారు మూడు లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. పెరుగుతున్న ఎండలతో జలాశయాలు, రిజర్వాయర్‌ల్లో నీటి నిల్వలు క్రమేణా తగ్గుతున్నాయి. దీంతో పంట చివరి దశకు చేరేటప్పటికి సాగునీటి కష్టాలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో వారం కిందట జిల్లా కలెక్టర్‌ ఇరిగేషన్‌ అధికారులతో చర్చించా

సాగునీటి పొదుపునకు చర్యలు
28ఎస్‌జిఎం1: సాగులో ఉన్న వరి పైరు

మూడు లక్షల ఎకరాల్లో వరిసాగు

పెరుగుతున్న ఎండలు

క్రమేణా తగ్గుతున్న నీటి నిల్వలు

వారబంది (పూటల పద్ధతి)కి శ్రీకారం

సంగం, జనవరి 28: జిల్లాలో రబీ సీజన్‌(మొదటి పంట)లో సుమారు మూడు లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. పెరుగుతున్న ఎండలతో జలాశయాలు, రిజర్వాయర్‌ల్లో నీటి నిల్వలు క్రమేణా తగ్గుతున్నాయి. దీంతో పంట చివరి దశకు చేరేటప్పటికి సాగునీటి కష్టాలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో వారం కిందట జిల్లా కలెక్టర్‌ ఇరిగేషన్‌ అధికారులతో చర్చించారు. భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తకుండా సాగునీటి పొదుపునకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆ మేరకు అధికారులు జిల్లాలోని కొన్ని కాలువ కింద వారబంది (పూటల పద్ధతి)కి శ్రీకారం చుట్టారు.

తక్కువుగా నీటి నిల్వలు

జిల్లాలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల అటు సోమశిల జలాశయం, ఇటు రిజర్వాయరు, చెరువుల్లో నీటి నిల్వలు తక్కువగా చేరాయి. నవంబరులో జరిగిన ఐఏబీ సమావేశం నాటికి సోమశిలలో 29 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ప్రాధాన్యత కింద డెల్టాకు 2 లక్షల ఎకరాలకు నవంబరు 20 నుంచి సాగునీటి విడుదలకు అనుమతి ఇచ్చారు. ఇంతలో తుఫాన్‌ రావడంతో ఒక్క రోజు నీటి విడుదల చేసి నిలిపి వేశారు. తుఫాన్‌ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 7 టీఎంసీల నీరు జలాశయంలో చేరింది. దీంతో జలాశయంలో నీటి మట్టం 36 టీఎంసీలకు చేరింది. పెరిగిన ఈ నీటి నిల్వలను కనుపూరు, బెజవాడ పాపిరెడ్డి, ఉత్తర, దక్షిణ కాలువ కింద కొంత మేరకు సాగుకు అనుమతిచ్చారు. ప్రస్తుత రబీ సీజన్‌లో సుమారు 3 లక్షల ఎకరాల్లో వరి సాగైనట్లు ఇరిగేషన్‌ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం సోమశిలలో నీటి నిల్వ 27 టీఎంసీలకు చేరింది.

రైతుల ఆందోళన

నవంబరులో నీటి విడుదల చేసిన తరువాత నారుమళ్లు పోసినా వర్షాలకు దెబ్బతిన్నాయి. దీంతో కొన్ని చోట్ల నాట్లు ఆలస్యమయ్యాయి. ఎక్కువ శాతం డిసెంబరు చివర వారంలో నాట్లు వేశారు. కొందరు జనవరి మొదట్లో కూడ నాట్లు వేశారు. ఆలస్యంగా నాటిని నాట్లకు ఏప్రిల్‌ 15 వరకు సాగునీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇరిగేషన్‌ అధికారులు మార్చి 15 వరకే నీటి విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తగ్గుతున్న నీటి నిల్వలు

సోమశిలతోపాటు జిల్లాలోని చెరువుల్లో నీటి నిల్వలు క్రమేణా తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం సోమశిలలో నీటి నిల్వ 27 టీఎంసీలకు పడిపోయింది. డెడ్‌ స్టోరేజ్‌, వేసవిలో జిల్లా ప్రజలకు తాగునీటి అవసరాలకు పోను ఇక సాగుకు అందేది కేవలం 18 టీఎంసీలే. దీనికితోడు ఎండలు పెరుగుతున్నాయి. జలాశయంలో నీటి ఆవిరి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో సాగైన పైరుకు చివరి ఆయకట్టుకు సాగునీటిని అందించాల్సిన పరిస్థితి అధికార యంత్రాంగంపై ఉంది.

వారబందికి శ్రీకారం

కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఇరిగేషన్‌ అధికారులు నీటి పొదుపు చర్యల్లో భాగంగా వారబంది(పూటల పద్ధతి)కి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కనిగిరి రిజర్వాయర్‌ కింద అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సంగం డెల్టాలో సోమవారం నుంచి అమలుకు శ్రీకారం చుట్టారు. అంటే సోమ, మంగళ, బుధ, గురువారాల్లో కాలువలకు నీటిని విడుదల చేస్తారు. మిగతా మూడు రోజుల్లో నీటిని నిలిపి వేయనున్నారు.

రైతులు సహకరించాలి

సోమశిలలో నీటి నిల్వలు పడిపోతున్నాయి. కాలువలకు వారబంది (పూటల పద్ధతి) విధానం అమలు చేయనున్నాం. నీటిని వృఽథా చేయకుండా చివరి ఆయకట్టు వరకు నీరు పారేలా రైతులు సహకరించాలి.

- బీవీ కృష్ణ, ఏఈఈ, సంగం ఇరిగేషన్‌ సెక్షన్‌

---------------------

Updated Date - Jan 28 , 2024 | 09:56 PM